మదనపల్లె టౌన్: సృష్టిలో జంతువులైనా సరే తమ బిడ్డల ఆకలి తీర్చడానికి నానా కష్టాలు పడతాయి. కానీ, మద్యం మత్తులో వివేకం కోల్పోయిన ఆ కన్నతండ్రికి మాత్రం ఆరేళ్ల కడుపు తీపి అస్సలు తెలియలేదు. తండ్రి స్థానంలో ఉండి ఆప్యాయంగా బువ్వ పెట్టాల్సింది పోయి.. ఆ బువ్వ కోసం చేతులు చాచి భిక్షాటనకు వెళ్లలేదన్న ఒకే ఒక్క కోపంతో కసాయిగా మారాడు. ఆడుకుంటున్న ఆరేళ్ల అర్భకురాలిపై ఇనుప కడ్డీతో విచక్షణా రహితంగా దాడి చేసి, నెత్తుటి కూడు మిగిల్చిన హృదయ విదారక ఘటన అన్నమయ్య జిల్లా బురకాయలకోటలో శుక్రవారం చోటుచేసుకుంది. జిల్లా ఆసుపత్రి అవుట్ పోస్ట్ పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. బురకాయలకోటకు చెందిన నారాయణ, గాయత్రి దంపతులు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం సీసాలకు సీసాలు మద్యం తాగి మత్తులో తూలుతున్న నారాయణ.. తన ఆరేళ్ల చిన్నారి కూతురు ‘చిట్టి’ని అన్నం తెచ్చేందుకు భిక్షాటనకు వెళ్లాలని పురమాయించాడు. అప్పటివరకు వీధిలో తోటి పిల్లలతో ఆడుకుంటున్న ఆ పసిపాప వెళ్లనని మొండికేసింది. అంతే.. ఆ దుర్మార్గుడికి ఒళ్లు తెలియని ఆగ్రహం ముంచుకొచ్చింది. ఆడుకునే వయసున్న ఆ చిట్టి చేతులకు ఆటబొమ్మలు ఇవ్వాల్సింది పోయి, పక్కనే ఉన్న బరువైన ఇనుప కడ్డీని అందుకుని ఆ పసిశరీరంపై విచక్షణా రహితంగా బాదాడు.ఆ దెబ్బల దెబ్బకు తట్టుకోలేక, రక్తపు మడుగులో పడి ఆ చిన్నారి చేసిన ఆర్తనాదాలు ఆ వీధిన వెళ్తున్న వారి గుండెలను పిండేశాయి. స్థానికులు కొందరు మానవత్వంతో తక్షణమే స్పందించి, ఆ తండ్రి బారి నుండి పాపను రక్షించారు. వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆకలితో అల్లాడే చిన్నారిని ప్రేమగా చూసుకోవాల్సిన తండ్రే ఇంతటి దాష్టీకానికి ఒడిగట్టడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. ఈ క్రూరమైన ఘటనపై బాలల హక్కుల సంఘాలు తక్షణమే స్పందించి, బాధితురాలికి న్యాయం చేయాలని, ఆ కసాయి తండ్రికి కఠిన శిక్ష పడేలా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
‘భిక్షాటన’ చేయలేదని ‘చిట్టి’తల్లిపై
కన్నతండ్రి దాష్టీకం
తండ్రి కొట్టడంతో గాయపడిన చిట్టి


