
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం చిత్ర కూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
నిత్యాన్నదానానికి విరాళం
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో జరిగే నిత్యాన్నదాన కార్యక్రమానికి ఖమ్మం బ్యాంక్ కాలనీకి చెందిన పోట్ల వంశీకృష్ణ రూ.1,00,116 వితరణగా ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు వారికి స్వామివారి ప్రసాదం, జ్ఞాపికను అందజేశారు. ఆలయ సూపరింటెండెంట్ లింగాల సాయిబాబు, వేద పండితులు పాల్గొన్నారు.
పెద్దమ్మతల్లికి
విశేష పూజలు
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ(పెద్దమ్మతల్లి) అమ్మవారికి అర్చకులు ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఒడిబియ్యం, చీరలు, పసుపు, కుంకుమ, గాజులు, తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, డైరెక్టర్లు పాల్గొన్నారు. కాగా, పెద్దమ్మతల్లి ఆలయంలో వచ్చేనెల 2న వ్యాపార దుకాణాల బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఈఓ తెలిపారు. ఈనెల 22న నిర్వహించిన వేలానికి పాటదారులు రాకపోవడంతో వాయిదా వేసిన విషయం విదితమే.
నేడు ప్రజావాణి
సూపర్‌బజార్(కొత్తగూడెం): కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సకాలంలో హాజరు కావాలని ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలపై ప్రజావాణిలో లిఖిత పూర్వకంగా వినతులు అందజేయాలని సూచించారు.
కిన్నెరసానికి
పోటెత్తిన పర్యాటకులు
ఒకరోజు ఆదాయం రూ.40,500
పాల్వంచరూరల్ : మండలంలోని కిన్నెరసానికి ఆదివారం పర్యాటకులు భారీగా తరలివచ్చారు. జిల్లా నలుమూలలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి డ్యామ్ పైనుంచి జలాశయాన్ని, డీర్‌పార్కులోని దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహాల నడుమ గడిపారు. 520 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించడం ద్వారా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.28,350 ఆదాయం లభించగా, 220 మంది బోటు షికారు చేయడంతో టూరిజం కార్పొరేషన్‌కు రూ.12,150 ఆదాయం వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు.

రామయ్యకు సువర్ణ పుష్పార్చన

రామయ్యకు సువర్ణ పుష్పార్చన