
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి
న్యూఢిల్లీ: వచ్చే నాలుగు నుంచి ఆరు నెలల్లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) రేట్లు కూడా పెట్రోల్ వాహనాల ధరల స్థాయిలో లభించగలవని అంచనా వేస్తున్నట్లు కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. శిలాజ ఇంధనాల దిగుమతులపై ఆధారపడటమనేది ఆర్థికంగా భారం కావడంతో పాటు పర్యావరణంపరంగాను ప్రతికూల పరిణామాలకు దారి తీస్తోందన్నారు. ఏటా ఇంధన దిగుమతులపై రూ. 22 లక్షల కోట్లు వెచి్చంచాల్సి వస్తోందని 20వ ఫిక్కీ ఉన్నత విద్యా సదస్సు 2025లో పాల్గొన్న సందర్భంగా చెప్పారు.
అయిదేళ్లలోగా భారత్‌ను ప్రపంచంలోనే నంబర్ వన్ ఆటోమొబైల్ పరిశ్రమగా నిలపాలని నిర్దేశించుకున్నట్లు ఆయన చెప్పారు. ‘నేను రవాణా మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ పరిమాణం రూ. 14 లక్షల కోట్లుగా ఉండేది. ప్రస్తుతం రూ. 22 లక్షల కోట్లకు చేరింది‘ అని గడ్కరీ తెలిపారు.
ప్రస్తుతం రూ. 78 లక్షల కోట్లతో అమెరికా ఆటోమొబైల్ పరిశ్రమ అగ్రస్థానంలోను, రూ. 47 లక్షల కోట్ల పరిమాణంతో చైనా తొలి రెండు స్థానాల్లో ఉండగా, భారత్ మూడో స్థానంలో ఉంది. మరోవైపు, దేశ పురోగతికి స్వచ్ఛ ఇంధనాల వినియోగం చాలా కీలకమని మంత్రి వివరించారు. మొక్కజొన్న నుంచి ఇథనాల్ ఉత్పత్తి చేయడం వల్ల రైతులకు అదనంగా రూ. 45,000 కోట్ల మేర ఆదాయం వచి్చందని పేర్కొన్నారు. ఇక 2027 నాటికల్లా ఘనవ్యర్ధాలను రహదారుల నిర్మాణంలో వినియోగించే ప్రాజెక్టును చేపట్టినట్లు మంత్రి చెప్పారు. ఉన్నత విద్యాభ్యాసం, నైపుణ్యాలను పెంచుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత కీలకంగా మారిందని ఆయన పేర్కొన్నారు.