పైసా లేకుండా రెన్యువల్
సాక్షి, మదనపల్లె: వ్యవసాయ మార్కెటింగ్ శాఖలో రైతులు దోపిడీకి గురికాకుండా వైఎస్‌ఆర్సీపీ ప్రభుత్వం టమాటా కమిషన్ మండి అనే పేరు లేకుండా చేసింది. స్వచ్ఛంద వ్యాపారం పేరుతో వలంటరీ లైసెన్స్ విధానం తీసుకొచ్చింది. అయితే మదనపల్లె మార్కెట్లో ఈ వ్యవహారం అధికారులకు కనక వర్షం కురిపిస్తోంది. 55 మంది మండి యజమానులు ఆరు నెలల నుంచి మూడేళ్ల వరకు లైసెన్స్ లేకుండానే యథేచ్ఛగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకుంటున్నారు. తాజాగా కోర్టు తీర్పుతో వలంటరీ లైసెన్సులు పొందాల్సి ఉండటంతో అధికారులు దీనిని ఆసరాగా చేసుకుని దండుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
వద్దంటూ హైకోర్టుకు
మదనపల్లె మార్కెట్ యార్డులో 120 మందికి పైగా లైసెన్స్ కలిగిన మండిలు ఉన్నాయి. దీనిపై చాలా మంది స్వచ్ఛంద వ్యాపారం నిర్వహిస్తామని అంగీకరిస్తూ వలంటరీ లైసెన్స్ తీసుకున్నారు. 55 మంది దాకా ఈ విధానాన్ని వ్యతిరేకించారు. 25 మంది హైకోర్టును ఆశ్రయించారు. దీని ఫలితంగా వీరు మూడేళ్లుగా లైసెన్సులను రెన్యువల్ చేసుకోలేదు. అయినప్పటికీ వ్యాపారాలు నిర్వహించుకుంటూ వచ్చారు. దీనిపై గత కార్యదర్శులు మండీ యజమానులకు పలుమార్లు నోటీసులు జారీ చేశారు.
కొత్త విధానం వైపే తీర్పు
తాము కమీషన్ మండీ పేరుతోనే లైసెన్సులు తీసుకుంటామని 25 మంది మండీ యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ అనంతరం మూడు రోజుల క్రితం న్యాయస్థానం వలంటరీ లైసెన్స్ తీసుకోవాల్సిందేనని తీర్పు ఇచ్చినట్టు మార్కెటింగ్ శాఖ వర్గాలు తెలిపాయి. దాంతో మండీ యజమానులు తప్పనిసరిగా వలంటరీ లైసెన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వారికి అవసరం.. వీరికి అవకాశం
మదనపల్లె మార్కెట్లో మూడేళ్లుగా లైసెన్సులు రెన్యువల్ చేసుకోకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న మండీ యజమానులు తప్పనిసరిగా వలంటరీ లైసెన్స్ తీసుకోవాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇది అధికారులకు అందివచ్చిన అవకాశంగా మారింది. కొందరు లైసెన్సుల రెన్యువల్ కోసం అధికారులతో బేరసారాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇటీవల కొంతమంది మండి యజమానులతో చర్చించినట్లు సమాచారం. చర్చోప చర్చలు సాగిన తర్వాత మధ్యే మార్గంగా లైసెన్స్ రెన్యువల్, అగ్రిమెంట్లు, ఇతర చర్యలు పూర్తి చేయడం కోసం ఒక్కో లైసెన్స్కు రూ.20 వేలు ఇచ్చేలా నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ చర్యలు రెండు మూడు రోజుల్లో పూర్తి కావాలని నిర్ణయించినట్లు అభిజ్ఞవర్గాల భోగట్టా. ఈ వారంలోనే మార్కెటింగ్ అధికారుల పదోన్నతులు, బదిలీలు ఉండటంతో తర్వాత లైసెన్సుల రెన్యువల్ ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలని, అందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని మండీ యజమానులకు సూచించినట్లు సమాచారం.
మదనపల్లె టమాటా మార్కెట్లో
లైసెన్స్ రెన్యువల్‌కు ‘రేటు’ ఫిక్స్ చేసిన అధికారులు
20 వేలు ఇస్తేనే ఫైల్ కదిలేది..
హైకోర్టు తీర్పు ముసుగులో
విచ్చలవిడి వసూళ్ల పర్వం
హైకోర్టు తీర్పు తర్వాత మండీ యజమానులు వలంటరీ లైసెన్సులు తీసుకోవాల్సి ఉంది. దీనికోసం ఎవ్వరూ డబ్బు డిమాండ్ చేయడం లేదు. పైసా తీసుకోకుండా ప్రతి ఒక్కరికి లైసెన్సులు రెన్యువల్ చేస్తాం. ఇందులో మధ్యవర్తుల అవసరం లేదు. – త్యాగరాజు,
ఏడీ, మదనపల్లె ఇన్చార్జి కార్యదర్శి


