కలికిరి : కేంద్ర హోశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సోమవారం కలికిరి సీఆర్‌పీఎఫ్ కేంద్రానికి రానున్నారని సీఆర్‌పీఎఫ్ అధికారులు తెలిపారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1గంటకు సీఆర్‌పీఎఫ్(సీఐఏటీ–3) కేంద్రానికి విచ్చేసి సీఆర్‌పీఎఫ్ ప్రాంగణంలో నూతనంగా నిర్మాణాలు పూర్తి చేసుకున్న గెజిటెడ్ ఆఫీసర్‌ల మెస్, సబార్డినేట్ ఆఫీసర్స్‌మెస్, స్టోరేజి భవనాలను ప్రారంభిస్తారని వివరించారు.
‘సర్దార్’ గౌతు లచ్చన్న సేవలు ఎనలేనివి
మదనపల్లె టౌన్ : మదనపల్లె జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకలను మదనపల్లె జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో, ఆదివారం అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం. వెంకటాద్రి స్థానికల పోలీస్ అధికారులతో కలసి లచ్చన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం లాంటి జాతీయ ఉద్యమాల్లో గౌతు లచ్చన్న వీరోచిత పోరాటాన్ని గుర్తుచేశారు. ఏఆర్ డీఎస్పీ డి.ఏడుకొండల రెడ్డి, ఆర్‌ఐ యు. రంగనాథ్ బాబు, ఆర్‌ఎస్‌ఐలు, శ్రీనివాస్, రవి, సిబ్బంది పాల్గొని ఘనంగా లచ్చన్నకు నివాళులర్పించారు.
మిట్స్ ఎన్‌సీసీ ఎయిర్‌వింగ్ క్యాడెట్ల సత్తా
కురబలకోట : అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ ఎన్‌సీసీ ఎయిర్‌వింగ్ క్యాడెట్లు జాతీయ స్థాయిలో సత్తా చాటినట్లు వీసీ యువరాజ్ తెలిపారు. వరంగల్ యమ్నూర్ ఎయిర్ పోర్ట్‌లో నిర్వహించిన ఆల్ ఇండియా వాయు సైనిక్ క్యాంప్–26లో తిరుపతి గ్రూప్ ఎన్‌సీసీ తరఫున పాల్గొన్న మిట్స్‌కు చెందిన తొమ్మిది మంది క్యాడెట్లు అద్భుత ప్రతిభ కనపరిచినట్లు తెలిపారు. ఆర్‌సీ ఎయిర్ క్రాఫ్ట్ ప్లయింగ్ విభాగంలో జి.రుద్రతేజ, జె.రంజిత్‌కుమార్ స్వర్థ పతకాలు సాధించగా స్టాటిక్ మోడల్ విభాగంలో బి.గోపిచంద్, జి.వర్షిణి రజత పతకాలు సాధించారని తెలిపారు. మిట్స్ ఎన్‌సీసీ క్యాడెట్లు తొలిసారిగా ఏరో మోడలింగ్ ఛాంపియన్ షిప్‌ను దక్కించుకోవడం విశేషమని రిజిస్ట్రార్ ప్రదీప్‌కుమార్ తెలిపారు. మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ చాన్స్‌లర్ నాదేళ్ల విజయభాస్కర్ చౌదరి, ప్రో చాన్స్‌లర్ నాదేళ్ల ద్వారకనాథ్ వారిని అభినందించారు.


