ఢిల్లీ: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ రోడ్డు విస్తరణ విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు. రూల్ ఈజ్ రూల్.. రూల్ ఫర్ ఆల్ అనే విధంగా రోడ్డు విస్తరణ పనుల కోసం తన మామగారి ఇంటిని కూల్చివేసినట్లు గడ్కరీ స్వయంగా వెల్లడించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో, నెటిజన్లు స్పందిస్తూ.. నితిన్ గడ్కరీ తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ఆయన సతీమణి కాంచన్ తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ యూట్యూబ్ వ్లాగ్‌లో అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ తన వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన, షాకింగ్ విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఫరా ఖాన్ వంటమనిషి దిలీప్.. నితిన్ గడ్కరీకి ఒక విజ్ఞప్తి చేశారు. తన ఊరిలో రోడ్డు వేయమని గడ్కరీని కోరగా.. ఫరా తమాషాగా దిలీప్ ఇంటి మీద నుంచే రోడ్డు వేయండి సార్ అని ఫన్నీ కామెంట్స్ చేశారు. దీనిపై గడ్కరీ భార్య కాంచన్ స్పందిస్తూ.. అప్పుడు దిలీప్‌కు ఇల్లు ఉండదు.. మా నాన్నగారికి జరిగినట్లే జరుగుతుంది అని గుర్తుచేశారు.
ఇంతలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. రోడ్డు విస్తరణ పనుల కోసం తన మామగారి ఇంటిని కూల్చివేసినట్లు తెలిపారు. అనంతరం, ఫరా స్పందించి.. మరి ఆయనకు కొత్త ఇల్లు కట్టించారా? అని ప్రశ్నించగా.. ‘లేదు, కేవలం ప్రభుత్వ నిబంధనల ప్రకారం రావాల్సిన పరిహారం మాత్రమే ఇచ్చాను’ అని చెప్పుకొచ్చారు. దీంతో, అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు.
ఇదే సమయంలో గడ్కరీ మరో ఉదంతం గురించి మాట్లాడారు. తాను ఇటీవల కోల్‌కతా వెళ్లినప్పుడు ఒక రెస్టారెంట్‌లో చైనీస్ ఫుడ్ ఆయనకు బాగా నచ్చింది. ఆ వంటకాన్ని తన వ్యక్తిగత చెఫ్‌కు నేర్పించమని ఆయన కోరగా.. అది తమ పాలసీకి విరుద్ధమని రెస్టారెంట్ యాజమాన్యం తిరస్కరించింది. అప్పుడు గడ్కరీ..‘ఈ రెస్టారెంట్ ఎవరి భూమిలో ఉందో తెలుసా?. ఇది కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ భూమి.. నేను షిప్పింగ్ మంత్రిని. మీరు నేర్పించకపోతే మీ లీజు రద్దు చేస్తాను’ అని సరదాగా హెచ్చరించడంతో వారు దిగొచ్చారని చెప్పారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


