
అమెరికాలో ఐఫోన్లను తయారు చేయకపోతే యాపిల్ కంపెనీపై 25 శాతం సుంకాలను విధిస్తామని యూఎస్ ప్రెసిడెంట్ 'డొనాల్డ్ ట్రంప్' పేర్కొన్నారు. ఇప్పుడు ఈ రూల్ శాంసంగ్ సహా ఇతర అన్ని స్మార్ట్‌ఫోన్ సంస్థలకు వర్తిస్తుందని ట్రంప్ వైట్ హౌస్ వద్ద మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.
అమెరికా విధించే సుంకాల ప్రభావం ఉండకూడదు అనుకుంటే.. స్మార్ట్‌ఫోన్ తయారీదారులు ఇక్కడే (అమెరికాలో) ప్లాంట్స్ ఏర్పాటు చేసుకోవాలి. అలా కాకుండా భారతదేశంలో లేదా ఇతర ఏ దేశంలోనో తయారు చేసిన ఫోన్లను అమెరికాకు దిగుమతి చేసుకుంటే.. 25 శాతం సుంకం చెల్లించాల్సి ఉంటుందని అన్నారు.
సౌత్ కొరియా దిగ్గజమైన 'శాంసంగ్' అమెరికా మార్కెట్లో అత్యధిక అమ్మకాలు చేపడుతున్న రెండో మొబైల్ కంపెనీగా ఉంది. గ్లోబల్ మార్కెట్లో ఈ సంస్థ ప్రతి సంవత్సరం 220 మిలియన్ ఫోన్స్ విక్రయిస్తోంది. ఇందులో సుమారు 60 శాతం ఫోన్స్.. వియత్నాంలో ఉత్పత్తి అవుతున్నాయి. ఇక్కడి నుంచే ప్రపంచంలోనే చాలా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇకపై ఈ విధానంతో అమెరికాకు శాంసంగ్ ఫోన్స్ తీసుకుని వస్తే.. సుంకాలు చెల్లించక తప్పదు.