
రూ.6 లక్షల కోట్లతో నిర్మాణం
10 శాతానికి తగ్గిన లాజిస్టిక్స్ వ్యయాలు
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రూ.6లక్షల కోట్లతో 10,000 కిలోమీటర్ల పొడవైన 25 గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేలను నిర్మిస్తున్నట్టు కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఎక్స్‌ప్రెస్ రహదారులు, ఆర్థిక నడవాల నిర్మాణంతో దేశంలో లాజిస్టిక్స్ (రవాణా) వ్యయాలు గతంలో ఉన్న 16 శాతం నుంచి 10 శాతానికి తగ్గినట్టు చెప్పారు.
డిసెంబర్ నాటికి ఇది 9 శాతానికి తగ్గుతుందని, అప్పుడు భారత్ పోటీతత్వం మరింత పెరుగుతుందన్నారు. పీహెచ్‌డీసీసీఐ వార్షిక సమావేశంలో భాగంగా మంత్రి ప్రసంగించారు. లాజిస్టిక్స్ వ్యయాలు యూఎస్, ఐరోపా దేశాల్లో 12 శాతం మేర ఉండగా, చైనాలో 8–10 శాతం మధ్య ఉండడం గమనార్హం. ఈ వ్యయం ఎంత కనిష్టానికి తగ్గితే, అంతర్జాతీయ వాణిజ్యంలో అంతగా పోటీపడొచ్చు. దీంతో దీన్ని సాధ్యమైనంత తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది.
నంబర్ 1 స్థానానికి ఆటోమొబైల్ రంగం
భారత ఆటోమొబైల్ రంగం వచ్చే ఐదేళ్లలో ప్రపంచంలోనే నంబర్ 1 స్థానానికి చేరుకుంటుందని మంత్రి గడ్కరీ మరోసారి పునరుద్ఘాటించారు. ‘‘రవాణా మంత్రిగా బాధ్యతలు తీసుకునే నాటికి భారత ఆటోమొబైల్ పరిశ్రమ పరిమాణం రూ.14 లక్షల కోట్లుగా ఉంటే, ఇప్పుడు రూ.22 లక్షల కోట్ల కు చేరుకుంది. 4 లక్షల మందికి పరిశ్రమ ఉపాధి కల్పించడమే కాకుండా, కేంద్ర, రాష్ట్రాలకు జీఎస్‌టీ రూపంలో పెద్ద ఎత్తున ఆదాయాన్ని అందిస్తోంది.
ప్రస్తుతం యూఎస్ ఆటోమొబైల్ పరిశ్రమ పరిమాణం రూ.78 లక్షల కోట్లుగా, చైనా రూ.47 లక్షల కోట్లుగా ఉంది’’అని మంత్రి వివరించారు. వ్యూహా త్మకమైన జోజిలా టన్నెల్ (సొరంగ మార్గం) నిర్మాణం పనులు 80 శాతం వరకు పూర్తయ్యాయని చెబుతూ.. ఇది అందుబాటులోకి వస్తే అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో లద్దాక్ ప్రాంతానికి అనుసంధానత ఏర్పడుతుందన్నారు.
దేశ ప్రగతికి గ్రీన్ ఇంధనాలు కీలకం
శిలాజ ఇంధనాల (పెట్రోలియం ఉత్పత్తులు) దిగుమతుల కోసం ఏటా రూ.22 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తున్నట్టు మంత్రి గడ్కరీ తెలిపారు. పైగా వీటి వల్ల పర్యావరణానికి ఎంతో హాని కలుగుతుందన్నారు. భారత ప్రగతికి శుద్ధ ఇంధనాల వినియోగం కీలకమని చెప్పారు. దేశ జీడీపీ వృద్ధికి వ్యవసాయ రంగంపైనా దృష్టి సారించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. మొక్కజొన్న నుంచి ఇథనాల్ తయారీతో రైతులకు రూ.45వేల కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరినట్టు చెప్పారు.
‘‘మొక్కజొన్న నుంచి ఇథనాల్ తయారు చేయాలని నిర్ణయించినప్పుడు.. క్వింటా మొక్కజొన్న మార్కెట్ ధర రూ.1,200 ఉంటే, మద్దతు ధర రూ.1,800గా ఉంది. పెట్రోల్‌లో ఇథనాల్ కలపాలని నిర్ణయించిన తర్వాత మొక్కజొన్న ధర రూ.2,800కు పెరిగింది. దీనివల్ల రైతులకు రూ.45,000 కోట్లు అదనంగా సమకూరింది’’అని మంత్రి వివరించారు. జాతీయ రహదారుల నిర్మాణంలో 80 లక్షల టన్నుల వ్యర్థాలను వినియోగించినట్టు వెల్లడించారు. ఢిల్లీలో పర్యావరణ కాలుష్యం ఎంతో పెరిగిపోయిందని చెబుతూ, దీన్ని తగ్గించడం ప్రభుత్వ ప్రాధాన్యంగా పేర్కొన్నారు.