
బజాజ్ ఆటో డామినార్ 400, డామినార్ 250 అప్ డేటెడ్ వెర్షన్ బైకులను లాంచ్ చేసింది. రెండింటిలో డామినార్ 250 ప్రారంభ ధర రూ .1.92 లక్షలు (ఎక్స్-షోరూమ్), డామినార్ 400 ప్రారంభ ధర రూ .2.39 లక్షలు (ఎక్స్-షోరూమ్). వీటికి సంబంధించిన వివరాలను బజాజ్ ఆటో ఇటీవల టీజ్ చేసింది. అప్‌డేట్‌లలో భాగంగా ఫీచర్లలో బజాబ్ సంస్థ మార్పులు చేసింది. మరిన్ని టూరింగ్ పరికరాలను జోడించింది. డిజైన్‌లో పెద్దగా మార్పులేమీ లేకుండా రైడర్ సౌకర్యం కోసం కొన్ని స్వల్ప సర్దుబాట్లు మాత్రం చేసింది.
కొత్త ఫీచర్లు
రెండు డామినార్ బైక్‌లూ ఇప్పుడు నాలుగు రైడింగ్ మోడ్‌లతో వస్తాయి. అవి రెయిన్, రోడ్, స్పోర్ట్, ఆఫ్-రోడ్. అవసరాన్ని బట్టి థ్రోటిల్ రెస్పాన్స్, ఏబీఎస్ ఇంటర్వెన్షన్ స్థాయిలను మార్చడం ద్వారా రైడర్‌కు ఈ మోడ్‌లు సహాయపడతాయి. ఇక డామినార్ 400 బైక్‌లో ప్రత్యేకంగా రైడ్-బై-వైర్ ఫీచర్ ఇచ్చారు. డామినార్ 250లో మాత్రం మెకానికల్ థ్రోటిల్ సెటప్, నాలుగు ఏబీఎస్ మోడ్స్ ఉన్నాయి.

మరో ముఖ్యమైన మార్పు ఏమిటంటే, పల్సర్ ఎన్ఎస్ 400 జెడ్‌లో లాంటి డిజిటల్ డిస్‌ప్లేను ఈ రెండు డామినార్ బైక్‌లలో ఇచ్చారు. ఇది కొత్త స్విచ్ గేర్ తో పనిచేసే కలర్ ఎల్‌సీడీ బాండెడ్ గ్లాస్ స్పీడోమీటర్. ఎక్కువ దూరం బైక్ నడిపే రైడర్లకు మరింత సౌలభ్యం కోసం హ్యాండిల్ బార్‌లను కూడా మార్చినట్లు బజాజ్ పేర్కొంది. రైడర్లు తమ జీపీఎస్ పరికరాలు లేదా స్మార్ట్‌ఫోన్‌లను కనెక్ట్ చేసుకునేందుకు జీపీఎస్ మౌంట్‌ను చేర్చింది.
ఇక మెకానిక్స్ పరంగా చూస్తే ఎటువంటి మార్పులు లేవు. డామినార్ 400 బైకులో 373 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంది. ఇది 8,800 ఆర్‌పీఎం వద్ద 39 బీహెచ్‌నపీ పవర్, 6,500 ఆర్‌పీఎం వద్ద 35 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్ బాక్స్ తో వస్తుంది. అదేవిధంగా డొమినార్ 250 విషయానికి వస్తే 248 సీసీ లిక్విడ్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 8,500 ఆర్‌పీఎం వద్ద 26 బీహెచ్‌పీ పవర్, 6,500 ఆర్‌పీఎం వద్ద 23 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఈ ఇంజన్ కూడా 6-స్పీడ్ ట్రాన్స్ మిషన్ తో జతై ఉంటుంది.