● వరుస కరువులతో తల్లడిల్లిపోతున్న కర్షకులు
● వందలాది ఎకరాల్లో ధ్వంసం
● చీడపీడల బెడద, ధరల పతనంతో కుదేలైన రైతాంగం
ఫోటోలోని వ్యక్తి పేరు శివయ్య. ఈయనది సంబేపల్లి మండలం శెట్టిపల్లి గ్రామం దొడ్డి చేనువడ్డిపల్లి. ఆయనకు నాలుగు ఎకరాల్లో మామిడి తోట ఉండగా, వర్షాలు పడకపోవడంతో ఉన్న బోరులో అరకొరక నీళ్లు వస్తున్నాయి. ఐదు సంవత్సరాల నుంచి ఇంతవరకు మామిడి పంటలో దాదాపు రూ. 11లక్షల ఆదాయం వచ్చింది. ప్రస్తుతం రెండు సంత్సరాలు గా సరైన గిట్టుబాటు ధరలు లేక మామిడి చెట్లను వదిలేశాడు.
ఫోటోలోని వ్యక్తి పేరు శ్రీనివాసులు. ఆయన అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం మద్దిరేవుల గ్రామం రెడ్డివారిపల్లి. ఐదు ఎకరాల్లో మామాడి చెట్లు ఉండగా, పంట దిగుబడి తగ్గడం తో పాటు ఖర్చులు భారమై మామిడి చెట్లను కొట్టివేయడం జరుగుతోంది.
ఈయన పేరు బొజ్జా శ్రీధర్‌రెడ్డి.అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం దప్పేపల్లి గ్రామం కొండవాండ్లపల్లె. ఐదు ఎకరాల్లో ముదురు మామిడి తోట ఉన్నది. ఖర్చులు మందులు ప్రతి ఏడాది ఎక్కువ అవుతుండడంతో పంట దిగుబడి తగ్గడంతో పూర్తిస్థాయిలో తోటను తొలగించేసే పరిస్థితి వచ్చింది.
సాక్షి అన్నమయ్య : కరువు కాలమో....కష్టకాలమో తెలియదు గానీ రైతుకు మాత్రం విపత్తుల కాలమని చెప్పక తప్పదు. ఒకప్పుడు పది మందికి పట్టెడన్నం పెట్టే అన్నదాతకు ఇప్పుడు పుట్టెడు కష్టాలు వచ్చాయి. ఏం చేసినా ఏమున్నది గర్వకారణమన్నట్లు వ్యవసాయంలో అనునిత్యం క(న)ష్టాలే మిగిలాయి. తోటల్లోని బోరు బావుల్లో ఒకవైపు నీరు ఇంకిపోతుంటే చెట్లను సంరక్షించడం కష్టమే అయినా...ప్రాణాన్ని ఫణంగా పెడుతూ చెట్లకు ఎలాగోలా ట్యాంకర్లతో నీరుపోసి చెట్టుకు ప్రాణం పోసినా చివరకు రైతుకు మాత్రం జీవితం లేకుండా పోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండేళ్లుగా వరుస కరువులతో అన్నదాత కునారిల్లిపోతున్నాడు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తుండడంతో చేసేదేమి లేక రైతు ప్రాణంగా పెంచుకున్న చెట్లనుసైతం కొట్టేసుకుంటున్న దీన పరిస్థితి నెలకొంది. మామిడిలో దిగుబడి వచ్చినా ధరలు లేక కొందరు...కరువుతో నీరు లేక మరికొందరు...వ్యవసాయంలో ఆశించిన మేర లాభాలు రావడం లేదని ఇంకొందరి ఆవేదనకు అంతం లేకుండా పోయింది. ఏళ్లపాటు సాకిన మామిడి చెట్లను ఇటీవలి కాలంలో అన్నమయ్య జిల్లాలో వందల ఎకరాల్లో కొట్టేస్తున్న రైతు దీన గాథలపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్.
అల్లాడిపోతున్న అన్నదాత
అన్నమయ్య జిల్లాలో పండ్ల తోటల రైతులు అల్లాడిపోతున్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేక మామిడి, బొప్పాయి, అరటి రైతులు గతేడాది రోడ్డెక్కి ఆందోళనలు చేసిన పరిస్థితులు కళ్లెదుటే కనిపించాయి. గతంలో అన్నమయ్య జిల్లాలో ఉన్న రైల్వేకోడూరు బొప్పాయి, మామిడి రైతులు ధరలు లేక, పంటను ఏం చేయాలో తెలియక రోడ్లమీదనే పారబోసి నిరసనలు తెలియజేశారు. మామిడికి సంబంధించి ఆశించిన ధరలు లేకపోవడంతో మామిడి రైతులు పంటపై ఆందోళన చెందుతున్నారు. వాతావరణ పరిస్థితులతో ప్రకృతి చేస్తున్న గాయాలతో తేరుకోలేకపోతున్న రైతుపై ధరల లేమి కూడా ప్రాణసంకటంగా మారింది. ఆశించిన మేర దిగుబడులు రాకపోవడం ఒక ఎత్తయితే, పంట వచ్చినా సరైన ధర లేక రైతులు అల్లాడిపోయారు.
నాకు ఆరు ఎకరాల్లో మామిడి తోట ఉంది. రెండు బోర్లు ఉన్నాయి. ఈ సంవత్సరం రూ. 2 లక్షల పెట్టుబడి పెట్టి మామిడి తోటకు మందులు కొట్టాము. పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. రవాణా ఖర్చు కూడా చేతినుంచి పడుతోంది. ఇక మామిడి పంటకుఎంత పెట్టుబడి పెట్టినా లాభం లేదు. ఇప్పటికే మూడు ఎకరాల్లో మామడి చెట్లను తొలగించాను. బోర్లలో నీరు పూర్తిగా తగ్గాయి. వర్షాలు లేకపోవడంతో ఉన్న మామిడి చెట్లు ఎండిపోకుండా ఉండాలని రోజుకు 4 ట్యాంకర్లు చొప్పున రూ. 3200 ఖర్చు చేసి నీటిని తోలుతున్నాను. ఇప్పటికై నా ప్రభుత్వం మామిడి రైతులను ఆదుకోవాలి.
– సుబ్రమణ్యంరెడ్డి, మామిడి రైతు, నారాయణరెడ్డిపల్లె, సంబేపల్లె మండలం


