మూడో హెచ్చరిక స్థాయికి వరద..
తాజాగా గోదావరికి 13.66 లక్షల క్యూసెక్కుల వరద
అయినా ఆలయ పరిసరాల్లో ఎదురుకాని సమస్య
వరద, వర్షం ఒకేసారి వస్తేనే ఇక్కట్లు
ఏళ్ల నాటి సమస్యకు కానరాని శాశ్వత పరిష్కారం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గోదావరి వరద నుంచి భద్రాచలం పట్టణానికి రక్షణ కోసం 20 ఏళ్ల క్రితం కరకట్ట నిర్మించారు. ఈ క్రమాన పట్టణంలోని మురుగు నీరు గోదావరిలో కలిసేలా ఆరు చోట్ల స్లూయీస్ గేట్లు బిగించారు. ఈ గేట్ల సగటు ఎత్తు 38 అడుగులుగా ఉంది. సాధారణ రోజుల్లో ఎలాంటి ఆటంకం లేకుండా పట్టణంలోని మురుగు నీరు గోదావరిలో కలుస్తోంది. కానీ గోదావరి వరద నీటిమట్టం 38 అడుగులకు చేరగానే పరిస్థితులు తారుమారు అవుతున్నాయి. మురుగు నీరు గోదావరిలో కలవడం మాటేమో కానీ.. వరద నీరే స్లూయీస్‌ల ద్వారా పట్టణంలోకి చేరుతోంది. దీంతో వరద నీటి మట్టం 35 అడుగులకు చేరగానే మురుగునీరు వెళ్లే స్లూయీస్ గేట్లు మూసేస్తారు. ఆపై మురుగు నీటిని మోటార్ల ద్వారా గోదావరిలోకి ఎత్తిపోస్తారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇటు వరద, అటు పట్టణంలో వర్షం ఒకేసారి కురిస్తే నీటిని ఎత్తిపోయడం సాధ్యం కాక మురుగు, వర్షపు నీరు కలిసిన వరద.. కరకట్ట నుంచి వెనక్కి తన్ని ఆలయ పరిసరాలను ముంచెత్తడం సర్వసాధారణంగా మారుతోంది.
ఏ ఇబ్బందీ లేకుండా..
సాధారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరకముందే మురుగునీటి పారుదల వ్యవస్థకు సంబంధించి స్లూయీస్ గేట్లు మూసేస్తారు. దీంతో సీతారామచంద్రస్వామి కొలువైన భద్రగిరులు, పోకల దమ్మక్క నిత్యాన్నదానసత్రం, విస్తా కాంప్లెక్స్ పరిసరాలు నీటిలో చిక్కుకుపోతాయి. కానీ ఈసారి ఇంచుమించు మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరినా ఎక్కడా వరద తాలుకూ ఆనవాళ్లు కనిపించలేదు. ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులు ఆలయం చుట్టూ రాకపోకలు సాగించగా.. చిరువ్యాపారుల కార్యకలాపాలు సాఫీగా కొనసాగాయి. అయితే, గోదావరికి మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిలో వరద వచ్చినా పట్టణంలో భారీ వర్షం లేకపోవడంతో రోజువారీ డ్రెయినేజీ నీరు ఎత్తిపోతలతో సమస్య రాలేదు. కానీ గడిచిన వారంలో భద్రాచలంలో భారీ వర్షం కురిస్తే ఆలయ పరిసరాల్లో మురుగు ముంపు సమస్య ఎదురయ్యేది.
కొత్త డ్రెయినేజీ వ్యవస్థతోనే..
ప్రతీసారి వరద వచ్చినప్పుడు వర్షాలు కురిసే అవకాశం లేదని భావించలేం. అందుకే మురుగు, వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని భద్రాద్రి వాసులు, రాష్ట్ర వ్యాప్తంగా రామయ్య భక్తులు డిమాండ్ చేస్తున్నారు. భద్రాచలంలో ఎంత వర్షం పడినా నీరు సాఫీగా పల్లపు ప్రాంతాలకు వెళ్లేలా కొత్త డ్రెయినేజీ వ్యవస్థను అందుబాటులోకి తేవాలంటున్నారు. అలాగే, ప్రస్తుతం స్నాన ఘట్టాలకు ఎగువన వంద మీటర్ల లోపే స్లూయీస్‌ల ద్వారా మురుగునీరు గోదావరిలో కలుస్తోంది. భద్రాద్రి క్షేత్రానికి ఉన్న ప్రాముఖ్యత, ఆలయ పవిత్రతను దృష్టిలో ఉంచుకుని సరికొత్త డ్రెయినేజీ వ్యవస్థతో పాటు మురుగునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్ వస్తోంది. మురుగునీటి శుద్ధితో స్నాన ఘట్టాల వద్ద మురుగునీరు పారకుండా ఉంటుంది.
ఈనెల 18వ తేదీ సాయంత్రం 5 గంటలకు భద్రాచలం దగ్గర గోదావరిలో వరద నీటి మట్టం 38.20 అడుగులకు చేరింది. ఆ తర్వాత గంటగంటకూ పెరుగుతూ 43 అడుగులకు చేరగానే మొదటి, 48 అడుగుల వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక 21న సాయంత్రం 8 గంటలకు 51.90 అడుగుల మేర వరద చేరింది. ఆ సమయంలో 13.66 లక్షల క్యూసెక్కుల నీరు గోదావరిలో వేగంగా దిగువకు ప్రవహిస్తూ వెళ్లింది. ఇంకో 60 వేల క్యూసెక్కుల వరద వస్తే మూడో ప్రమాద హెచ్చరిక జారీ అయ్యేది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇళ్లు ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించాల్సి వచ్చేది. కానీ 21వ తేదీ రాత్రి 9గంటల నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ కాకపోగా.. రెండో హెచ్చరిక కూడా ఎత్తేశారు.
భద్రాచలానికి ముంపు గోదావరితో కాదు
వరదకు వాన తోడైతేనే..