కలికిరి: జిల్లా విద్యాశాఖాధికారి, కలికిరి మండల ప్రత్యేకాధికారి సుబ్రమణ్యం శుక్రవారం కలికిరి పట్టణ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, టి.చదివేవాండ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఇందిరమ్మ కాలనీలోని ఎంపీపీ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా టి.చదివేవాండ్లపల్లి స్కూల్లో మేజర్, మైనర్ రిపేరీలకు ఫీల్డ్ ఇంజినీర్ ద్వారా అంచనాలు రూపొందించి, పేరెంట్స్ కమిటీతో పనులు పూర్తి చేయించాలని ఆదేశించారు. ఇందిరమ్మ కాలనీ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన నాణ్యతను, ప్రభుత్వ పాఠశాలలో రసాయన శాస్త్రం (కెమిస్ట్రీ) ల్యాబ్, పరిసరాలను పరిశీలించారు. పదో తరగతిలో వంద శాతం ఫలితాలు సాధించేలా కృషి చేయాలని హెచ్‌ఎం నటరాజన్‌కు సూచించారు. అనంతరం కలికిరిలో జరుగుతున్న జనగణన ప్రక్రియను తనిఖీ చేసిన డీఈఓ.. వివరాల నమోదు పక్కాగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు.


