– డీఆర్‌డీఏ పీడీ
మదనపల్లె (కురబలకోట): ఐదారు కొత్త జీవనోపాధులతో మహిళల ఆదాయ మార్గాలు పెంపొందించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు డీఆర్‌డీఏ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ నాగేశ్వరరావు అన్నారు. మదనపల్లె వెలుగు కార్యాలయంలో 13 మండలాల ఏపీఎంలు, సీసీలతో శుక్రవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహిళల కుటుంబ ఆదాయాన్ని పెంచి పేదరికాన్ని నిర్మూలించడమే తమ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ప్రస్తుతం మహిళలకు ఉన్న జీవనోపాధులకు అదనంగా ప్రాంతాలు, మార్కెటింగ్ సౌకర్యాలను బట్టి కొర్రమీను, పొట్టేళ్ల పెంపకం, పెరటి కోళ్లు, పుట్టగొడుగుల పెంపకం వంటి అదనపు ఉపాధి కార్యక్రమాలు కల్పించనున్నట్లు పీడీ నాగేశ్వరరావు వెల్లడించారు.
యూరియా కోసం
రైతుల పరుగులు
రొంపిచెర్ల: మండలంలో యూరియా కోసం రైతులు ఎరువుల దుకాణాల వద్దకు పరుగులు తీస్తున్నారు. స్థానిక డీలర్ వద్దకు 30 టన్నుల యూరియా స్టాక్ రావడంతో వేరుశనగ, వరి, జెర్సీ గడ్డి సాగు చేసిన రైతులు తరలివచ్చారు. వ్యవసాయ శాఖ అధికారుల వద్ద పేర్లు నమోదు చేసుకున్న వారికి, బస్తా రూ. 270 చొప్పున ఒకరికి రెండు బస్తాల వరకు అందజేస్తున్నారు. అయితే, యూరియాతో పాటు లింకు ఎరువులుగా కాంప్లెక్స్ ఎరువులు కూడా కొనాలంటూ డీలర్లు ఒత్తిడి తెస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఏవో శ్రావణి స్పందిస్తూ.. మండలానికి మరో 90 టన్నుల యూరియా వస్తోందని, రైతులు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.


