
2025–26లో 6.5% వృద్ధికి పరిమితం
ఆసియా అభివృద్ధి బ్యాంక్ అంచనా
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ జూన్ త్రైమాసికంలో (క్యూ1) బలమైన వృద్ధి రేటు (7.8 శాతం)ను నమోదు చేసినప్పటికీ.. పూర్తి ఆర్థిక సంవత్సరంలో (2025–26) 6.5 శాతానికి పరిమితం కావొచ్చని ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) మరోసారి తన అంచనాలను ప్రకటించింది. భారత్‌పై అమెరికా మోపిన 50 శాతం టారిఫ్‌లు వృద్ధి అవకాశాలకు విఘాతం కలిగిస్తాయని, ముఖ్యంగా ద్వితీయ ఆరు నెలలపై ఈ ప్రభావం ఉంటుందని పేర్కొంది.
ఏడీబీ ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించిన అంచనాల్లో భారత జీడీపీ 7 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుందని ప్రకటించడం గమనార్హం. భారత్‌పై టారిఫ్‌లు విధిస్తున్నట్టు అమెరికా ప్రకటించడంతో జూలైలో వృద్ధి రేటు అంచనాను 6.5శాతానికి తగ్గించింది. ఇప్పుడు కూడా అదే అంచనాను కొనసాగించింది.
‘‘వినియోగం పెరగడం, ప్రభుత్వం అధికంగా వ్యయం చేయడంతో క్యూ1లో భారత్ జీడీపీ 7.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. భారత ఎగుమతులపై అమెరికా అదనంగా టారిఫ్‌లు విధించడం వృద్ధి రేటును తగ్గిస్తుంది. ముఖ్యంగా 2025–26 ద్వితీయార్ధం, 2026–27 వృద్ధిపై ఈ ప్రభావం ఉంటుంది. అదే సమయంలో స్థిరమైన దేశీ వినియోగం, సేవల ఎగుమతులు ఈ ప్రభావాన్ని తగ్గిస్తాయి’’అని ఏడీబీ తాజా నివేదిక వెల్లడించింది.
ప్రభావం పరిమితమే..
జీడీపీలో ఎగుమతుల వాటా తక్కువగా ఉండడం, అదే సమయంలో ఇతర దేశాలకు ఎగుమతులు పెరగడంతో వృద్ధి రేటుపై అమెరికా టారిఫ్‌ల కారణంగా పడే ప్రభావం పరిమితంగానే ఉంటుందని ఏడీబీ తెలిపింది. సేవల ఎగుమతులు బలంగా ఉన్నాయంటూ, వాటిపై టారిఫ్‌లు లేని విషయాన్ని గుర్తు చేసింది. పరపతి విధాన పరంగా దేశీ వినియోగానికి ఊతమివ్వడాన్ని సైతం ప్రస్తావించింది.
ఇక ప్రభుత్వం అంచనా వేసిన 4.4 శాతం కంటే అధికంగా ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉండొచ్చని ఏడీబీ నివేదిక పేర్కొంది. జీఎస్‌టీ శ్లాబుల కుదింపు కారణంగా పన్ను ఆదాయం తగ్గనుందని, 2025–26 బడ్జెట్ అంచనాలు ప్రకటించే నాటికి ఈ ప్రతిపాదన లేకపోవడాన్ని గుర్తు చేసింది. అదే సమయంలో 2024–25 ఆర్థిక సంవత్సరం జీడీపీలో ద్రవ్యలోటు 4.7 శాతం కంటే తక్కువే ఉండొచ్చని అంచనా వేసింది.
కరెంట్ ఖాతా లోటు మాత్రం జీడీపీలో 0.9 శాతానికి ఎగబాకొచ్చని తెలిపింది. క్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది 0.6 శాతంగా ఉంది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2026–27) కరెంటు ఖాతా లోటు 1.1 శాతానికి పెరగొచ్చని పేర్కొంది. ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 3.1 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. అంచనాలకు మించి ఆహార ధరలు వేగంగా తగ్గడాన్ని ప్రస్తావించింది. 2025–26 మొదటి నాలుగు నెలల్లో కేంద్ర ప్రభుత్వ వ్యయాలు ఆదాయానికి మించి బలంగా ఉన్నట్టు, దీంతో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే ద్రవ్యలోటు పెరిగినట్టు వివరించింది.