
13 మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్
12 సెల్‌ఫోన్‌లు, బ్యాంకు పాస్‌బుక్ స్వాధీనం
వివరాలు వెల్లడించిన ఎస్పీ రోహిత్‌రాజు
కొత్తగూడెంటౌన్: సైబర్ మోసాలకు పాల్పడిన టేకులపల్లికి చెందిన 13 మంది యువకులు జైలు పాలయ్యారు. జిల్లాలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న వీరిని టేకులపల్లి, సైబర్ క్రైం పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేయగా.. స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఎస్పీ రోహిత్‌రాజు సోమవారం వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. టేకులపల్లిలో మీ సేవా కేంద్రం నిర్వహిస్తున్న బోడ శ్రీధర్‌కు టెలిగ్రామ్ యాప్ ద్వారా పరిచయమైన సైబర్ నేరగాళ్లు నగదు బదిలీ చేస్తే కమీషన్ ఇస్తామని చెప్పారు. దీంతో శ్రీధర్ మరో 12 మందితో కలిసి సైబర్ మోసాలకు పాల్పడ్డారు. టేకులపల్లి మండలానికి చెందిన పలువురితో నకిలీ పత్రాలు సృష్టించి 60 కరెంట్ అకౌంట్లు తెరిచి ఇతరుల బ్యాంకు ఖాతాలోకి నగదును పంపిస్తూ కమీషన్ తీసుకుంటున్నారు. టేకులపల్లి మండలానికి చెందిన బోడ శ్రీధర్, బోడ రాజేష్, బోడ రాజన్న, బానోతు జగదీష్, తేజావత్ నరేష్, పోలేపొంగు పవన్ కళ్యాణ్, భూక్యా వీరన్న, జాటోతు నరేష్, బోడ జంపన్న, బోడ రాజారాం, భూక్య ప్రవీణ్‌కుమార్, మాలోతు ప్రవీణ్, ఉరిమల్ల భరత్‌కృష్ణ కలిసి సైబర్ మోసాలకు పాల్పడుతూ.. గత ఆరు నెలలుగా మొత్తం రూ.8.5 కోట్లు లావాదేవీలు జరిపినట్లు గుర్తించామని, అందుకు కారణమైన ఈ 13 మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 12 సెల్‌ఫోన్‌లు, బ్యాంకు పాస్‌బుక్ స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వివరించారు. నిందితులను జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం ఇల్లెందు కోర్టుకు తరలించామని తెలిపారు. సమావేశంలో టేకులపల్లి, సైబర్ క్రైం సీఐలు బి.సత్యనారాయణ, ఎస్‌ఐ ఎ. రాజేందర్ పాల్గొన్నారు.