
‘ఉపాధి’ కౌజులు..!
ఆరోగ్యానికి చేసే ఉపయోగాలు...
కౌజుపిట్ట మాంసానికి ఎంతో ప్రత్యేకత
మహిళా సంఘాల ఆధ్వర్యాన పెంపకం
తొలిసారిగా పైలట్ ప్రాజెక్టుగా
శేషగిరినగర్
జిల్లా అంతాట ఏర్పాటు చేసేలా కసరత్తు
పెట్టుబడి తక్కువ.. ప్రయోజనాలు ఎక్కువ
కొత్తగూడెంఅర్బన్: మహిళ లను ఆర్థికంగా బలో పేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలను వివిధ వ్యాపారాలు చేసేందుకు ప్రోత్సహిస్తూ రుణాలు విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా లక్ష్మీదేవిపల్లి మండలం శేషగిరినగర్ గ్రామపంచాయతీని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసి దుర్గాంబిక ఎస్‌హెచ్‌జీ, అరుణోదయ గ్రామ సమాఖ్య ఆధ్వర్యాన ప్రణజ కౌజు పిట్టల పెంపక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే కౌజుపిట్టల పెంపకం సజావుగా సాగి ఆశించిన విధంగా అమ్మకాలు జరిగితే జిల్లాలోని ప్రతీ మండలంలో ఏర్పాటు చేసేలా అధికారులు నిర్ణయించారు. దీంతో అన్ని మండలాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యాన పెంపకాలు ప్రారంభించే అవకాశం ఉంది.
మార్కెట్‌లో మంచి డిమాండ్..
హోటళ్లు, రెస్టారెంట్లలో కౌజుపిట్టల మాంసానికి మంచి డిమాండ్ ఉంది. దీంతో వీటి పెంపకం, అమ్మకాలు చేయడంతో మంచి లాభాలు గడించే అవకాశం ఉంటుందని డీఆర్‌డీఏ, మహిళా సంఘాల అధికారులు అభిప్రాయపడుతున్నారు. తక్కువ పెట్టుబడి ఎక్కువ ప్రయోజనాలు ఉండడంతో ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తుండగా.. మహిళా సంఘాల ఆధ్వర్యాన పెంపకం జరుగుతున్న నేపథ్యాన హోటళ్లు, రెస్టారెంట్ల వారు కూడా నమ్మకంతో వాటిని కొనుగోలు చేసి ఆహారప్రియులకు అందించే అవకాశం ఉంటుంది.
పెంపకం, ఖర్చు ఇలా...
పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికై న శేషగిరినగర్‌లో గత రెండు రోజుల క్రితం రూ.8వేలతో 600 పిల్లలు కొనుగోలు చేసి పెంపకాన్ని మొదలుపెట్టారు. 25 నుంచి 30 రోజుల్లో ఇవి పెరగనుండగా.. వాటిని అమ్మి వేయొచ్చని, అదే 40 రోజులు అయితే గుడ్లు పెట్టే అవకాశాలుంటాయని నిర్వాహకులు పేర్కొంటున్నారు. కాగా, పెంపకానికి కావాల్సిన షెడ్, అవి తినే ఆహారం, వాటి ఖర్చు మొత్తం కలిపి రూ.60 వేలకు పైన అయ్యిందని, ఇందులో రూ.30 వేల వరకు మహిళా సంఘం నుంచి రాగా, మరో రూ.30 వేలు నిర్వాహకులే భరించినట్లు చెబుతున్నారు. వీటిని ధర జత రూ.200 వరకు పలకనుంది.
కౌజు పిట్ట మాంసంలో అధిక ప్రోటీన్లు, తేలికగా జీర్ణమవడం, రక్తహీనత, బలహీనత, పునరుత్పత్తి సామర్థ్యం మెరుగవడం, కొవ్వు తక్కువ ఉండడంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణంగా గ్రామాలు, పట్టణాలు, వ్యవసాయ క్షేత్రాల్లో వీటిని పెంచేందుకు అనువైన స్థలాలు ఉండగా.. గాలి, వెలుతురు ఉండే ప్రాంతాలు, డాబాపైన కూడా వీటిని పెంచవచ్చు. వీటికి 30 రోజుల పాటు గోధుమలు, బియ్యం, జొన్న, సజ్జ, మినుములతో కూడిన ఆహారాన్ని అందించి, ప్రతి రోజు అవి పెరిగే పరిసరాలను శుభ్రపరిస్తే ఎటువంటి వ్యాధులు సోకకుండా ఆరోగ్యంగా పెరుగుతాయి. పిట్టలు చనిపోకుండా సరైన టీకాలు వేయించి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరముంది.

‘ఉపాధి’ కౌజులు..!