
భర్తతో సహా మరో ముగ్గురిపై కేసు నమోదు
భద్రాద్రి జిల్లా: ఓ వివాహిత అనుమానా స్పదంగా మృతి చెందిన ఘటనపై ఆదివారం ఆమె భర్తతో పాటు మరో ముగ్గురిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. స్థానిక ఎస్సైటి.యయా తీ రాజు కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ముచ్చవరం గ్రామ పంచాయతీ విశ్వనా థపురం గ్రామానికి చెందిన పూల లక్ష్మీప్రసన్న(33)కు, మండలంలోని ఖాన్‌ఖాన్‌పేటకు చెందిన పూల నరేష్‌బాబుతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మూడేళ్ల కుమార్తె, ఒక కుమారుడు ఉన్నాడు. కాగా, గత కొన్నేళ్లుగా వీరిమధ్య కుటుంబ కలహాలు చోటు చేసుకుంటున్నాయి.
ఈ గొడవల నేపథ్యంలోనే మూడేళ్ల క్రితం నరేష్‌బాబు తన సొంత అక్క దాసరి విజయలక్ష్మి స్వగ్రామమైన అశ్వారావుపేట పట్టణంలోని కోనేరుబజార్‌లో ఉన్న ఇంట్లో కలిసి ఉంటున్నారు. ఈక్రమంలో ఆదివారం తెల్లవారుజామున లక్ష్మీప్రసన్న ఇంట్లో పనిచేస్తుండగా జారిపడి తల, నుదిటి భాగాల్లో గాయపడినట్లు ఆమె కుటుంబీకులకు భర్త సమాచారం ఇచ్చి స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరీక్షించిన వైద్యులు ఏపీలోని రాజమండ్రికి రిఫర్ చేయగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.
మృతిపై అనుమానాలు.?
లక్ష్మీ ప్రసన్న కిందపడి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు భర్త నరేష్‌బాబు, అతడి బంధువులు ఇచ్చిన సమాచారంతో మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు రాజమండ్రిలోని ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రిలో ఐసీయూ విభాగంలో వెంటిటేటర్‌పై విగతజీవిగా పడిఉన్న లక్ష్మీప్రసన్న శరీరంపై ఉన్న గాయాలతో పాటు శారీరకంగా కుశించుకుపోయి కనిపించడంతో మృతిపై అనుమానాలు వచ్చాయి. దీంతో తన కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నట్లు తండ్రి ముదిగొండ వెంకటేశ్వరరావు స్థానిక పోలీస్ స్టేషన్‌లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమె భర్తతో పాటు పూల విజయలక్ష్మి, దాసరి భూలక్ష్మి, దాసరి శ్రీనివాసరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.