● గండి క్షేత్రంలో మొదలైన ఉత్సవ సందడి
● ఏర్పాట్లు చేపట్టిన ఆలయ వర్గాలు
చక్రాయపేట : శ్రావణ మాసం వస్తోంది. ఈమాసం అంటే ఆంజనేయుడికి ఎంతో ప్రీతికరం.అలాగే ఆయన భక్తులకు కూడా ఈ మాసమంటే ఎంతో ఇష్టం. శ్రావణమాసం వచ్చిందంటే ఆంజనేయ స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. ఇక రాయలసీమ జిల్లాల్లోనే ప్రసిద్ధిగాంచిన గండి వీరాంజనేయ స్వామి ఆలయంలో శ్రావణంలో ఉత్సవాలు కన్నులపండువగా సాగుతాయి. ఇక్కడి వీరాంజనేయుడిని స్వయంగా శ్రీరామ చంద్రమూర్తి తన స్వహస్తాలతో చెక్కి ప్రతిష్టించారని ప్రతీతి. దీంతో భక్తులు ఇక్కడి స్వామికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు.
గండి అంటే..
గండిలో ఉన్న కొండలను శేషాచల కొండలు అంటారు. వీటి ఎత్తు రెండు వేల అడుగుల పైమాటే.ఇవి తిరుమల నుంచి గండి వరకు మధ్యలో ఎక్కడేగాని తెగకుండా ఉన్నాయట. అలాంటి ఈ శేషాచల కొండలను పాపాఘ్ని నది మద్యలో గండి పెట్టడంతో ఈ ప్రాంతానికి గండి అని పేరు వచ్చిందని తెలుస్తోంది. ఇక్కడ వెలసిన స్వామిని గండి వీరాంజనేయస్వామి అని పిలుస్తారు.
దర్శనీయ స్థలాలు
గండి క్షేత్రం సమీపంలో పలు దర్శనీయ స్థలాలు ఉన్నాయి. వాటిలో ఉమా మహేశ్వరాలయం, భూమానందాశ్రమం, నామాలగుండు, పావురాళ్ల గుట్ట, ప్రేమానందాశ్రమము, చౌడేశ్వరీదేవి ఆలయం, గవిమల్లేశ్వర స్వామి ఆలయం, కోదండ రామాలయం,వృషభాచలేశ్వర స్వామి(ఎద్దుల కొండ్రాయుడు) ఆలయం, గంగమ్మ దేవత ఆలయం, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి స్మృతివనం ఉన్నాయి. ట్రిపుల్ ఐటీ, నెమళ్లపార్కు,లు దర్శనీయ స్థాలాలుగా ఉన్నాయి.
పెరగనున్న భక్తుల సంఖ్య
ఈ ఏడు శ్రావణ మాసంలో భక్తుల సంఖ్య గణనీయంగా పెరగనుంది. తరతరాలు మురిసి పోయేలా సంస్కృతి వెలిగేలా నూతన ఆలయం నవశోభతో అలరారుతోంది.
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక గండిని టీటీడీలో విలీనం చేయించి ఎంతో అభివృద్ధి చేశారు. అనంతరం వచ్చిన పాలకులు గండిని పట్టించుకోలేదు. తర్వాత ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే గండి ఆలయం అభివృద్ధికి సుమారు రూ.30 కోట్లు మంజూరు చేశారు. దీంతో ఆలయం సర్వాంగ సుందరంగా నిర్మితమైంది. నాలుగేళ్ల తర్వాత నూతన ఆలయంలో మూలవర్లు దర్శనం కలుగుతుండటంతో భక్తులు సంఖ్య పెరుగుతుందని ఆలయ వర్గాలు పేర్కొంటున్నాయి.


