మా దిక్కు రావయ్యా.. వాన దేవుడా! | - | Sakshi
Sakshi News home page

మా దిక్కు రావయ్యా.. వాన దేవుడా!

Aug 17 2026 1:53 AM | Updated on Aug 17 2026 1:53 AM

పదును వర్షం కోసం వరుణ యాగాలు

జోరుగా కప్పాలమ్మ ఊరేగింపులు

ఆచారాలు గుర్తు చేస్తున్న పల్లె జనం

కడప సెవెన్‌రోడ్స్‌ : ఎల్‌నినో నేపధ్యంలో జిల్లాలో తీవ్ర అనావృష్టి పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడప్పుడు మేఘాలు రెండు చినుకులు రాల్చి వెళ్లడంమినహా పదును వర్షం కురిసింది లేదు. ఫలితంగా సాగు చతికిలపడిపోయింది. నదులు, వంకలు, వాగు లు ఎండి ఎడారులను తలపిస్తున్నాయి. పాతాళ గంగమ్మ రోజురోజుకు అడుగంటిపోతోంది. అనేక గ్రామాలు దాహార్తితో అలమటిస్తున్నాయి. వరుణ దేవుడు కరుణిస్తే తప్ప కష్టాలు గట్టెక్కవు. అందుకే జిల్లా వాసులు ‘ఏ దిక్కునున్నావు వాన దేవుడా.. మా దిక్కు రావయ్యా వాన దేవుడా’.. అంటూ మొరపెట్టుకుంటున్నారు. వరుణుని మెప్పించేందుకు అనాదిగా వస్తున్న సంప్రదాయాలను పాటిస్తున్నారు.

వరుణ యాగాలు

వర్షం కోసం వరుణ యాగాలు నిర్వహించే సంప్రదాయం జిల్లాలో అనాదిగా వస్తోంది. 1810–13లో కరువు సంభవించినపుడు ఆనాటి కలెక్టర్‌ సీఆర్‌ రాస్‌ వరుణ యాగాలు జరిపించారు. 1822–24లో కరువు కబళించినపుడు కలెక్టర్‌ జె.హన్బరి 300 వరహాలు మంజూరు చేయించి పుష్పగిరిలో వరుణ యాగం జరిపించినట్లు కడపజిల్లా గెజిటీర్‌లో ఉంది. వర్షాలు పడక పంటలు ఎండిపోతున్న సందర్బాల్లో ప్రభుత్వాలే వరుణ యాగాలను నిర్వహిస్తోంది. రాష్ట్ర దేవాదాయ ధర్మదాయశాఖ వరుణ యాగాలు నిర్వహించాలంటూ సర్క్యులర్‌ జారీ చేసింది. ఈ మేరకు రాయచోటి శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో శివునికి సహస్ర ఘటాభిషేక సహిత వరుణ యాగ మహోత్సవాన్ని ఈనెల 1 నుంచి 3వ తేది వరకు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇటీవల ప్రొద్దుటూరు పట్టణంలో పోతురాజుగడ్డ వద్ద మహిళలు 108 కలశాలతో జలాభిషేకం నిర్వహించి వర్షాలు కురవాలని ప్రార్థించారు. జిల్లాలో ఇప్పటికే అనేక గ్రామాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో గ్రామ దేవత గంగమ్మకు బోనాలు సమర్పించి వర్షాలు కురిపించాలని పూజలు నిర్వహించారు. మదనపల్లె పట్టణం కదిరి రోడ్డులోని టిప్పుసుల్తాన్‌ మైదానంలో ముస్లింలు వర్షాల కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

కప్పాలమ్మ ఊరేగింపు

కరువులు వచ్చిన సందర్భాల్లో వానలు కురవాలని పల్లెల్లో కప్పలను ఊరేగించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. జిల్లాలో ఇప్పటికే పలుచోట్ల కప్పలను ఊరేగించారు. కప్ప అరిస్తే వర్షం పడుతుందనేది పూర్వం నుంచి ప్రజల విశ్వాసం. పలుచోట్ల కప్పలకు పెళ్లిళ్లు నిర్వహిస్తారు. కప్పలు సంతోషంగా ఉంటే మేఘాలు కరుణిస్తాయన్నది నమ్మకం. ఈ వేడుకలో మహిళలతో పాటు పిల్లాజల్లా ఉత్సాహంగా పాల్గొంటారు. ‘‘కప్పాలమ్మ నీళ్లాడే.. కడవలు దొర్లా నీళ్లొచ్చే’’.. అంటూ పాటలు ఆలపిస్తారు. కప్పాలమ్మ అనేది ఒక నమ్మకం మాత్రమే కాదు.. అది జిల్లా రైతు బతుకు, ప్రకృతితో పెనవేసుకున్న బంధానికి గుర్తు. ఈ ప్రార్థనలు మన్నించి వరుణుడు తన కరుణా కటాక్షాలను ప్రసరింపజేస్తే కరువు కష్టాల నుంచి జిల్లా వాసులు గట్టెక్కుతారు. మరి వరుణుడు ఆలకిస్తాడో.. అలకబూనుతాడో కాలానికెరుక.

గుగ్గెమ్మ తల్లికి పూజలు

చౌడేపల్లె : నీళ్లులేక పంటలు ఎండిపోతున్నాయ్‌... బోరు బావుల్లో నీటి మట్టం తగ్గిపోతోంది. మాపై కరుణించి వర్షం కురిపించు.. అంటూ అన్నమయ్య జిల్లా దిగువపల్లె పంచాయతీ మాదంవారిపల్లె గ్రామస్తులు వేడుకొన్నారు. ఆదివారం కాగతి చెరువు కట్టపై వెలసిన గ్రామదేవత గుగ్గెమ్మ తల్లికి ఇంటిటా రైతులు తరలివచ్చి పూజలు చేసి 101 బిందె నీటితో అభిషేక పూజలు చేశారు. పూర్వికుల ఆచారం మేరకు వర్షం కోసం గుగ్గెమ్మ తల్లికి పూజలు చేసి రాగి గంజి తయారు చేశారు. అక్కడికి చేరుకొన్న ప్రజలకు రాగి గంజి పంపిణీ చేశారు. అన్నం వడ్డించి చెరువులోకి వెళ్లి ‘అమ్మా.. గుగ్గెమ్మ తల్లీ తినడానికి అన్నం ఉంది .. తాగడానికి నీళ్లు లేవమ్మా..’ అంటూ కేకలు పెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement