తల్లికి మాతృత్వం.. బిడ్డకు మాధుర్యం | - | Sakshi
Sakshi News home page

తల్లికి మాతృత్వం.. బిడ్డకు మాధుర్యం

Sep 13 2026 1:00 AM | Updated on Sep 13 2026 1:00 AM

చట్టబద్ధంగా అందిస్తాం చిన్నారి సంక్షేమానికే ప్రాధాన్యం

వేచి చూస్తున్న 50 కుటుంబాలు

శిశుగృహ ద్వారా చట్టబద్ధంగా చిన్నారుల దత్తత

ఇప్పటికే 43 మంది పిల్లలు భావి కుటుంబాల ఒడికి..

బిడ్డల కోసం మరో 50 కుటుంబాల ఎదురుచూపులు

భద్రాచలంఅర్బన్‌: సంతానంలేని తల్లిదండ్రులు, ఉన్నా మరో బిడ్డ కోసం ఎదురుచూసేవారికి భద్రాచలం శిశుగృహ వరంలా మారింది. ఇప్పటికే పలువురు దత్తత పొందగా, మరికొందరు దరఖాస్తు చేసుకుని వేచి చూస్తున్నారు. భావి తల్లిదండ్రుల వయసు, మానసిక స్థితి, కుటుంబ సభ్యుల అంగీకారం, ఆర్థిక స్థిరత్వం తదితర అంశాలు పరిశీలించాకే అధికారులు దత్తత ప్రక్రియ చేపడుతున్నారు. పిల్లలులేని తల్లిదండ్రులతోపాటు ఒంటరి మహిళలు, పురుషులు కూడా దత్తత తీసుకోవచ్చు.

అధికారిక మార్గంలోనే..

దత్తత కోరుకునేవారు మధ్యవర్తులు, బ్రోకర్లను ఆశ్రయించకుండా కేంద్ర దత్తత వనరుల సంస్థ (కారా) నిర్దేశించిన విధానంలో నమోదు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో రూ.6 వేలు, దత్తత ప్రక్రియ పూర్తయ్యే సమయంలో రూ.50 వేలు చెల్లించాల్సి ఉంటుంది. దత్తత అనంతరం రెండేళ్లపాటు ఆరు నెలలకోసారి జరిగే ఫాలోఅప్‌కు సంబంధించి మొత్తం రూ.8 వేలు డీడీ రూపంలో ప్రభుత్వానికి చెల్లించాలి. చట్టబద్ధంగా దత్తతకు అందుబాటులోకి వచ్చిన చిన్నారులనే నిర్దేశిత ప్రక్రియలో కేటాయిస్తారు.

అక్రమ మార్గంలో వెళ్తే కేసులు తప్పవు..

అక్రమ మార్గంలో దత్తతకు వెళ్తే మోసపోవడంతోపాటు కేసులు కూడా నమోదవుతాయి. 2024లో భద్రాచలంలో ఆడశిశువును చట్టవిరుద్ధంగా దత్తత ఇచ్చిన ఘటనలో నలుగురిపై కేసు నమోదైంది. అదే ఏడాది జూలూరుపాడు మండలంలో మూడు నెలల పాపను సుమారు రూ.లక్షకు ఇచ్చిన ఘటన బయటపడింది. తాజాగా టేకులపల్లిలో నాలుగు నెలల మగశిశువును దత్తత ఇప్పిస్తామంటూ ఓ మహిళ నుంచి రూ.1.40 లక్షలు తీసుకుని మోసం చేసిన కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మధ్యవర్తులను నమ్మకుండా చట్టబద్ధమైన మార్గంలోనే దత్తత తీసుకోవాల్సిన అవసరాన్ని ఇలాంటి ఘటనలు గుర్తుచేస్తున్నాయి.

43 మంది దత్తత

భద్రాచలం శిశుగృహలో 2021 ఆగస్టు 28 నుంచి ఈ నెల 7వ తేదీ వరకు 76 మంది చిన్నారులు చేరారు. వీరిలో 44 మందిని తల్లిదండ్రులు స్వచ్ఛందంగా అప్పగించగా, నలుగురు వదిలివేయబడిన చిన్నారులు, మరో 28 మంది సంరక్షణ, రక్షణ అవసరమైన కేటగిరీవారు ఉన్నారు. వీరిలో 43 మంది దత్తత ద్వారా కొత్త కుటుంబాల ఒడికి చేరారు. ఏడుగురిని ఇతర సంరక్షణ కేంద్రాలకు తీసుకెళ్లగా, 22 మందిని తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు అప్పగించారు. ప్రస్తుతం నలుగురు చిన్నారులు శిశుగృహలో ఉన్నారు. 2024, జూలై 24న ఓ బాలిక బ్రెయిన్‌డెడ్‌తో మృతి చెందింది. దత్తత వెళ్లిన 43 మందిలో 38 మంది దేశంలోని వివిధ రాష్ట్రాలకు, ఐదుగురు విదేశాలకు వెళ్లారు. తెలంగాణలో అత్యధికంగా 26 మంది, కర్ణాటకకు ఐదుగురు, కేరళకు నలుగురు, తమిళనాడుకు ఇద్దరు, మహారాష్ట్రకు ఒకరు చొప్పున తీసుకెళ్లారు.

శిశుగృహకు చేరిన ప్రతీ చిన్నారికి కుటుంబ వాతావరణం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. దత్తతకు అర్హులైన చిన్నారులను చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా తల్లిదండ్రులకు అప్పగిస్తాం.

– పాయం చంటిబాబు, శిశుగృహ మేనేజర్‌

దత్తత ప్రక్రియలో చిన్నారి సంక్షేమం, భద్రత, భవిష్యత్‌కే తొలి ప్రాధాన్యం ఉంటుంది. దత్తత తల్లిదండ్రుల కుటుంబ పరిస్థితులు, చిన్నారిని పెంచే సామర్థ్యాన్ని పరిశీలించాకే బిడ్డను ఇస్తాం.

– హరికుమారి, జిల్లా బాలల సంరక్షణ అధికారి

దత్తత కోసం ఇప్పటివరకు 68 మంది భావి దత్తత తల్లిదండ్రులు (పాప్స్‌) దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో బాలుడిని కోరిన వారు 21 మంది, బాలికను కోరిన వారు 18 మంది, ఆడైనా, మగైనా ఫర్వాలేదన్నవారు 29 మంది ఉన్నారు. ఆరు దరఖాస్తులు తిరస్కరణకు గురికాగా, 12 మంది దరఖాస్తుదారులకు దత్తత ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతం 50 మంది చిన్నారుల కోసం ఎదురుచూస్తున్నారు. 2022లో అత్యధికంగా 24 దరఖాస్తులు వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement