కమనీయం.. రామయ్య కల్యాణం | - | Sakshi
Sakshi News home page

కమనీయం.. రామయ్య కల్యాణం

Sep 13 2026 1:00 AM | Updated on Sep 13 2026 1:00 AM

భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో శనివారం రామయ్య నిత్యకల్యాణం కమనీయంగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి మిథిలా స్టేడియం ప్రాంగణంలో ఉన్న శ్రీరామా సేవా మండపంలో ఉత్సవ మూర్తులను కొలువుదీర్చారు. స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. వారాంతపు సెలవు రోజులు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

స్వామివారి సన్నిధిలో అరకు ఎంపీ

శ్రీ సీతారామ చంద్రస్వామివారిని శనివారం ఆంధ్రప్రదేశ్‌లోని అరకు ఎంపీ గుమ్మ తనుజా రాణి, రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి దర్శించుకున్నారు. ప్రదక్షిణ అనంతరం అంతరాలయంలో మూలమూర్తులను దర్శించుకున్నారు. పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో యటపాక వైఎస్సార్‌సీపీ నాయకులు అన్నెం రామిరెడ్డి, ఆకుల వెంకటరామారావు, తొట శశికుమార్‌, రాము, సారెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

ఉన్నతస్థాయికి ఎదగాలి

సబ్‌ కలెక్టర్‌ మృణాల్‌ శ్రేష్ఠ

భద్రాచలం: ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, దాతలు కల్పిస్తున్న వసతులతో విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని భద్రాచలం సబ్‌ కలెక్టర్‌ మృణాల్‌ శ్రేష్ఠ అన్నారు. భద్రాచలంలోని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ సంక్షేమ రెసిడెన్షియల్‌ కళాశాల (బాలికల)కు ఐటీసీ సంస్థ సీఎస్‌ఆర్‌ నిధులతో డెస్క్‌ టాప్‌లు, కంప్యూటర్‌ ల్యాబ్‌ ఫర్నిచర్‌, అదనపు డెస్క్‌, బెంచీలను శనివారం వితరణ చేసింది. ఈ సందర్భంగా సబ్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ ఐఐటీ–జేఈఈ, నీట్‌ ప్రిపరేషన్‌ మెటీరియల్‌ కూడా అందించినట్లు తెలిపారు. ఐటీసీ జీఎం చెంగల్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

దారి దోపిడీ ముఠా అరెస్ట్‌

చుంచుపల్లి: యువకుడిపై దాడి చేసి సెల్‌ ఫోన్‌ లాక్కుని ఆన్‌లైన్‌ ద్వారా డబ్బులు బదిలీ చేసుకున్న దారి దోపిడీ ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సీఐ రాయల వెంకటేశ్వర్లు శనివారం వెల్లడించిన వివరాల ప్రకారం... జల్సాలు, మద్యానికి అలవాటుపడిన ఆరుగురు స్నేహితులు గత నెల 30న బాధితుడిని నమ్మించి బైక్‌పై శ్రీనగర్‌ గ్రామపంచాయతీ కార్యాలయం వెనుక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ ముందే వేచి ఉన్న మిగిలిన నిందితులతో కలిసి దాడికి పాల్పడ్డారు. బాధితుడిని బెదిరించి రూ. 31 వేలను ఫోన్‌పే ఖాతాలకు బదిలీ చేసుకున్నారు. కాగా, బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు బానోత్‌ అభిలాష్‌, పరదేశి శ్రీరామ్‌, గుగులోతు చరణ్‌, చిక్కుళ్ళ వరుణ్‌ తేజ్‌, తేజావత్‌ విఘ్నేష్‌, జగతాని ఉపాస్‌లను అరెస్ట్‌ చేశారు. నాలుగు సెల్‌ ఫోన్లు, రూ.13 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement