సాక్షి, మదనపల్లె : డీఎస్సీ–2025 నియామక అక్రమాలపై వైఎస్సార్సీపి చేపట్టిన నిరాహార దీక్షలకు మూడో రోజు శనివారం మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే, రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరు కావడంతో ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. జిల్లాలోని తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లె నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, సమన్వయకర్త నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో గురువారం నుంచి నిరాహార దీక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక్కడి నిరాహార దీక్షలకు పెద్దిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డితో కలిసి హాజరయ్యారు. సందర్భంగా దీక్ష శిబిరాల వద్దకు ప్రజలు పోటెత్తారు. తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లు శిబిరం వద్దకు పెద్ద సంఖ్యలో యువతీ యువకులు, విద్యార్థులు, ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. వైఎస్‌ఆర్సీపీ శ్రేణులు, నాయకులతో కలిసి లోకేష్ దిగిపోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏళ్ల తరబడి కష్టపడి చదువుకున్న విద్యార్థులకు ద్రోహం చేశారంటూ మండిపడ్డారు. ఇచ్చిన హామీలు నెరవేర్చని చంద్రబాబు డీఎస్సీ ద్వారా నిరుద్యోగులు మోసపోతే ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అంగళ్లు దీక్షకు భారీ స్థాయిలో స్పందన లభించడంతో పోలీసులు జాతీయ రహదారిపై రాకపోకలను మళ్లించారు. కదిరి, కడప వైపు నుంచి వచ్చే వాహనాలను సీటీఎం రోడ్డుకు మళ్లించారు.
మూడో రోజు..
● అంగళ్లులో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారనాథరెడ్డి, పార్టీ నేతలు, ప్రతినిధులు పాల్గొన్నారు.
● పీలేరులో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మైనార్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఇక్బాల్ అహ్మద్ పాల్గొన్నారు.
● మదనపల్లెలో సమన్వయకర్త నిసార్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి, పరిశీలకులు అనీషా రెడ్డి, జింకా చలపతి పాల్గొన్నారు.
● రాయచోటిలో మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్.రమేష్ కుమార్ రెడ్డి, రామాపురం జెడ్పీటీసీ నాగరాజు, పార్టీ విభాగాల జిల్లా అధ్యక్షులు కిషోర్ దాస్, బేపారి మహమ్మద్ ఖాన్, అంజనప్ప, మున్సిపల్ మాజీ చైర్మన్ ఫయాజ్ భాషా పాల్గొన్నారు.
● పుంగనూరులో మాజీ ఎంపీ రెడ్డప్ప, రాష్ట్ర కార్యదర్శి కొండవీటి నాగభూషణం, పులిచెర్ల మండలం నేతలు విజయ భాస్కర్ రెడ్డి, రెడ్డిశ్వర రెడ్డి పాల్గొన్నారు.
దీక్షలు సక్సెస్
జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో గురు, శుక్ర, శనివారాల్లో డీఎస్సీ అక్రమాలను నిలదీస్తూ, బాధ్యుడైన మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని, సీబీఐతో విచారణ జరపాలన్న డిమాండ్లపై వైఎస్సార్‌సీపీ నిర్వహించిన నిరాహార దీక్షలు విజయవంతం అయ్యాయి. దీక్షా శిబిరాలకు స్థానిక యువత, విద్యార్థులు, డీఎస్సీ అభ్యర్థులు హాజరై తమ మద్దతు తెలపడమేకాక దీక్షల్లో పాల్గొన్నారు. తమకు జరిగిన అన్యాయంపై అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్.జగన్ తమ తరపున ప్రభుత్వాన్ని నిలదీసి, ప్రశ్నించడంతో ప్రభుత్వంలో ఆందోళన మొదలైనట్టు పేర్కొన్నారు. తమకు న్యాయం జరిగేదాక అండగా ఉంటామని వైఎస్సార్‌సీపీ ప్రకటించడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
లోకేష్ దిగిపోవాలని నినాదాలు
తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు దీక్షలకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి హాజరు
జిల్లాలో కొనసాగిన మూడో రోజు దీక్షలు


