
ఉద్రిక్తతల నడుమ అంత్యక్రియలు
● లక్ష్మీప్రసన్న భర్త, బంధువులపై దాడి ● ఇల్లు, కారూ ధ్వంసం ● కూతురుతో దహనసంస్కారాలు చేయించిన కుల పెద్దలు
అశ్వారావుపేట: రాజమండ్రిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన లక్ష్మీప్రసన్న మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం సోమవారం మధ్యాహ్నం అశ్వారావుపేటకు తీసుకొచ్చారు. అప్పటి వరకు రింగ్ సెంటర్ నుంచి మృతురాలు నివాసమున్న ఆమె ఆడపడుచు ఇంటివరకు పోగైన సుమారు 200 మంది.. అంబులెన్స్ రాగానే మృతురాలి భర్త నరేష్, ఆయ న బావ దాసరి శ్రీనివాస్, రాజమండ్రికి చెందిన అంబులెన్స్ డ్రైవర్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో పోలీసులుఅప్రమత్తమై నరేష్‌నుఅంబులెన్స్‌తో సహా స్టేషన్‌కు తరలించగా.. మరికొందరు ఇంటి వద్ద ఉన్న మృతురాలి ఆడపడుచుపై దాడి చేశారు. నరేష్‌బావ శ్రీనివాస్ పోలీస్‌వాహనంలో తలదాచుకు న్నా వాహనం డోర్ పెకిలించి మరీ దాడికి పాల్పడ్డారు.
పీఎస్ పక్కనే ధర్నా, దాడి..
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందిన లక్ష్మీ ప్రసన్నకు, అదే మండలంలోని ఖాన్‌ఖాన్ పేటకు చెందిన నరేష్‌బాబుతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం వారు అశ్వారావుపేటలోని నరేష్ సోదరి ఇంట్లో ఉంటుండగా లక్ష్మీప్రసన్న రాజమండ్రిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఆదివారం మృతి చెందింది. అయితే, భర్త, ఆయన కుటుంబసభ్యుల వేధింపులతో పాటు సరిగా భోజనం కూడా పెట్టకపోవడంతో తమ కూతురు చిక్కి శల్యమై మృతిచెందిందని తల్లిదండ్రులు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈమేరకు మృతదేహాన్ని సోమవారం అశ్వారావుపేటకు తీసుకురాగా, లక్ష్మీప్రసన్న తల్లిదండ్రులు, బంధువులు పోలీస్ స్టేషన్ పక్క ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దీంతో సీఐ పింగళి నాగరాజు, ఎస్‌ఐ యయాతిరాజు, దమ్మపేట ఎస్‌ఐ సాయి కిషోర్‌రెడ్డి మాట్లాడుతూ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని.. విచారణతో పాటు పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక హత్య కేసుగా మారుస్తామే తప్ప ఫిర్యాదుతో చేయలేమని వివరించారు. దీంతో మృతురాలి తరఫు పెద్దమనుషులు ధర్నాను విరమింపజేయగా లక్ష్మీప్రసన్న మృతదేహాన్ని ఇంటికి తరలించేసరికి అక్కడ ఇంట్లో వారిపై దాడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ మేరకు కుటుంబీకులంతా పోలీస్ స్టేషన్‌లో ఆశ్రయం పొందగా, ఇల్లు, కారుపై రాళ్లు రువ్వారు.
తలకొరివి పెట్టిన కుమార్తె
‘అంత్యక్రియలు చేసేందుకు భర్త భయపడుతున్నాడు.. వారి బంధువులను మీరు కొడుతున్నారు.. మృతదేహాన్ని మీరే తీసుకెళ్లి అంత్యక్రియలు చేస్తారా’ అని సీఐ నాగరాజు ప్రశ్నించగా ‘మృతదేహాన్ని తీసుకెళ్లం.. అంత్యక్రియల్లోనూ పాల్గొనబోం’ అంటూ లక్ష్మీప్రసన్న బంధువులు స్పష్టం చేశారు. చివరకు మున్నూ రు కాపు సంఘం అధ్యక్షులు కురిశెట్టి నాగబాబు, స్థానికులు కొల్లి రవికిరణ్, పమిడి లక్ష్మణరావు జోక్యం చేసుకుని మృతురాలి కూతురు ఇన్మితానాయుడుతో తలకొరివి పెట్టించి అంత్యక్రియలు పూర్తి చేశారు.
నాపై అభాండాలు వేస్తున్నారు..
‘నా భార్య చనిపోవడానికి నేనే కారణమని ఆరోపిస్తున్నారు. నా భార్య మాట్లాడితే నిజాలు చెప్పేది. గతంలో అసలు లక్ష్మీప్రసన్న తల్లిదండ్రులు వచ్చేవారు కాదు. ఈరోజు వారే లేనిపోని అభాండాలు వేస్తూ తిండి పెట్టకుండా చంపారని చెబుతున్నారు. నన్ను నేను ఎలా నిరూపించుకోవాలి..’ అంటూ నరేష్ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. అయితే, ఆమె బంధువులు మాత్రం లక్ష్మీప్రసన్నకు అన్నం పెట్టకుండా మాడ్చారని, చుటుపక్కల వాళ్లు పడేసిన ఎంగిలి ఆకుల్లో ఏరుకుని తినేదంటూ చుట్టుపక్కల వారు చెప్పారని అంటున్నారు. ఆస్తి కోసం చంపేసి, జబ్బు అంటగట్టారని ఆరోపించారు. రెండేళ్లుగా తాము ఇంటికి వస్తే తలుపు తీయకపోగా, ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టి తాము వస్తే కుక్కలను వదిలేవారని వాపోయారు.

ఉద్రిక్తతల నడుమ అంత్యక్రియలు

ఉద్రిక్తతల నడుమ అంత్యక్రియలు