breaking news
Union transport ministry
-
25 గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ రహదారులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రూ.6లక్షల కోట్లతో 10,000 కిలోమీటర్ల పొడవైన 25 గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేలను నిర్మిస్తున్నట్టు కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఎక్స్‌ప్రెస్ రహదారులు, ఆర్థిక నడవాల నిర్మాణంతో దేశంలో లాజిస్టిక్స్ (రవాణా) వ్యయాలు గతంలో ఉన్న 16 శాతం నుంచి 10 శాతానికి తగ్గినట్టు చెప్పారు. డిసెంబర్ నాటికి ఇది 9 శాతానికి తగ్గుతుందని, అప్పుడు భారత్ పోటీతత్వం మరింత పెరుగుతుందన్నారు. పీహెచ్‌డీసీసీఐ వార్షిక సమావేశంలో భాగంగా మంత్రి ప్రసంగించారు. లాజిస్టిక్స్ వ్యయాలు యూఎస్, ఐరోపా దేశాల్లో 12 శాతం మేర ఉండగా, చైనాలో 8–10 శాతం మధ్య ఉండడం గమనార్హం. ఈ వ్యయం ఎంత కనిష్టానికి తగ్గితే, అంతర్జాతీయ వాణిజ్యంలో అంతగా పోటీపడొచ్చు. దీంతో దీన్ని సాధ్యమైనంత తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. నంబర్ 1 స్థానానికి ఆటోమొబైల్ రంగం భారత ఆటోమొబైల్ రంగం వచ్చే ఐదేళ్లలో ప్రపంచంలోనే నంబర్ 1 స్థానానికి చేరుకుంటుందని మంత్రి గడ్కరీ మరోసారి పునరుద్ఘాటించారు. ‘‘రవాణా మంత్రిగా బాధ్యతలు తీసుకునే నాటికి భారత ఆటోమొబైల్ పరిశ్రమ పరిమాణం రూ.14 లక్షల కోట్లుగా ఉంటే, ఇప్పుడు రూ.22 లక్షల కోట్ల కు చేరుకుంది. 4 లక్షల మందికి పరిశ్రమ ఉపాధి కల్పించడమే కాకుండా, కేంద్ర, రాష్ట్రాలకు జీఎస్టీ రూపంలో పెద్ద ఎత్తున ఆదాయాన్ని అందిస్తోంది. ప్రస్తుతం యూఎస్ ఆటోమొబైల్ పరిశ్రమ పరిమాణం రూ.78 లక్షల కోట్లుగా, చైనా రూ.47 లక్షల కోట్లుగా ఉంది’’అని మంత్రి వివరించారు. వ్యూహా త్మకమైన జోజిలా టన్నెల్ (సొరంగ మార్గం) నిర్మాణం పనులు 80 శాతం వరకు పూర్తయ్యాయని చెబుతూ.. ఇది అందుబాటులోకి వస్తే అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో లద్దాక్ ప్రాంతానికి అనుసంధానత ఏర్పడుతుందన్నారు. దేశ ప్రగతికి గ్రీన్ ఇంధనాలు కీలకం శిలాజ ఇంధనాల (పెట్రోలియం ఉత్పత్తులు) దిగుమతుల కోసం ఏటా రూ.22 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తున్నట్టు మంత్రి గడ్కరీ తెలిపారు. పైగా వీటి వల్ల పర్యావరణానికి ఎంతో హాని కలుగుతుందన్నారు. భారత ప్రగతికి శుద్ధ ఇంధనాల వినియోగం కీలకమని చెప్పారు. దేశ జీడీపీ వృద్ధికి వ్యవసాయ రంగంపైనా దృష్టి సారించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. మొక్కజొన్న నుంచి ఇథనాల్ తయారీతో రైతులకు రూ.45వేల కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరినట్టు చెప్పారు. ‘‘మొక్కజొన్న నుంచి ఇథనాల్ తయారు చేయాలని నిర్ణయించినప్పుడు.. క్వింటా మొక్కజొన్న మార్కెట్ ధర రూ.1,200 ఉంటే, మద్దతు ధర రూ.1,800గా ఉంది. పెట్రోల్‌లో ఇథనాల్ కలపాలని నిర్ణయించిన తర్వాత మొక్కజొన్న ధర రూ.2,800కు పెరిగింది. దీనివల్ల రైతులకు రూ.45,000 కోట్లు అదనంగా సమకూరింది’’అని మంత్రి వివరించారు. జాతీయ రహదారుల నిర్మాణంలో 80 లక్షల టన్నుల వ్యర్థాలను వినియోగించినట్టు వెల్లడించారు. ఢిల్లీలో పర్యావరణ కాలుష్యం ఎంతో పెరిగిపోయిందని చెబుతూ, దీన్ని తగ్గించడం ప్రభుత్వ ప్రాధాన్యంగా పేర్కొన్నారు. -
త్వరలో పెట్రోల్ వాహనాల రేట్లకి ఈవీలు
న్యూఢిల్లీ: వచ్చే నాలుగు నుంచి ఆరు నెలల్లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) రేట్లు కూడా పెట్రోల్ వాహనాల ధరల స్థాయిలో లభించగలవని అంచనా వేస్తున్నట్లు కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. శిలాజ ఇంధనాల దిగుమతులపై ఆధారపడటమనేది ఆర్థికంగా భారం కావడంతో పాటు పర్యావరణంపరంగాను ప్రతికూల పరిణామాలకు దారి తీస్తోందన్నారు. ఏటా ఇంధన దిగుమతులపై రూ. 22 లక్షల కోట్లు వెచి్చంచాల్సి వస్తోందని 20వ ఫిక్కీ ఉన్నత విద్యా సదస్సు 2025లో పాల్గొన్న సందర్భంగా చెప్పారు. అయిదేళ్లలోగా భారత్‌ను ప్రపంచంలోనే నంబర్ వన్ ఆటోమొబైల్ పరిశ్రమగా నిలపాలని నిర్దేశించుకున్నట్లు ఆయన చెప్పారు. ‘నేను రవాణా మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ పరిమాణం రూ. 14 లక్షల కోట్లుగా ఉండేది. ప్రస్తుతం రూ. 22 లక్షల కోట్లకు చేరింది‘ అని గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం రూ. 78 లక్షల కోట్లతో అమెరికా ఆటోమొబైల్ పరిశ్రమ అగ్రస్థానంలోను, రూ. 47 లక్షల కోట్ల పరిమాణంతో చైనా తొలి రెండు స్థానాల్లో ఉండగా, భారత్ మూడో స్థానంలో ఉంది. మరోవైపు, దేశ పురోగతికి స్వచ్ఛ ఇంధనాల వినియోగం చాలా కీలకమని మంత్రి వివరించారు. మొక్కజొన్న నుంచి ఇథనాల్ ఉత్పత్తి చేయడం వల్ల రైతులకు అదనంగా రూ. 45,000 కోట్ల మేర ఆదాయం వచి్చందని పేర్కొన్నారు. ఇక 2027 నాటికల్లా ఘనవ్యర్ధాలను రహదారుల నిర్మాణంలో వినియోగించే ప్రాజెక్టును చేపట్టినట్లు మంత్రి చెప్పారు. ఉన్నత విద్యాభ్యాసం, నైపుణ్యాలను పెంచుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత కీలకంగా మారిందని ఆయన పేర్కొన్నారు. -
రూ.20 లక్షల కోట్లకు ఈవీ మార్కెట్
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) మార్కెట్ విలువ భారత్‌లో 2030 నాటికి రూ.20 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం తెలిపారు. ఆ సమయానికి మొత్తం ఈవీ పర్యావరణ వ్యవస్థలో దాదాపు 5 కోట్ల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని అన్నారు. ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ సుస్థిరతపై 8వ సదస్సు ఈవీఎక్స్‌పో 2024 సందర్భంగా ఆయన మాట్లాడారు. 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల ఫైనాన్స్ మార్కెట్ పరిమాణం దేశంలో దాదాపు రూ.4 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనాగా వెల్లడించారు. భారత్‌లో 40 శాతం వాయు కాలుష్యం రవాణా రంగం వల్లే అని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. సౌర విద్యుత్ 44 శాతం.. భారత్ రూ. 22 లక్షల కోట్ల విలువైన శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకుంటోందని, ఇది పెద్ద ఆర్థిక సవాలుగా మారిందని గడ్కరీ అన్నారు. ఈ శిలాజ ఇంధనాల దిగుమతి మన దేశంలో చాలా సమస్యలను సృష్టిస్తోందని తెలిపారు. భారత్‌లో ఉత్పత్తి అవుతున్న మొత్తం విద్యుత్‌లో 44 శాతం సౌరవిద్యుత్ కైవసం చేసుకున్నందున ప్రభుత్వం పర్యావరణ అనుకూల శక్తి వనరులపై దృష్టి పెడుతోందని వివరించారు.లక్ష ఈ–బస్‌లు అవసరం.. ఎలక్ట్రిక్ బస్‌ల కొరతను భారత్ ఎదుర్కొంటోందని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. ‘మన దేశానికి లక్ష ఎలక్ట్రిక్ బస్‌లు అవసరం. అయితే ప్రస్తుతం మన సామర్థ్యం 50,000 ఈ–బస్‌లు. మీరు మీ ఫ్యాక్టరీని విస్తరించుకోవడానికి ఇదే సరైన సమయం. ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులు నాణ్యత విషయంలో రాజీ పడొద్దు’ అని తయారీ కంపెనీలను ఉద్దేశించి అన్నారు. -
అక్కడ ప్రతిరోజు 34 మరణాలు..
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో రోజురోజుకు రోడ్లు నెత్తురోడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో జరిగే రోడ్డు ప్రమాదాల్లో ప్రతిరోజు 34 మంది మృత్యువాత పడుతున్నారు. ఈ విషయాన్ని కేంద్ర రవాణా మంత్రిత్వశాఖ అధికారికంగా వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలు హరియానా, పంజాబ్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్‌లలో ప్రమాదాల శాతం ఎక్కువగా ఉంది. 2016 ఏడాదిలో 12,481 మంది మృత్యువాత పడగా, 2015లో ఈ సంఖ్య 11,914గా నమోదైనట్లు ఆ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. 'భారత్‌లో రోడ్డు ప్రమాదాలు-2016' నివేదిక ప్రకారం ఈ నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలోనే ప్రమాద మృతుల సంఖ్య అధికంగా ఉంది. గతేడాది పంజాబ్‌లో 5077 మంది, హరియానాలో 5024 మంది, హిమాచల్ ప్రదేశ్ 1,271 మంది, జమ్ముకశ్మీర్‌లో 958 మంది వ్యక్తులు.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లడం, సైకిల్, బైక్, కారు, ఇతర వాహనాల మీద వెళ్తుండగా జరిగిన ప్రమాదాల్లో మృతిచెందారు. 333 మంది సైక్లిస్ట్‌లు చనిపోగా, అత్యధికంగా పంజాబ్‌లో 202 మంది, హరియానాలో 102 మంది, చండీగఢ్‌లో 28 మంది, జమ్ముకశ్మీర్‌లో ఒక్కరు చనిపోయారు. హరియానాలో 1596 మంది పాదచారులు చనిపోయారని, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తర్వాత నాల్గో స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. పంజాబ్‌లో 60 మంది మహిళలు సహా 433 మంది పాదచారులు ప్రాణాలు కోల్పోయారు. పాదచారుల మృతుల సంఖ్యలో చండీగఢ్ 38 మందితో చివరి స్థానంలో ఉండగా, జమ్ముకశ్మీర్ 58 మందితో చివరి నుంచి రెండోస్థానంలో ఉంది. పాదచారులు రోడ్డుపై సురక్షితంగా ఉండాలంటే కాలిముద్రలు రోడ్డుపై అచ్చువేస్తే కొద్దిమేరకు ఈ కేటగిరిలో చావులను అరికట్టవచ్చునని రోడ్డ భద్రతా నిపుణుడు నవదీప్ అసిజా అన్నారు. పంజాబ్‌లో 2014లో 566 మంది పాదచారులు చనిపోగా, 2016లో ఈ సంఖ్య 635కు చేరిందన్నారు. లైసెన్స్లేనివారు, 18 ఏళ్లలోపు టీనేజర్లు వాహనాలు నడపటం వల్ల ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. అదే రీతిలో వారి మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. 18 ఏళ్లలోపు వారి వల్ల జరిగిన ప్రమాదాలు.. హరియానా 591 పంజాబ్ 327 జమ్ముకశ్మీర్ 137 హిమాచల్‌ప్రదేశ్ 48 చండీగఢ్ 5


