అన్నమయ్య జిల్లాలోని రాయచోటి ప్రాంతంలో మామిడి చెట్లను రైతులు నరికి వేస్తున్నారు. వరుసగా రెండేళ్లుగా వస్తున్న కరువు పరిస్థితులతో ఏమి చేయాలో పాలుపోక...బోర్లలో నీరు లేక....ట్యాంకర్లతో తోలినా పూర్తి స్థాయిలో అందక ఎండిపోతుండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నరికి వేస్తున్నారు. ఏడాది కాదు...రెండేళ్లు కాదు...పదేళ్లు అంతకన్నా కాదు....ఇరవై ఏళ్ల పైబడి కూడా పెంచుకుంటున్న చెట్లను నీరు లేక నరికేస్తున్నారు. ఇంటిలో కుటుంబ సభ్యుల్లా ప్రేమగా పెంచుకున్న చెట్లను నరికివేసే దీన పరిస్థితి వారిది. రాయచోటి నియోజకవర్గంలోని లక్కిరెడ్డిపల్లె, సంబేపల్లె, చిన్నమండెంతోపాటు జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో అక్కడక్కడ చెట్లు కొట్టివేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి దుర్బర పరిస్థితుల్లోనైనా ప్రభుత్వం మామిడి రైతులను ఆదుకునే దిశగా అడుగులు వేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.


