ఆదివాసీ బాలికపై అఘాయిత్యం కేసులో పురోగతి ! | - | Sakshi
Sakshi News home page

ఆదివాసీ బాలికపై అఘాయిత్యం కేసులో పురోగతి !

Aug 26 2025 8:40 AM | Updated on Aug 26 2025 8:40 AM

ఆదివాసీ బాలికపై అఘాయిత్యం కేసులో పురోగతి !

ఆదివాసీ బాలికపై అఘాయిత్యం కేసులో పురోగతి !

పాల్వంచరూరల్‌: ఏపీలోని చింతూరు మండలానికి చెందిన ఆదివాసీ బాలికకు కూల్‌డ్రింక్‌లో మత్తు కలిపి తాగించి, అఘాయిత్యానికి పాల్పడిన ఘటన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ ఘటనలో ప్రధాన సూత్రధారి అయిన ట్రాలీ ఆటో డ్రైవర్‌ను చాతకొండ వద్ద సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆదివారం రాత్రే ఆర్టీఏ చెక్‌ పోస్టు, జగన్నాధపురం, పెద్దమ్మగుడిలోని సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నట్లు తెలిసింది. అతడి ద్వారా మరో వ్యక్తి ఆచూకీ కూడా కనుగొన్నారని సమాచారం. కాగా, ఈ విషయమై డీఎస్పీ సతీష్‌కుమార్‌ను వివరణ కోరగా.. ఆదివాసీ బాలికకు సంబంధించి కేసును ఇక్కడ నమోదు చేసి ఏపీలోని చింతూరు పోలీసులకు బదలాయించినట్లు తెలిపారు. నిందితులను ఆదుపులోకి తీసుకున్న విషయమై అడగగా అది చింతూరు పోలీసులుకు సంబంధించిందని, ఇక్కడ ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని చెప్పారు.

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్‌

ఖమ్మంమయూరిసెంటర్‌: ఖమ్మం రీజియన్‌ పరిధి మణుగూరు డిపోలో విధులు నిర్వర్తిస్తున్న డ్రైవర్‌ ఎస్‌.కే.ఎస్‌.సాహెబ్‌ సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇటీవలే మణుగూరు డిపోకు బదిలీపై వచ్చిన ఆయనకు అధికారులు టిమ్‌ డ్యూటీ వేయగా.. అనారోగ్యం కారణంగా తాను చేయలేనందున, కండక్టర్‌తో కూడిన డ్యూటీ వేయాలని కోరినట్లు తెలిసింది. ఈ విషయమై సోమవారం సాహెబ్‌ ఖమ్మంలో ఆర్‌ఎం సరిరామ్‌ను కలిసి తన సమస్యలు విన్నవిస్తూ ఆత్మహత్య చేసుకోవాలని వచ్చానని చెప్పడంతో అధికారులు నచ్చజెప్పారు. ఆపై బయటకు రాగానే ఆయన ఎలుకల నివారణకు వాడే మాత్రలు మింగడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆర్‌ఎం సరిరామ్‌, ఉద్యోగులు సకాలంలో చికిత్స చేయించడంతో సాహెబ్‌కు ప్రాణాపాయం తప్పినట్లయింది.

చెరువులో మునిగి యువకుడు మృతి

దమ్మపేట: కలువ పూల కోసం చెరువులో దిగిన యువకుడు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఘటన మండలంలోని మందలపల్లి శివారు చింతలకుంట చెరువులోసోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథ నం ప్రకారం.. ఏపీలోని ఏలూరు జిల్లా టీ.నర్సాపురం మండలం మధ్యాహ్నపువారిగూడేనికి చెందిన పచ్చి గోళ్ల ప్రవీణ్‌(29) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ సంస్థలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. వినాయక చవితి పండుగకు హైదరాబాద్‌లో కలువ పూలకు డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో.. ఇక్కడి నుంచి పూలు తీసుకెళ్లి విక్రయించాలని భావించాడు. ఈ క్రమంలో మొండితోక కృష్ణ అనే మిత్రుడితో కలిసి మండలంలోని ముష్టిబండలో ఉండే బంధువుల ఇంటికి ఆదివారం రాత్రి వచ్చాడు. సోమవారం ఉదయం వారిద్దరితో పాటు గ్రామానికి చెందిన చిలకా సత్తిబాబు కలిసి చింతలకుంట చెరువులోకి దిగారు. లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతానికి వెళ్లిన ప్రవీణ్‌ కాళ్లకు పచ్చిరొట్ట చుట్టుకుపోగా నీటిలో పూర్తి గా మునిగి మృతిచెందాడు. కాగా, ప్రవీణ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయికిషోర్‌ రెడ్డి తెలిపారు.

గుర్తు తెలియని వ్యక్తి ..

ఎర్రుపాలెం: మండల కేంద్రంలోని రైల్వేస్టేషన్‌లో సోమవారం గుర్తు తెలియని వ్యక్తి(50) మృతి చెందాడు. వెయిటింగ్‌ హాల్‌లో ఆయన మృతదేహాన్ని గుర్తించగా ఆర్‌కే ఫౌండేషన్‌ సభ్యుల సహకారంతో మధిర ప్రభుత్వాస్పత్రికి మార్చురీకి తరలించినట్లు జీఆర్‌పీ హెడ్‌ కానిస్టేబుల్‌ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. సదరు వ్యక్తి ఆచూకీ తెలిసిన వారు 98481 14202, 99636 41484 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement