● బాల శాస్త్రవేత్తలకు ఇన్‌స్పైర్ ఆహ్వానం
● నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
మదనపల్లె సిటీ : దేశంలో శాస్త్రవేత్తల కొరత నేపథ్యంలో బాల్యం నుంచే పిల్లల్లో సైన్స్‌పై ఆసక్తిని పెంపొందించి శాస్త్రవేత్తలుగా తీర్చిదద్దాలనే లక్ష్యంతో ఇన్‌స్పైర్ మనక్‌ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. నవీన ఆలోచనలు, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తోంది. సమాజాన్ని ప్రభావితం చేసే ఆవిష్కరణలతో ప్రతిభ చాటిన విద్యార్థులు నేరుగా రాష్ట్రపతి, ప్రధానమంత్రిని కలిసే అవకావం కల్పిస్తోంది.ఇన్‌స్పైర్ మనక్ అవార్డు 2026–27కి సమయం ఆసన్నమైంది. భావి శాస్త్రవేత్తలు తమ చిట్టి మెదళ్లకు పని చెప్పాల్సిన తరుణం వచ్చింది.
రాష్ట్రపతి భవన్‌కు రాజమార్గం
ఇన్‌స్పైర్ మనక్‌లో ప్రతిభ కనబరిచి, సమాజాన్ని ప్రభావితం చేసే అత్యుత్తమ ఆవిష్కరణలు రూపొందించే విద్యార్థులకు రాష్ట్రపతి, ప్రధానమంత్రిని స్వయంగా కలిసి తమ ప్రాజెక్టులను ప్రదర్శించే అరుదైన అవకాశం లభిస్తుంది. అలాగే జాతీయ సాంకేతిక ప్రదర్శనరల్లో పాల్గొనే వెసులుబాటు కూడా దక్కుతుంది.
అర్హులు వీరే
10–17 ఏళ్ల మధ్య వయసు కలిగి ప్రస్తుతం 6 నుంచి 10వ తరగతి చదువుతున్న ప్రభుత్వ, ప్రైవేట్, గురుకుల, ఏపీ మోడల్ స్కూళ్లు, కేజీబీవీల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి పాఠశాల నుంచి గైడ్‌టీచర్‌తో కలిసి విద్యార్థులు పాల్గొనే అవకాశం ఉంటుంది.
దరఖాస్తు ఇలా..
ఔత్సాహిక విద్యార్థులు తమ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడి సహాయంతో www. inrpireawaardrd& rt. gov. in వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి. పాఠశాలకు సంబంధించిన వివరాలు నమోదు చేసి సేవ్ చేయాలి. ఆ దరఖాస్తు జిల్లా ఆథారిటీకి వెళుతుంది. అక్కడ ఆమోదం తర్వాత విద్యార్థి మెయిల్‌కు యూజర్ ఐడీతో కూడిన లింక్ వస్తుంది. విద్యార్థి సమాచారంతో పాటు బ్యాంకు ఖాతా, ఆధార్ నంబర్ నమోదు చేయాలి. విద్యార్థి ప్రదర్శించాలని అనుకుంటున్న ప్రాజెక్టు వివరాలను సంక్షిప్తంగా వెబ్‌సైట్‌లో నమోదు చేస్తే దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. ఆన్‌లైన్‌లోదరఖాస్తులు సమర్పించేందుకు సెప్టెంబర్ 15వతేదీ వరకు గడువుఉంది. 2023–24లో 294 మంది విద్యార్థుల నుంచి 20 మంది, 2024–25 సంవత్సరానికి 238 మంది పోటీపడగా 19 మంది రాష్ట్ర స్థాయి ఇన్‌స్పైర్ మనాక్‌కు ఎంపికయ్యారు.
ప్రోత్సాహకాలు
విద్యార్థులు ఆన్‌లైన్‌లో పంపించే ప్రాజెక్టుల వివరాలు డిపార్టుమెంట్ ఆఫ్ సైన్సు,టెక్నాలజీ, కేంద్ర మంతిత్వశాఖ ప్రతినిధులు పరిశీలిస్తారు.
ఎంపికై న ప్రాజెక్టు ప్రయోగం కోసం విద్యార్థి ఖాతాలో రూ.10వేలు జమ చేస్తారు.రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపికై తే రూ.25 వేలు, జాతీయ స్థాయికి వెళితే రూ.40వేల నుంచి 60 వేల వరకు అందజేస్తారు. జాతీయ స్థాయిలో ప్రతిభావంతులకు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు ప్రదానం చేస్తారు.నవీన ఆవిష్కరణపై పేటెంట్‌తో పాటు ఐఐటీ, ఎయిమ్స్ వంటి ప్రవేశాల్లో రిజర్వేషన్ కల్పిస్తారు.
ప్రతి పాఠశాల నుంచి నామినేషన్ తప్పనిసరి
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇన్‌స్పైర్ మనక్ ఒక అద్భుతమైన వేదిక. ప్రతి ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు నమోదుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో సైతం అద్భుతమైన ఆలోచనలు ఉంటాయి. వాటిని గుర్తించి ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయించాలి. జిల్లాను రాష్ట్రంలోనే ముందంజలో నిలిపేలా పని చేయాలి. డాక్టర్ సుబ్రమణ్యం, డిఈఓ


