2015లో నైనీ బ్లాక్ దక్కించుకున్న
సింగరేణి
గతేడాదిలోనే బొగ్గు ఉత్పత్తి ప్రారంభం
రోడ్డు రవాణా మార్గంలో
ఎదురైన చిక్కులు
సమస్య పరిష్కరించలేక
వెనక్కి తగ్గిన సింగరేణి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: బొగ్గు ఉత్పత్తి ట్రయల్ బేస్డ్‌లోనే ఉందని గత మంగళవారం న్యూ ఢిల్లీలో మీడియా సమావేశంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించడంతో ఒడిశాలోని నైనీ బ్లాక్ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. దీంతో బ్లాక్‌ను దక్కించుకున్న పదేళ్ల తర్వాత కూడా బొగ్గును ఉత్పత్తి చేసే పరిస్థితిలో లేదని సింగరేణినే స్వయంగా ఒప్పుకున్నట్లయింది.
సిరుల పంట అనుకుంటే..
మంచిర్యాల జిల్లా జైపూర్ దగ్గర సింగరేణి సంస్థ 1200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్‌ను స్థాపించింది. ఈ ప్లాంట్‌కు అవసరమైన బొగ్గు కోసం ‘క్యాప్టివ్ మైన్’ విధానంలో ఒడిశాలోని అంగుల్ జిల్లాలో ఉన్న నైనీ బ్లాక్‌ను సింగరేణికి కేంద్రం వేలంతో సంబంధం లేకుండా కేటాయించింది. 500 మిలియన్ టన్నుల జీ–10 గ్రేడ్ బొగ్గు నిక్షేపాలు ఇక్కడున్నాయి. పైగా తెలంగాణలో బొగ్గు గనుల్లో ఒక టన్ను బొగ్గు కోసం సగటున ఏడు టన్నుల మట్టి ’(ఓవర్ బర్డెన్)ను తీయాల్సి ఉండగా, నైనీ విషయంలో ఇది కేవలం మూడు టన్నులుగా ఉంది. దీంతో ఇక్కడ ఉత్పత్తి వ్యయం తక్కువ. ఏడాదికి పది మిలియన్ టన్నుల వంతున 50 ఏళ్ల పాటు ఈ గనిని సింగరేణి సిరుల పంటగా ఉంటుందనే అంచనాలు ఆరంభంలో ఏర్పడ్డాయి.
పదేళ్ల తర్వాత
వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన సింగరేణి కార్యకలాపాలు ప్రధానంగా తెలంగాణకే పరిమితమయ్యాయి. దీంతో రాష్ట్రానికి ఆవల బొగ్గు గనిని ఆరంభించేందుకు సింగరేణి ఆపసోపాలు పడింది. ప్రజాభిప్రాయసేకరణ, పర్యావరణ అనుమతులు, వైల్డ్‌లైఫ్ చిక్కులు దాటుకుని 2025 ఏప్రిల్‌లో గనిలో బొగ్గు ఉత్పత్తిని ఆరంభించింది. మొదటి వార్షిక సంవత్సరం 2025–26లో కనీసం ఆరు మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బొగ్గును కొనుగోలు చేసేందుకు అప్పటికే తమిళనాడు జెన్‌కో ఒప్పందం సైతం పూర్తయింది. అంతా సవ్యంగా సాగుతున్న దశలో ఊహించని విధంగా రవాణా చిక్కులు ఎదురయ్యాయి.
స్థానికుల అభ్యంతరం
నైనీ బొగ్గును థర్మల్ విద్యుత్ కేంద్రాలకు రవాణా చేసేందుకు 28 కి.మీ దూరంలో జరపాడ రైల్వే స్టేషన్ ఉంది. పారాదీప్ రేవు 60 కి.మీ దూరంలో ఉంది. అక్కడి వరకు బొగ్గును కచ్చితంగా లారీల్లోనే తరలించాల్సి ఉంటుంది. అయితే, నైనీ బ్లాక్ ఏజెన్సీలో ఉండటంతో భారీ వాహనాల రాకపోకలకు వీలుగా రోడ్లు లేవు. ఈ విషయంలో ముందు చూపుతో వ్యవహరించడంలో సింగరేణి విఫలమైంది. ఫలితంగా బొగ్గు లారీల వల్ల వాయు కాలుష్యం పెరగిందని, రోడ్లు ప్రమాదాలు పెరిగాయంటూ చీటికి మాటికి స్థానికులు లారీలను అడ్డుకోవడం పరిపాటిగా మారింది. మరోవైపు కొన్ని ప్రజా సంఘాలు ఈ అంశాన్ని ఒడిశాకే చెందిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి గత ఫిబ్రవరిలో తీసుకెళ్లారు. దీంతో బొగ్గు రవాణా అంశం అత్యంత సున్నితమైన విషయంగా మారింది.
చేతులు కాలాక..
బొగ్గు గనికి అవసరమైన అనుమతుల కోసం పదేళ్లు శ్రమించిన సింగరేణి అధికారులు, కేవలం 28 కి.మీ రోడ్డు విస్తరణ విషయంలో పట్టనట్టుగా వ్యవహరించడం చినికిచినికి గాలివానగా మారింది. చివరకు అక్కడ మైనింగ్ రంగంలో ఉన్న ఇతర కంపెనీలతో కలిసి జరపాడ వరకు రోడ్డు విస్తరణ లేదా బైపాస్ రోడ్డు కోసం నిధులు ఇచ్చేందుకు సింగరేణి సిద్ధమైంది. ఇందుకోసం దాదాపు రూ.36 కోట్లు కేటాయించినట్టు సమాచారం. అయితే, మిగిలిన కంపెనీలు సింగరేణి స్థాయిలో వేగంగా స్పందించకపోవడంతో రోడ్డు పనుల్లోనూ ఆశించిన పురోగతి లేదు. మరోవైపు గత ఏప్రిల్‌లో మొదలైన బొగ్గు తవ్వకం కారణంగా గని ప్రాంగణంలో రవాణా చేయకుండా గుట్టలుగా సుమారు ఒక మిలియన్ టన్నుల బొగ్గు పేరుకుపోయినట్టు సమాచారం.
పక్కన పెట్టేశారు
నైనీ బొగ్గు బ్లాక్‌లో ఓబీ టెండర్ల విధానం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆ టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీనికి సమాంతరంగా బొగ్గు రవాణాలో ఇబ్బందులు ఉన్నాయి. వెరసి గతంలో నెలవారీగా బొగ్గు ఉత్పత్తి వివరాలు తెలిపేప్పుడు నైనీని కూడా పేర్కొనేవారు. కానీ ఇప్పుడు ఆ టేబుల్‌లో నైనీని పూర్తిగా మినహాయించడం సింగరేణి ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితికి అద్దం పడుతోంది.


