ఎద్దుల గంటలు మోగాల్సిన చేలల్లో.. మౌనం ఆవహించింది... పచ్చగా నవ్వాల్సిన పొలాల్లో.. దుఃఖం రాజ్యమేలుతోంది.. చినుకు రాలుతుందేమోనని ఆశగా చూసిన నేల కల చెదిరింది.. కరి మబ్బులు జడిపట్టి కురుస్తాయేమోనని.. నింగికేసి చూసిన రైతు గుండె నిలువునా కరిగింది.. ‘ఎల్‌నినో’ పడ | - | Sakshi
Sakshi News home page

ఎద్దుల గంటలు మోగాల్సిన చేలల్లో.. మౌనం ఆవహించింది... పచ్చగా నవ్వాల్సిన పొలాల్లో.. దుఃఖం రాజ్యమేలుతోంది.. చినుకు రాలుతుందేమోనని ఆశగా చూసిన నేల కల చెదిరింది.. కరి మబ్బులు జడిపట్టి కురుస్తాయేమోనని.. నింగికేసి చూసిన రైతు గుండె నిలువునా కరిగింది.. ‘ఎల్‌నినో’ పడ

Aug 2 2026 1:04 AM | Updated on Aug 2 2026 1:04 AM

నీడలా వెంటాడుతున్న ఎల్‌ నినో వర్షాలు ఎప్పుడు కురుస్తాయో తెలియని పరిస్థితి జిల్లాలో ఖరీఫ్‌ సాగు విస్తీర్ణం 8.28 శాతమే

సాక్షి, మదనపల్లె: అన్నమయ్య జిల్లాపై కరువు మేఘాలు ముంచుకొస్తున్నాయి. గతంలో ఎన్నడూలేని దుర్భర పరిస్థితులు ఎల్‌నినో రూపంలో వెంటాడుతున్నాయి. మేలో ఓ మోస్తారు వర్షాలు కురవగా జూన్‌లో సగం, జూలైలో సగటు పూర్తి వర్షపాత లోటు నమోదైంది. దీని ఫలితంగా జిల్లా అంతటా పంటలతో పచ్చగా కళకళలాడాల్సిన పొలాలను బీళ్లుగా మార్చాయి. కరువుకు నిదర్శనంగా పోలాలు బీళ్లతో, పెట్టిన పంటలు ఎండుతూ రైతు కళ్లలో దైన్యం కనిపిస్తోంది. వర్షాధార పంటపై ఆధారపడిన జిల్లా కావడంతో భవిష్యత్తు పరిస్థితులు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఖరీఫ్‌లో జిల్లాలో 46,055 హెక్టార్లలో పంటలు సాగు కావాల్సి ఉండగా..జూలై 30 నాటికి కేవలం 8.28 శాతం విస్తీర్ణంలో 3,814 హెక్టార్లకే పరిమితమైంది. 42,241 హెక్టార్లు బీళ్లుగా మిగిలాయి. సాగైనా పంటల్లో పెద్దమండ్యం మండలం 380 హెక్టార్ల విస్తీర్ణంతో మొదటి స్థానంలో ఉంది. జిల్లాలో అత్యధికంగా బి.కొత్తకోటలో 316, గాలివీడులో 284, కేవీ పల్లిలో 459, లక్కిరెడ్డిపల్లెలో 126, పెద్దతిప్పసముద్రంలో 201, పీలేరులో 371, రామసముద్రంలో 208 హెక్టార్లు పంటలు సాగయ్యాయి. వందలోపు హెక్టార్లలో 10 మండలాల్లో సాగయ్యాయి. అతి తక్కువగా గుర్రంకొండ లో 12, చిన్నమండ్యంలో 26, రాయచోటిలో 43 హెక్టార్లలో పంటలు సాగు చేశారు.

● ఇంకా విత్తనం ప్రారంభం కాని పంటలు (సున్నా శాతం) బాజ్రా, కొర్ర, సామలు, మినుము, పత్తి, ఆవాలు, నువ్వులు, సోయాబీన్‌, పొగాకు, ఇతర చిరుధాన్యాలు.

● జిల్లా ఆర్థిక వ్యవస్థకు కీలకమైన వేరుశనగ, వరి రెండూ 10 శాతం లోపే ఉన్నాయి.

48 రోజులు చినుకు లేదు

జూలైలో 90.5 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం కురవాల్సి ఉండగా ఒక్క మిల్లీమీటర్‌ వర్షం కూడా కురవలేదు. జూన్‌లో 35 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం నమోదైంది. జూన్‌ 14వ తేదీ నుంచి జూలై 31 వరకు వర్షం మాటే లేదు. ఇక ఖరీఫ్‌లో పంటలసాగు పూర్తిగా పడకేసినట్టే. ఆగస్టులో కూడా వర్షాలు కురిసే అవకాశాలపై వ్యవసాయశాఖ స్పష్టంగా చెప్పలేకపోతోంది. దీంతో జిల్లాలో వ్యవసాయం పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే విత్తన పంటలు చేతికొస్తాయన్న ఆశ ఏమాత్రం లేదు. పెట్టిన పంటలు, పెట్టుబడి పూర్తిగా కోల్పోవాల్సిన పరిస్థితులు కళ్లముందు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

పంట సాగు వివరాలు ఇలా...

పంట రకం సాగు (హెక్టార్లలో)

వరి 737

మొక్కజొన్న 313

రాగి 118

కంది 126

వేరుశనగ 2317

పశుగ్రాసం 96

అనుములు 67

జిల్లా సాగుభూమి స్థితి

సాధారణం విస్తీర్ణం: 46,055 హెక్టార్లు

విత్తినది : 3,814 హెక్టార్లు

ఇంకా 91.72 శాతం భూమి మిగిలి ఉంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement