మదనపల్లె టౌన్ : ఇంట్లో కూర్చునే సులభంగా డబ్బు సంపాదించవచ్చంటూ స్క్రబ్‌ఎక్స్ పేరుతో నమ్మించి, వేలాది మంది కస్టమర్ల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన బోగస్ కంపెనీ బోర్డు తిప్పేసింది. పెట్టుబడిదారులకు ఆశ చూపిన విధంగా నగదు చెల్లించకుండా కార్యాలయానికి తాళం వేసి నిర్వాహకులు పరారయ్యారు. నెల్లూరుకు చెందిన తిరుమల కోదండ రమేష్ సీఈవోగా ఉన్న ఈ కంపెనీ, ఇన్‌స్ట్రాగామ్ రీల్స్ ద్వారా భారీ ఎత్తున ప్రచారం సాగించింది. రూ.1 లక్ష పెట్టుబడి పెడితే నెలకు ఏకంగా రూ.24 వేలు ఇస్తామని నమ్మబలికింది. అలాగే రూ.80 వేలు కడితే 15 రోజులకు రూ.6 వేలు, రూ.1.30 లక్షలు కడితే రూ.12 వేలు ఇస్తామని నమ్మించి, గృహిణులను ప్రధానంగా టార్గెట్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఒప్పందం ప్రకారం నెలకు రావాల్సిన రూ.24 వేలు రాకపోవడంతో బాధితులకు అనుమానం వచ్చింది. దీంతో తిరుపతి, పలమనేరు, మదనపల్లె, బి.కొత్తకోట, ములకలచెరువు ప్రాంతాల నుంచి బాధితులు మదనపల్లెలోని కంపెనీ ఆఫీస్ వద్దకు క్యూకట్టారు. ఒక్క తిరుపతి నుంచే 100 మందికి పైగా బాధితులు ఉన్నట్లు తెలుస్తుండగా, జిల్లా వ్యాప్తంగా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మోసపోయినట్లు గ్రహించిన బాధితులు పలమనేరుకు చెందిన ఓంకార్, ములకలచెరువుకు చెందిన రఫీ, హిదయతుల్లా, మదనపల్లెకు చెందిన హరి, గౌసియా, అరుణ, శంకరమ్మ, తులసి, తిరుపతికి చెందిన గణేష్, సుధారాణి, ప్రియాంక, బి.కొత్తకోటకు చెందిన మంజుల, తులసి తదితరులు మదనపల్లె టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన ఎస్‌ఐ నాగేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కంపెనీ చేతిలో మోసపోయిన బాధితులు ఎవరైనా ఉంటే వెంటనే తగిన ఆధారాలతో టూ టౌన్ పోలీసులను సంప్రదించాలని ఎస్‌ఐ సూచించారు.
లక్ష పెట్టుబడికి నెలకు రూ.24 వేల
ఆశ చూపిన నిర్వాహకులు
ఇన్‌స్టా రీల్స్‌తో గృహిణులను బురిడీ కొట్టించి కోట్ల రూపాయల లూటీ
కార్యాలయానికి తాళం వేసి సీఈవో పరార్


