భద్రాచలంటౌన్: పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులపై అటవీశాఖ వేధింపులు ఆపాలని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ పార్టీ, అఖిలభారత ఐక్య రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో పీఓను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, పార్టీ రాష్ట్ర నేత కెచ్చెల రంగారెడ్డి మాట్లాడుతూ పోడు సాగు చేసుకుంటున్న గిరిజన, గిరిజనేతర రైతులకు పట్టాలు ఇవ్వాలని కోరారు. గిరిజనులను అడవి నుంచి దూరం చేయడం అన్యాయమన్నారు. జిల్లాలో అటవీ శాఖ అధికారులు నిరంకుశంగా వ్యవహరిస్తూ, రైతులను బలవంతంగా సాగు భూముల నుంచి తొలగిస్తున్నారని ఆరోపించారు. భూముల్లో బలవంతంగా ప్లాంటేషన్లు వేయడం సమంజసం కాదన్నారు. హక్కులకోసం పోరాడుతున్న పేద రైతులపై అటవీశాఖ అధికారులు పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముద్ద భిక్షం, అమర్లపూడి రాము, బుర్ర వెంకన్న, కెచ్చెల కల్పన, జాటోత్ కృష్ణ పాల్గొన్నారు.


