ఐజీని కలిసిన ఏపీ రిటైర్డ్‌ పోలీస్‌ అధికారుల సంఘం నేతలు | - | Sakshi
Sakshi News home page

ఐజీని కలిసిన ఏపీ రిటైర్డ్‌ పోలీస్‌ అధికారుల సంఘం నేతలు

Aug 26 2026 1:54 AM | Updated on Aug 26 2026 1:54 AM

ఐజీని కలిసిన ఏపీ రిటైర్డ్‌ పోలీస్‌ అధికారుల సంఘం నేతలు 108 కిలోల పసుపుతో అమ్మవార్లకు అభిషేకార్చన ఈవీఎంల గోదాము పరిశీలన

నగరంపాలెం: విశ్రాంత పోలీస్‌ అధికారుల సంక్షేమం, ప్రయోజనాల కోసం సమర్థంగా పనిచేయాలని గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ట్రతిపాఠి అన్నారు. మంగళవారం గుంటూరు కలెక్టర్‌ బంగ్లా రోడ్‌లోని గుంటూరు రేంజ్‌ ఐజీ కార్యాలయంలో ఐజీని ఇటీవల ఎన్నికై న ఏపీ రిటైర్డ్‌ పోలీస్‌ అధికారుల సంఘం గుంటూరు యూనిట్‌ అధ్యక్షుడు (విశ్రాంత డీఎస్పీ) వి.పోతురాజు, కార్యదర్శి (విశ్రాంత ఎస్పీ) మేక రమేష్‌కుమార్‌, సంయక్త కార్యదర్శి (విశ్రాంత డీఎస్పీ) బీరం నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సత్యనారాయణ, కోశాధికారి కేవీ నారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఐజీని సత్కరించారు. రిటైర్డ్‌ పోలీస్‌ అధికారుల వేతన వ్యత్యాసాలు, ఇతర సంక్షేమ అంశాలను పరిశీలించి సమస్యలు పరిష్కారిస్తామని ఐజీ చెప్పారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలిపారు.

పాత పోలీస్‌ భవనం కేటాయించాలి..

జిల్లా పోలీస్‌ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ను ఏపీ రిటైర్డ్‌ పోలీస్‌ అధికారుల సంఘం గుంటూరు యూనిట్‌ నూతన కార్యవర్గం మర్యాదపూర్వకంగా కలిసింది. అనంతరం జిల్లా ఎస్పీకి ప్రతినిధులు పుష్పగుచ్ఛం అందించి, సత్కరించారు. గుంటూరు యూనిట్‌ కార్యాలయం ఏర్పాటుకు పాత పోలీస్‌ భవనం లేదా అనువైన వసతిని కేటాయించాలని జిల్లా ఎస్పీని కోరారు. వసతి కల్పిస్తామని జిల్లా ఎస్పీ హామీ ఇచ్చారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలిపారు. పెండింగ్‌ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారని పేర్కొన్నారు.

గుంటూరు వైద్య కళాశాలకు ఎన్‌ఏబీఎల్‌ గుర్తింపు

గుంటూరు మెడికల్‌: గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల మైక్రోబయాలజీ విభాగంలోని హెచ్‌ఐవీ టెస్టింగ్‌ లాబొరేటరీకి ప్రతిష్టాత్మక ఎన్‌ఏబీఎల్‌ గుర్తింపు లభించింది. మంగళవారం కళాశాలలో సిబ్బందిని అభినందించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన పరీక్షలు, ఖచ్చితమైన ఫలితాలు అందిస్తున్నందుకుగాను ఈ గుర్తింపు లభించిందని, ఇది గుంటూరు వైద్య కళాశాలకే గర్వకారణమని కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శ్రీధర్‌, డాక్టర్‌ మాధవి, మైక్రోబయాలజీ విభాగాధిపతి డాక్టర్‌ బి.వి.శవమ్మ, ల్యాబ్‌ టెక్నీషియన్స్‌ ముస్తఫా, మేరికుమారి, తదితర సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.

నగరంపాలెం: గుంటూరు అరండల్‌పేటలోని అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో శ్రావణ మాస రెండో మంగళవారం 108 కిలోల పసుపుతో అమ్మవార్లకు, మంగళగౌరికి అభిషేకార్చన విశేషంగా నిర్వహించారు. కోటి కుంకుమార్చనలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. సువాసినులతో మంగళ గౌరీ వ్రతం చేశారు. తొలుత విశేష నిత్య పూజలు, శ్రీచక్ర మహామేరుకు అభిషేకార్చనలు జరిగాయి. హారతి, మంత్రపుష్పం అనంతరం తీర్థ ప్రసాదాలను అందించారు. ప్రధాన పూజారి మర్రిపాటి ప్రసాద్‌ తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షించారు.

భక్తిశ్రద్ధలతో మంగళగౌరీ వ్రతాలు

స్థానిక సిద్ధార్థనగర్‌ కనక మహాలక్ష్మి దేవాలయంలో సువాసినులతో శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. విశేష హారతి, మంత్రపుష్పం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. మూలవిరాట్‌ను ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ వ్యవస్థాపకుడు ఘంటసాల విజయస్వామి పాల్గొన్నారు.

ఫిరంగిపురం: మండలంలోని రేపూడి వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఉన్న ఈవీఎంలు, వీవీ ప్యాట్స్‌ గోదామును జేసీ అశుతోష్‌ శ్రీవాస్తవ మంగళవారం పరిశీలించారు. గోడౌన్‌ వద్ద భద్రత తనిఖీ చేశారు. రికార్డులు, సీసీ కెమెరాల పనితీరు పరిశీలించారు. డీఆర్‌వో శ్రీనివాసరావు, తహసీల్దార్‌ ప్రసాద రావు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement