● టీడీపీ ఎమ్మెల్సీ చెప్పిందానికల్లా తలాడిస్తున్న డీఈఓ!
● విచక్షణ మరిచి టీచర్లపై సస్పెన్షన్ వేటు
సాక్షి ప్రతినిధి, కడప : టీడీపీ ఎమ్మెల్సీ ఆడే ఆటలో డీఈఓ పావుగా మారిపోయారా? చెప్పిందానికల్లా తలాడిస్తున్నారా? తప్పొప్పులను కాదని విచక్షణ మ రిచి ప్రవర్తిస్తున్నారా? జిల్లా ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు ఇందులో భాగమేనా? అంటే.. ఉపాధ్యాయ సంఘాలు ‘అవున’నే అంటున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఇన్ సర్వీస్ టీచర్లకు టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నుంచి మినహాయించాలని, 30ఏళ్లుగా విధి నిర్వహణలో ఉన్న టీచర్లకు మళ్లీ టెట్ నిర్వహించడం సహేతుకం కాదని ఉపాధ్యా య సంఘాలన్నీ ముక్తకంఠంతో ఆందోళన చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో టెట్ వల్ల ఏపీలో లక్షమంది టీచర్లు ఇబ్బందులు పడుతున్నారని జిల్లాకు చెందిన పలు వురు టీచర్స్ యూనియన్ నాయకులు ఇటీవల పులి వెందులలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి విన్నవించారు. స్పందించిన వైఎస్ జగన్ న్యాయపోరాటంతో పాటు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామని, కేంద్ర విద్యాశాఖ మంత్రి అపాయింట్‌మెంట్ వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు కోరతారని, టీచర్స్ ప్రతినిధుల బృందం వారితో వెళ్లి విన్నవించాలని సూచించారు. ఈ మేర కు మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వైఎస్సార్‌సీపీ ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎం.గురుమూర్తి, గొల్లబాబురావు, వైఎస్సార్‌సీపీ టీచర్స్ ఎమ్మెల్సీలు పద్మాలతారెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి గత గురువారం ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషితో సమావేశమై వాస్తవ విషయాలను విన్నవించారు. వీరితో పాటు జిల్లాకు చెందిన టీచ ర్స్ యూనియన్ నేతలు వెంకటనాథరెడ్డి, సింగారెడ్డి అమర్‌నాథరెడ్డి (వైఎస్సార్‌టీఏ), నర్రెడ్డి సంగమేశ్వరరెడ్డి (ఎస్టీయూ) ప్రహ్లాద్ జోషిని కలిసి టెట్ వల్ల టీచర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు.
డీఎస్సీపై ఫిర్యాదు చేశారంటూ సస్పెన్షన్
కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషిని కలిసి రాష్ట్రంలో డీఎస్సీలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఫిర్యాదు చేశారని, ఆ మేరకు వాట్సాప్ మెసేజ్ తమ వద్ద ఉందంటూ డీఈఓ షంషుద్ధీన్ సదరు ఉపాధ్యా యులు వెంకటనాథరెడ్డి, అమర్‌నాథరెడ్డి, సంఘమేశ్వరరెడ్డిలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వాట్సాప్ మేసేజ్‌ల ఆధారంగా ఏకంగా సస్పెండ్ చేయడం, పైగా తప్పుడు ఆరోపణలు చూపించడంపై పలువురు టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీచర్ల ఇష్యూపైన పోరాటం చేస్తున్న యూనియన్ నేతల్ని సస్పెన్షన్ చేయాలని ఓ ఎమ్మెల్సీ నుంచి వచ్చిన ఒత్తిడి మేరకే ముందు వెనుకా ఆలోచించకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీచర్ల్ల సంఘాలు కోడై కూస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్ష మంది టీచర్ల ఇబ్బందులపై కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే సస్పెన్షన్ చేయడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. షోకాజ్ కూడా కోరకుండా ఏకంగా సస్పెన్షన్ చేయడంపై తప్పుబడుతున్నారు. ఈవిషయమై డీఈఓను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాకపోవడం గమనార్హం.


