
కూరగాయల సాగుతో అదనపు ఆదాయం
కలెక్టర్ జితేష్ వి పాటిల్
సుజాతనగర్: కూరగాయల సాగుతో రైతులు అదనపు ఆదాయం పొందొచ్చని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. సుజాతనగర్, కొత్త అంజనాపురం గ్రామాల్లోని వ్యవసాయ క్షేత్రాల్లో సాగు చేస్తున్న కూరగాయల తోటలను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో కనీసం 10 గుంటల స్థలం కలిగిన ప్రతీ మహిళా రైతు కూరగాయల సాగుకు ముందుకు రావాలని అన్నారు. ఇందుకు అవసరమయ్యే జీఐ వైరు, వెదురుగడలు, పాలిథిన్ పేపర్, విత్తనాలు, ఫెన్సింగ్‌లకు తక్కువ ఖర్చుతో డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టును రెండు రోజుల్లో ఇవ్వాలని, ఆ రిపోర్ట్ ఆధారంగా జిల్లాలో 1000 మంది మహిళా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం ప్రభుత్వాస్పత్రిని సందర్శించి ల్యాబ్, మందుల గదిని పరిశీలించారు. మందులు సరిపడా ఉన్నాయా అని వైద్యాధికారి రమేష్‌ను అడిగి తెలుసుకున్నారు. ర్యాపిడ్ కిట్లు, వ్యాక్సిన్ల నిల్వలను తనిఖీ చేశారు. ఆ తర్వాత రాఘవాపురం రహదారి పక్కన ఏర్పాటు చేసిన కొర్రమేను చేపల పెంపకం యూనిట్‌ను పరిశీలించిన కలెక్టర్ నిర్వాహకులను అభినందించారు. అక్కడే కూరగాయల సాగు, కౌజు పిట్టల పెంపకం చేపడితే అదనపు ఆదాయం లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ట్రెయినీ కలెక్టర్ శౌరభ్‌శర్మ, ఫాం ఏపీఎం వెంకయ్య, తహసీల్దార్ వనం కృష్ణప్రసాద్, ఎంపీడీఓ బి.భారతి, ఏపీఎం రాంబాబు, ఏఓ జి.నర్మద, సీసీ శిరీష తదితరులు పాల్గొన్నారు.
ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో చేర్పించాలి..
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 21 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతుల ప్రారంభానికి అనుమతి వచ్చిందని, నాలుగేళ్లు నిండిన చిన్నారులను బడిలో చేర్పించేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. పిల్లలకు కావాల్సిన యూనిఫాం, పుస్తకాలు, క్రీడా పరికరాలతో పాటు మధ్యాహ్న భోజనం, అల్పాహారం అందిస్తామని తెలిపారు. ప్రతి పాఠశాలలో కనీసం 20 మంది పిల్లలు ఉండేలా చూడాలని, సెప్టెంబర్ 1 నాటికి ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు. సమావేశంలో డీఈఓ నాగలక్ష్మి, అదనపు కలెక్టర విద్యాచందన, డీడబ్ల్యూఓ స్వర్ణలత లెనీనా పాల్గొన్నారు.