● అలరించిన సాంస్కృతిక నృత్యాలు
● ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన
సాక్షి, మదనపల్లె : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. మువ్వన్నెల పతాక సాక్షిగా ప్రతి గుండెలోనూ ’స్వాతంత్య్ర’ స్ఫూర్తి రగిలింది, దేశభక్తి ఉప్పొంగింది. ఈ పండుగ వేళ నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు వీక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ కళాకారులు ప్రదర్శించిన నృత్య రూపకాలు భారతీయ సంస్కృతీ సంప్రదాయాల వైభవాన్ని కళ్లకు కట్టాయి. జిల్లా కేంద్రంలో కనుల పండువగా సాగిన ఈ వేడుకలకు మదనపల్లె బీటీ కళాశాల మైదానం వేదికై ంది. ఇందులో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలు, వివిధ కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వాటిలో పోలీసు జాగిలాలు జూలీ, జెర్సీ చేసిన హార్డిల్ జంప్, నేరస్తులు వదిలి వెళ్లిన వస్తువులను గుర్తించడం, వారిని పట్టుకోవడం, ఎరచ్రందనం వాహనాల గుర్తింపు, స్టెంట్ జంప్, తదితర విన్యాసాలు అబ్బురపరిచాయి. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక శాఖ చేపట్టే చర్యలను ప్రదర్శన రూపంలో చూపించారు. ఫైర్ ఇంజన్ ద్వారా నీటిని చిమ్ముతూ మువ్వన్నెల జెండా రంగుల నీటి ప్రదర్శన ఆకట్టుకుంది.
సాంస్కృతిక ప్రదర్శనలు
మదనపల్లెకు చెందిన పీపుల్ ట్రీ స్కూల్ విద్యార్థినులు ఇదే మన భారతం–ఏ మేరా ఇండియా అనే దేశభక్తి గీతానికి చేసిన నృత్య ప్రదర్శన దేశభక్తి, సమైక్యతను చాటింది. భాష్యం పాఠశాల విద్యార్థినులు కృష్ణా–గోదావరి, తుంగభద్ర నదులు, నమో నమో జనని అంటూ ఆంధ్రప్రదేశ్ చారిత్రాత్మక వైభవ ప్రాభవ సంస్కృతి సంప్రదాయాలు, మతసామరస్యం తెలిపేలా ప్రదర్శించిన నృత్యం ఆకట్టుకుంది. గురుకుల అప్పర్ ప్రైమరీ పాఠశాల విద్యార్థులు నమో నమో భారతాంబే–వందేమాతరం అంటూ దేశభక్తి గీతానికి నృత్య ప్రదర్శన చేశారు. కలికిరి సైనిక్ పాఠశాల విద్యార్థులు దేశ సైనిక పోరాట పాటవాన్ని ప్రదర్శిస్తూ... దేశ సరిహద్దుల్లో ప్రాణాలొడ్డి రక్షణగా నిలుస్తున్న సైనికుల వీరోచిత విన్యాసాలను ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. గురుకుల పాఠశాల విద్యార్థులు భారత్ మేరా రంగ్ దే బసంతీ గీతానికి వివిధ భాషా సంస్కృతులను ప్రతిబింబిస్తూ వాయిద్య పరికరాలతో చేసిన సంప్రదాయ నృత్య ప్రదర్శన ఉత్సాహ భరితంగా జరిగింది. ఈ కార్యక్రమాల్లో ఏపీఎస్‌డబ్ల్యూఎస్ విద్యార్థులకు మొదటి, పీపుల్ ట్రీ విద్యార్థులకు రెండవ, కలికిరి సైనిక్ విద్యార్థులకు మూడవ బహుమతులు దక్కాయి.
శకటాల ప్రదర్శన
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ శాఖలకు చెందిన శకటాల ప్రదర్శన జరిగింది. శక్తి, వజ్ర, మైన్ ప్రొటెక్టెడ్ వాహనాలు, రవాణా శాఖ సీ్త్ర శక్తి వాహనం, జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా), ఉద్యానవన శాఖ, స్కౌట్, జిల్లా విద్యాశాఖ–సమగ్ర శిక్ష, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, 108, తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్–అర్బన్ డెవలప్మెంట్ (అన్న క్యాంటీన్), జల వనరుల శాఖ, విద్యుత్ శాఖ పశుసంవర్ధక శాఖలు శకటాలను ప్రదర్శించాయి. వీటిలో రవాణా శాఖకు మొదటి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) రెండవ, విద్యాశాఖకు మూడవ బహుమతులు దక్కాయి.
స్టాళ్లు
మైదానంలో సీ్త్ర శిశు సంక్షేమ శాఖ, ఎస్సీ ఎస్టీ, బీసీల సంక్షేమ శాఖ, చేనేత–జౌళి శాఖ, వ్యవసాయ శాఖ, వైద్య ఆరోగ్యశాఖ, పరిశ్రమల శాఖ, గ్రామీణ నీటి సరఫరా శాఖ స్టాళ్లను మంత్రి, ఇన్‌చార్జ్ కలెక్టర్, జిల్లా అధికారులు తిలకించారు. వీటిలో అరకు కాఫీ స్టాల్ ఆకర్షణగా నిలిచింది. వ్యవసాయ శాఖ మొదటి, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ రెండవ, పరిశ్రమల శాఖ మూడవ బహుమతిని దక్కించుకున్నాయి.


