ఏటా 10లక్షల టన్నుల సామర్థ్యంతో అదానీ కాపర్‌ ఫెసిలిటీ

Adani Copper Facility With A Capacity Of 10 Lakh Tonnes Per Annum - Sakshi

1.1 బిలియన్‌ డాలర్లతో ఏర్పాటు

మార్చి 2024లో ప్రారంభించే అవకాశం

గుజరాత్‌లోని ముంద్రాలో అదానీ గ్రూప్ 1.1 బిలియన్‌ డాలర్లతో గ్రీన్‌ఫీల్డ్ కాపర్ ఫెసిలిటీని మార్చి 2024లో ప్రారంభించనుంది. ఏటా 10లక్షల టన్నుల సామర్థ్యంతో దీన్ని రూపొందిచనున్నట్లు సమాచారం. రెండు దశల్లో పూర్తయ్యే ఈ ప్రాజెక్ట్ బంగారం, వెండి, నికెల్, సెలీనియంకు సంబంధించిన ఉప ఉత్పత్తులతో పాటు కాపర్‌ కేథోడ్‌లు, రాడ్‌లను ఉత్పత్తి చేయనుంది.

దీంతోపాటు ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్‌తో సల్ఫ్యూరిక్ యాసిడ్‌ను కూడా తయారుచేయనున్నారు. ఈ మిశ్రమం ఎరువులు, డిటర్జెంట్లు, ఫార్మాస్యూటికల్స్, పేపర్, షుగర్ బ్లీచింగ్, వాటర్ ట్రీట్‌మెంట్‌తోపాటు ఇతర పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. కాపర్‌ను విద్యుత్ పరికరాల ఉత్పత్తికి, పవర్ ట్రాన్స్‌మిషన్, పునరుత్పాదక ఇంధన రంగానికి విరివిగా వాడుతారు. దాంతొ భవిష్యత్తులో కాపర్‌కు చాలా డిమాండ్‌ ఉంటుందని భావిస్తున్నారు. కానీ దేశంలో దాని నిలువలు పరిమితంగానే ఉన్నాయి.  

దేశీయ కంపెనీలు దిగుమతులపైనే ఆధారపడుతున్నాయి. అయితే ఈ ప్లాంట్‌కు సంబంధించిన ముడిసరుకును లాటిన్‌ అమెరికా నుంచి దిగుమతి చేసుకోనున్నారు. ఇప్పటికే దేశీయంగా హిందాల్కో వంటి కంపెనీలు కాపర్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి.  

పారిశ్రామికంగా వినియోగించే లోహాల్లో స్టీల్‌, అల్యూమినియం తర్వాత స్థానంలో రాగి ఉంటుంది. భారతదేశంలో లోహల పరంగా తలసరి వినియోగం కేవలం 0.6 కిలోలు. అదే ప్రపంచ సగటు 3.2 కిలోలుగా ఉందని నివేదికలు చెబుతున్నాయి. అయితే దేశంలోని రాగి ఎగుమతులు ఇటీవల క్షీణించాయని కచ్ కాపర్ దీన్ని భర్తీ చేస్తుందని కంపెనీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. కాపర్ ప్లాంట్ ఉప ఉత్పత్తులను  తమ గ్రూప్ సంస్థ అదానీ సిమెంట్స్ వినియోగించుకోగలదని కంపెనీ తెలిపింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top