కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ కేంద్ర వేతన సంఘం (8th Central Pay Commission) ప్రక్రియ వేగంగా సాగుతోంది. కొత్త వేతన సవరణలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉండబోతుందనే అంశంపైనే ఉద్యోగుల్లో ప్రధాన చర్చ జరుగుతోంది. ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ నిర్ణయించిన తర్వాత తమ కనీస వేతనం రూ.69 వేలకు పెరుగుతుందని ఉద్యోగులు భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం లేదా 8వ వేతన సంఘం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను అధికారికంగా ఖరారు చేయలేదు.
రూ.69,000 వరకు బేసిక్ పే?
8వ వేతన సంఘంతో గత ఏప్రిల్ 28న జరిగిన సమావేశంలో నేషనల్ కౌన్సిల్–జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ (NC-JCM) ఉద్యోగుల తరఫున పలు కీలక ప్రతిపాదనలు చేసింది. ఇందులో ప్రస్తుతం ఉన్న కనీస ప్రాథమిక వేతనం రూ.18,000ను రూ.69,000కు పెంచాలని, అందుకు అనుగుణంగా 3.833 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ లెక్క 18,000 × 3.833 ఆధారంగా రూపొందింది.
అంటే ఇది ఉద్యోగ సంఘాల డిమాండ్ మాత్రమే. 8వ వేతన సంఘం తుది సిఫార్సులు, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వచ్చినప్పుడే కొత్త వేతనాలు ఎంత ఉంటాయో స్పష్టమవుతుంది.
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏమిటి?
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది ప్రస్తుత ప్రాథమిక వేతనాన్ని గుణించి సవరించిన ప్రాథమిక వేతనాన్ని నిర్ణయించేందుకు ఉపయోగించే గుణకం. ఉదాహరణకు ప్రస్తుతం లెవెల్-1 ఉద్యోగికి రూ.18,000 ప్రాథమిక వేతనం ఉంది. ఒకవేళ 3.833 ఫ్యాక్టర్‌నే అమలు చేస్తే అది సుమారు రూ.68,994 అవుతుంది. ఉద్యోగ సంఘాల రూ.69,000 కనీస వేతన డిమాండ్‌కు ఇది దగ్గరగా ఉంటుంది.
అదే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57గా ఉంటే రూ.18,000 ప్రాథమిక వేతనం రూ.46,260 అవుతుంది. 2.00 అయితే రూ.36,000, 1.83 అయితే రూ.32,940గా ఉంటుంది. అయితే ఈ లెక్కలు ప్రాథమిక వేతనానికి మాత్రమే వర్తిస్తాయి. చేతికి వచ్చే మొత్తం జీతం ఇంతే శాతంలో పెరుగుతుందని భావించకూడదు. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు, కొత్త పే మ్యాట్రిక్స్ వంటి అంశాలపై తుది వేతనం ఆధారపడి ఉంటుంది.
3.833పై ఎందుకు ఆశలు?
ఉద్యోగ సంఘాల లెక్కల ప్రకారం జీవన వ్యయం, కుటుంబ అవసరాలు, ద్రవ్యోల్బణం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని కనీస వేతనాన్ని రూ.69,000గా నిర్ణయించాలనే ప్రతిపాదన వచ్చింది. దీనికి అనుగుణంగానే 3.833 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను సూచించారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లలో వార్షిక ఇన్‌క్రిమెంట్‌ను ప్రస్తుత 3 శాతం నుంచి 6 శాతానికి పెంచాలన్న ప్రతిపాదన కూడా ఉంది.
8వ వేతన సంఘం తుది నిర్ణయం ఎప్పుడు?
8వ కేంద్ర వేతన సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం 2025 నవంబర్ 3న ఏర్పాటు చేసింది. కమిషన్‌కు తన నివేదిక సమర్పించేందుకు 18 నెలల గడువు ఇచ్చారు. ప్రస్తుతం ఉద్యోగులు, పెన్షనర్లు, ఉద్యోగ సంఘాలు, వివిధ సంస్థల నుంచి అభిప్రాయాలు, డిమాండ్లను సేకరించే ప్రక్రియ కొనసాగుతోంది.
కమిషన్ 2026 ఆగస్టు 31–సెప్టెంబర్ 1 తేదీల్లో జైపూర్‌లో ఉద్యోగ, పెన్షనర్ సంఘాలతో సమావేశాలు నిర్వహించనుంది. అనంతరం దేశంలోని పలు ప్రాంతాల్లో సంప్రదింపులు కొనసాగనున్నాయి.
ఇదీ చదవండి: ఐటీ కంపెనీ ఉద్యోగులకు బోనస్.. జీతాల పెంపుపై అప్డేట్


