
సమయమే సమస్య!
ఇలా అయితే ఎలా..?
సంస్థలో యంత్రాల వినియోగం ఇలా..
తక్కువ ధరకు అందిస్తూ కోలిండియా సవాల్
సగం సమయం వృథాగా ఉంటున్న భారీ యంత్రాలు
ఉద్యోగులతోనూ 8 గంటలు పని చేయించాలంటున్న కార్మికులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: నిన్నా మొన్నటి వరకు దక్షిణ భారతదేశ పారిశ్రామిక అవసరాలకు బొగ్గు సరఫరాలో సింగరేణి సంస్థకు తిరుగులేదు. కానీ ఇప్పుడు కోలిండియా నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. ఈ పోటీ నుంచి గట్టెక్కాలంటే ఉత్పత్తి వ్యయం తగ్గించుకోవడం మినహా సింగరేణికి మరోదారి లేని పరిస్థితి కనిపిస్తోంది.
చేజారిపోతున్న వినియోగదారులు..
ఈ ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని సింగరేణి లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 80 శాతానికి పైగా బొగ్గు దక్షిణ భారత దేశంలో ఉన్న థర్మల్ విద్యుత్ సంస్థలకు సరఫరా చేస్తోంది. అయితే బహిరంగ మార్కెట్‌లో తక్కువ ధరకే బొగ్గు లభిస్తుండడం సంస్థకు సంకట పరిస్థితిని తెస్తోంది. ఇప్పటికే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) సంస్థ సింగరేణితో కోల్ లింకేజీపై పునరాలోచన చేస్తుండగా.. ఇప్పుడు అదే బాటలో కర్ణాటక, మహారాష్ట్ర, ఏజీ జెన్కోలు నడుస్తున్నాయి. సింగరేణి సరఫరా చేస్తున్న బొగ్గు ధరతో పోల్చితే తక్కువ ధరకే అందిస్తామని థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు కోలిండియా ఆఫర్ ఇస్తోంది. రవాణా ఖర్చులన్నీ కలిపినా ఒక్కో టన్నుపై సగటున రూ.600 వరకు తక్కువ ధరకు కోలిండియా బొగ్గు అందుబాటులో ఉంటోంది. దీంతో ఉత్పత్తి వ్యయం తగ్గించుకోవడం మినహా సింగరేణికి మరో మార్గం లేదు. కార్మికుల గైర్హాజరు, ఉద్యోగుల పని గంటల్లో సమానత్వం, భారీ యంత్రాల వినియోగ సమయంలో సమర్థత వంటి విషయాల్లో సంస్థ వెనుకబడిపోతోంది.
వారికి ఏడు గంటల పనే..
సింగరేణి సంస్థ పరిధిలో 40 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. ఇందులో బొగ్గు ఉత్పత్తిలో నేరుగా సంబంధం ఉండే కార్మికులు, ఇతర మైనింగ్ సిబ్బంది, అధికారులకు ఎనిమిది గంటల పని విధానం అమల్లో ఉంది. కానీ కంపెనీ లావాదేవీలు, కార్మికుల సంక్షేమం తదితర కార్యాలయ విధులు నిర్వహించే ఉద్యోగులకు ఇప్పటికీ ఏడు గంటల పని విధానమే అమలవుతోంది. బ్రిటీషర్ల కాలంలో ప్రమాదకరమైన బొగ్గు ఉత్పత్తిలో ఉండే కార్మికులకు ఎక్కువ పని గంటలు ఉండగా, అడ్మినిస్ట్రేషన్ వైపు ఉండే బ్రిటీష్ వారికి తక్కువ పని గంటలు ఉండేవి. అయితే ఇప్పటికీ ఇదే విధానం అమలు కావడం ఏంటని కార్మికుల నుంచి నిరసనలు వస్తున్నాయి. సంస్థలో అందరికీ ఒకే విధమైన పని గంటల విధానం అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
సింగరేణి బొగ్గు ఉత్పత్తిలో ఇప్పుడు భారీ యంత్రాలదే కీలక పాత్ర. ఓవర్ బర్డెన్ (మట్టి), బొగ్గు వెలికి తీయడం, భారీ యంత్రాల ద్వారా వెలుపలికి తీసుకురావడం.. ఇలా బొగ్గు ఉత్పత్తి ప్రక్రియలో కీలకంగా వ్యవహరించే భారీ యంత్రాలు సంస్థ ఆధీనంలో 814 ఉన్నాయి. ఈ యంత్రాలను సగటున రోజుకు 18.20 గంటల పాటు నడిపించాల్సి ఉంటుంది. కానీ వివిధ కారణాలతో ప్రస్తుతం ఈ భారీ యంత్రాల వినియోగ సమయం సగటున 7.90 గంటలుగానే ఉంది. అంటే భారీ యంత్రాల గరిష్ట వినియోగ సమయంలో సగం కూడా ఉత్పత్తి కోసం వాడడం లేదు. దీంతో ఈ యంత్రాలపై పెట్టిన పెట్టుబడి, రుణాలకు వడ్డీ, యంత్రాలు నడిపే ఆపరేటర్ల వేతనాలు ఇలా అన్ని రకాలుగా వృథా అవుతోంది. ఫలితంగా బొగ్గు ఉత్పత్తి వ్యయం పెరుగుతోంది.
యంత్రాలు సంఖ్య పని చేయాల్సిన వినియోగించే
గంటలు గంటలు
షావెళ్లు 66 19.70 12.70
డంపర్లు 417 18.70 9.40
డోజర్లు 109 16.10 4.80
డెరిల్స్ 48 19.70 6.50
ఇతర యంత్రాలు 174 18.20 7.90
మొత్తం 814 18.20 7.90
సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి వ్యయం అధికం
థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ కోల్ లింకేజీ (సాలీనా)
ఎన్టీపీసీ 38 మి. టన్నులు
కర్ణాటక 10 మి. టన్నులు
ఏపీ 7 మి. టన్నులు