పాతాళంలో గంగ ! | - | Sakshi
Sakshi News home page

పాతాళంలో గంగ !

Aug 17 2026 1:53 AM | Updated on Aug 17 2026 1:53 AM

పాతాళంలో గంగ !

సాక్షి, మదనపల్లె: జిల్లాలో భూగర్భ జలాలు పాతాళంలోకి పడిపోతున్నాయి. ఎల్‌నినో ప్రభావ ఫలితంగా జిల్లాలో వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపించగా, ఇప్పుడు భూగర్భ జలమట్టాలు భారీగా పడిపోతున్నాయి. మున్ముందు తీవ్రమైన పరిస్థితులు ఎదురు కానున్నాయి. గత 15 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జూన్‌లో లోటు వర్షపాతం నమోదైంది. జూలై, ఆగస్టులో ఇంతవరకు చినుకు జాడలేదు.

సగటు 16.47 మీటర్లు

జిల్లాలో సగటు భూగర్భ జలమట్టం 16.47 మీటర్లకు చేరింది. గత జూన్‌ నెలలో సగటు 12.32 మీటర్లలో నీటి లభ్యత ఉండేది. ఇప్పుడు ఈ ఆగస్టులో లోతుకు వెళ్ళింది. 2024 ఆగస్టులో 13.97 మీటర్లలో ఉండగా, 2025 ఆగస్టులో 13.63 మీటర్లలో నీటి లభ్యత ఉండేది. ప్రస్తుత నీటిమట్టం పోలిస్తే 2.84 మీటర్ల లోతులోకి నీటిమట్టం పడిపోయింది. ఇది ఇంకా లోతుకు పడిపోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు తప్పవు.

రామసముద్రంలో అత్యంత ప్రమాదం

జిల్లాలోని 25 మండలాల్లో రామసముద్రం మండలం అత్యంత ప్రమాదకర స్థితిలో ఉంది. ఇక్కడ భూగర్భ జలమట్టం 64.88 మీటర్ల లోతుకు పడిపోయింది. ఇక్కడ తీవ్ర పరిస్థితి కళ్లకు కనిపిస్తోంది. అలాగే నిమ్మనపల్లెలో 28.97, గుర్రంకొండ లో 28.91, ములకలచెరువులో 27.54, కలికిరిలో 25.29, కలకడలో 20.73, గుర్రంకొండ లో 17.31, పుంగనూరులో 16.74, రాయచోటిలో 16.65, తంబళ్లపల్లెలో 16.16, సంబేపల్లిలో 15.54, కురబలకోటలో 15.38 మీటర్ల లోతుకు నీటిమట్టం పడిపోయింది. చౌడేపల్లి మండలంలో మాత్రం నీటిమట్టం పడిపోకుండా జిల్లాలో అతి తక్కువ లోతులో నీటి లభ్యత ఉంది. ఇక్కడ 1.76 మీటర్లకే నీళ్లు లభిస్తున్నాయి. మిగతా మండలాల్లోనూ 10 మీటర్లకు పైనే నీటిమట్టం తగ్గింది.

పగబట్టిన ఎల్‌ నినో

జిల్లాపై ఎల్‌నినో పగబట్టింది. వర్షపాతం దేవుడెరుగు చినుకు జాడలేదు. చినుకు కోసం పల్లెల్లో ప్రజలు పూజలు, దైవకార్యాలు నిర్వహిస్తున్నారు. జూన్‌లో సగటు వర్షపాతం 75.1 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా 40.4 మిల్లీమీటర్ల కురిసింది. 47.9 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం నమోదైంది. జూలైలో 90.5 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా ఒక్క మిల్లీమీటర్‌ కూడా నమోదు కాలేదు. ఇప్పుడు ఆగస్టులో 99.8 మిల్లీమీటర్ల వర్షపాతం సగటున కురవాల్సి ఉంటే ఇప్పటిదాకా జిల్లా వ్యాప్తంగా ఒక్క మండలంలో కూడా వర్షపాతం నమోదు కాలేదు. ఈ పరిస్థితి పరిశీలిస్తే జూన్‌ 14వ తేదీ నుంచి ఆదివారం వరకు జిల్లాలో వర్షపాతం మాటే లేదు.

ఖాళీ అవుతున్న చెరువులు

జిల్లాలో 3765 చెరువులు, బాహుదా, పెద్దేరు, చిన్నేరు, దబ్బలగుట్ట, వెలిగల్లు సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న చెరువులో పది శాతం నీళ్లు కూడా లేవు. కొన్నిచోట్ల 20 శాతం దాకా నీటి నిల్వలు ఉన్నప్పటికీ అవి కూడా ఈ నెలాఖరులోగా ఇంకిపోయే ప్రమాదం ఉంది. ప్రాజెక్టుల్లో కూడా నీటిమట్టం అడుగంటి పోతోంది. ఆగస్టు గడిస్తే జిల్లా వ్యాప్తంగా నీటి నిల్వలు పూర్తిగా పడిపోతాయి. తద్వారా భూగర్భ జలాల పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. ఇప్పుడున్న భూగర్భ జలమట్టం కంటే ఇంకా దిగువకు పడిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది.

జిల్లాలో సగటు 16.47 మీటర్లకు

పడిపోయిన భూగర్భ జలాలు

రామసముద్రంలో 64.88 మీటర్ల లోతుకు

ఆగస్టులోనూ చినుకు జాడలేదు

ఎండిపోతున్న చెరువులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement