● కాళ్లరుగుతున్నా అర్జీదారులకు నిరాశే
● కలెక్టరేట్‌లో 345 అర్జీల స్వీకరణ
● స్పందించని క్షేత్రస్థాయి అధికారులు
మదనపల్లి (కురబలకోట) : వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆశ్రయించే ప్రజలకు పీజీఆర్‌ఎస్ (ప్రజా గ్రీవెన్స్ రీడ్రెస్సల్ సిస్టమ్) చివరి ఆశగా నిలుస్తోంది. అయితే, సోమవారం మదనపల్లి కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ హాల్ అర్జీదారులతో కిక్కిరిసిపోయింది. స్థానికంగా పనులు కాక, సుదూర ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలకోర్చి వచ్చిన బాధితులకు ఇక్కడా నిరాశే ఎదురవుతోంది. ‘తిరిగి తిరిగి కాళ్ల చెప్పులు అరిగిపోతున్నా.. సమస్య మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నట్లుగా ఉందని అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొలిసారి ఎంతో ఆశతో అర్జీ ఇస్తే, నెలలు గడుస్తున్నా మోక్షం లభించడం లేదని, దీంతో ఈ వ్యవస్థపై భ్రమలు తొలగిపోతున్నాయని వాపోతున్నారు. ఉన్నతాధికారులు కింది స్థాయి సిబ్బందికి ఫైళ్లను పంపుతున్నా.. క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితం కనిపించడం లేదు. కాగా, సోమవారం కలెక్టరేట్ హాల్‌లో ఇన్‌చార్జి జిల్లా కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి తదితరులు బాధితుల నుంచి 345 అర్జీలను స్వీకరించారు. వీటిని నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని కింది స్థాయి అధికారులను ఆదేశించారు. పీజీఆర్‌ఎస్‌లో వెల్లువెత్తిన కొన్ని ప్రధాన సమస్యలు ఇవీ..
ఆధార్ తప్పులతో ‘తల్లికి వందనం’ దూరం
కురబలకోట మండలం అంగళ్లు గ్రామం కమతంపల్లికి చెందిన జి.నాగమణి కుమార్తె దివ్యశ్రీ పేరు, వారింటి పక్కన ఉన్న షేక్ జైనుబీ ఖాతాలో తప్పుగా నమోదైంది. ఫలితంగా ‘తల్లికి వందనం’ పథకం డబ్బులు జమ కావడం లేదని నాగమణి పీజీఆర్‌ఎస్‌లో అర్జీ ఇచ్చారు.
బ్యాటరీ వాహనం కోసం వృద్ధుడి నిరీక్షణ
ములకలచెరువు మండలం కదరినాథునికోట (గాలేటివారిపల్లి)కు చెందిన దివ్యాంగుడు పూజారి వెంకటప్ప (72) తనకు మూడు చక్రాల బ్యాటరీ వాహనాన్ని మంజూరు చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ను కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్.. తగు చర్యలు తీసుకోవాలని వికలాంగుల కార్పోరేషన్ అధికారులను ఆదేశించారు.
వంద ఎకరాల చెన్నయాని చెరువు ఆక్రమణ
వాల్మీకిపురం మండలం మాధవవరంపల్లి గ్రామ పరిధిలోని 100 ఎకరాల ’చెన్నయాని చెరువు’ ఆక్రమణలకు గురవుతోందని ఆయకట్టుదారులు ఫిర్యాదు చేశారు. కొందరు చెరువుకు కంచె వేసి, మట్టి తోలి, పంటలు సాగు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సర్వే నిర్వహించి ఆక్రమణలు తొలగించాలని ఇన్‌చార్జి కలెక్టర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
కోరినా రాని సర్వేయర్
కురబలకోట మండలం తట్టివారిపల్లికి చెందిన వి.ఉత్తన్న తన వివాదాస్పద భూమిని సర్వే చేయాలని పలుమార్లు కోరినా సర్వేయర్ రావడం లేదని ఫిర్యాదు చేశారు. రికార్డుల ప్రకారం భూమిని కొలిచి సరిహద్దులు నిర్ణయించాలని కోరారు.
ఉత్తర్వులు వచ్చినా అందని సీఎంఆర్‌ఎఫ్
తంబళ్లపల్లి మండలం గోపిదిన్నె గ్రామం కొత్తపల్లికి చెందిన దివ్యాంగుడు చిన్న కుళ్ళాయప్ప 2019లో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వైద్య చికిత్సల కోసం సీఎంఆర్‌ఎఫ్ (ముఖ్యమంత్రి సహాయ నిధి) కింద రూ.2 లక్షలు మంజూరైనట్లు ఉత్తర్వులు వచ్చినా.. ఆరేళ్లుగా నేటికీ ఆ సొమ్ము అందలేదు. విజయవాడ కార్యాలయానికి వెళ్లగా ఉత్తర్వులలో తేదీ మార్చుకుని వస్తేనే తిరిగి మంజూరు చేస్తామని అధికారులు చెప్పడంతో, ఆ తేదీని మార్చి ఇవ్వాలని ఆయన ఇన్‌చార్జి జిల్లా కలెక్టర్‌ను కోరారు.
నా భూమిలో దారి వేయడానికి చూస్తున్నారు
లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురం గ్రామం చౌటపల్లికి చెందిన ఎన్.రామకృష్ణారెడ్డి పీజీఆర్‌ఎస్‌లో అభ్యర్థిస్తూ.. తనకు ఉన్న అరకొర పొలంలో కొందరు దారి వేయడానికి ప్రయత్నిస్తున్నారని, ఆ చర్యను అడ్డుకోవాలని కోరారు. ఇప్పటికే పొలానికి దారి ఉన్నప్పటికీ, కేవలం రాజకీయ కారణాలతోనే కొందరు తన భూమిపై కన్నేసి మరో దారి కోసం ప్రయత్నిస్తున్నారని వాపోయారు.
జూదరుల కొమ్ముకాస్తున్న హోంగార్డులు
గుర్రంకొండ పోలీస్ స్టేషన్ హోంగార్డులు రాఘవ, చంద్రశేఖర్ జూదరులు, కోడిపందాల నిర్వాహకుల వద్ద మామూళ్లు వసూలు చేస్తూ వారికి కొమ్ముకాస్తున్నారని కురబలకోట మండలం మట్లివారిపల్లికి చెందిన కిడ్నీ బాధితుడు ఇ.రెడ్డెప్పనాయుడు ఫిర్యాదు చేశారు. వ్యవసాయం చేసుకునే తన పొలం వద్దకు జూదరులు పేకాట ఆడటానికి వచ్చేవారని, ఆ నెపంతో హోంగార్డులు తన వద్ద నుంచి రూ.30 వేలు తీసుకుని ఇవ్వడం లేదని, పైగా తప్పుడు కేసులో ఇరికిస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జి కలెక్టర్ పోలీసు అధికారులను ఆదేశించారు.


