● పోలీసుల తనిఖీల్లో చైన్నెకి చెందిన ఇద్దరు యువకులు అరెస్ట్ ● వివరాలు వెల్లడించిన డిఎస్పీ ఎండీ మోయిన్
చీరాల: రైలులో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులకు సోమవారం రాత్రి చీరాల ఒన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 11 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం రాత్రి చీరాల ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ ఎండీ మోయిన్ కేసు వివరాలను వెల్లడించారు. చైన్నె పెరంబూర్‌కు చెందిన బాల శ్యాంప్రశాంత్, చైన్నె ఎగ్మోర్‌కు చెందిన అరవిందన్ శంకర్‌లు మరో వ్యక్తితో కలిసి ఒక గ్రూపుగా ఏర్పడ్డారు. పార్వతీపురంలో 11 కేజీల గంజాయిని కొనుగోలు చేసి చైన్నెకు తరలించేందుకు ధన్‌బాద్–అలెప్పి ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. చీరాల ఒన్‌టౌన్ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు బాపట్ల–చీరాల మధ్య ఒన్‌టౌన్ పోలీసులు, స్పెషల్ ఎస్‌బీ పోలీసులు రైలులో తనిఖీలు చేపట్టారు. గమనించిన నిందితులు సోమవారం రాత్రి చీరాల రైల్వేస్టేషన్‌లో దిగిపోయారు. నిందితుల కదలికలపై అందిన పక్కా సమాచారం మేరకు చీరాల డీఎస్పీ సూచనలతో పోలీసులు దండుబాట రోడ్డులో నిఘా ఉంచారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు నిందితులును అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా వారి వద్ద 11 కేజీల గంజాయి లభించింది. దీంతో చీరాల ఒన్‌టౌన్ పోలీసులు ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. గంజాయిని ఎవరి వద్ద నుంచి కొనుగోలు చేశారు, ఎవరికి అమ్మేందుకు తరలిస్తున్నారనే విషయాలపై ఒన్‌టౌన్ సీఐ జి.సోమశేఖర్ ఆధ్వర్యంలో సమగ్ర దర్యాప్తు చేపట్టారు. ఒన్‌టౌన్ ఎస్సై హరిబాబు, తులసి శ్రీనివాసరావు, జి.వాణిశ్రీ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


