డీఎస్సీ అక్రమాలను నిగ్గు తేల్చాల్సిందే ! | - | Sakshi
Sakshi News home page

డీఎస్సీ అక్రమాలను నిగ్గు తేల్చాల్సిందే !

Aug 1 2026 1:43 AM | Updated on Aug 1 2026 1:43 AM

సీబీఐతో విచారణ జరపాలి

మాజీ మంత్రి, ఎమ్మెల్యే

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

సాక్షి, మదనపల్లె: అవినీతి, అక్రమాలు, నిరుద్యోగ అభ్యర్థులకు జరిగిన అన్యాయంపై నిజాలు నిగ్గు తేల్చేందుకు డీఎస్సీ–2026పై విచారణకు ఆదేశించాల్సిందేనని మాజీమంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ పిలుపుమేరకు శుక్రవారం డీఎస్సీ అక్రమాలపై జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌ రెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మదనపల్లె సమన్వయకర్త నిసార్‌ అహ్మద్‌లతో కలిసి కలెక్టరేట్‌ వచ్చారు. జాయింట్‌ కలెక్టర్‌ శివ్‌ నారాయణ్‌ శర్మకు డీఎస్పీ అక్రమాలపై తీసుకోవాల్సిన చర్యలపై వినతిపత్రం అందజేశారు. తర్వాత ఆయనతో సమావేశమై డీఎస్సీ అక్రమాలు, వాటిపై జరగాల్సిన విచారణకు సంబంధించి వివరించారు. ఈ విషయమై చర్యలు తీసుకోవాలని కోరగా, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని జాయింట్‌ కలెక్టర్‌ వారికి వివరించారు. అనంతరం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో పలు విషయాలపై మాట్లాడారు.

వాళ్లు పరీక్ష రాశారా లేదా

16 వేల పోస్టులతో నిర్వహించిన డీఎస్సీలో క్రీడా విభాగం కోటా కింద 450 మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నారు, వీరు పరీక్షలు రాశారా, ఎలా ఎంపిక అయ్యారు అన్నది తెలియడం లేదు. ఈ విషయమై తమపార్టీ తరపున పోరాటాలు చేస్తుంటే ప్రభుత్వం అక్రమాలను కప్పిపుచ్చేందుకే ప్రయత్నిస్తోంది. సీబీఐ ద్వారా విచారణ జరిపి అక్రమాలను నిగ్గు తేల్చాలని కోరుతుంటే తప్పించుకుంటోందని అన్నారు. గత ప్రభుత్వంలో జగనన్న 1.25 లక్షల మంది యువతకు సచివాలయ ఉద్యోగాలు ఇస్తే ఒక చిన్న తప్పిదం లేకుండా పరీక్షల నిర్వహణ, నియామక ప్రక్రియ సాజావుగా సాగిందన్నారు. ఇప్పుడు కేవలం 16 వేల పోస్టులను పారదర్శకంగా భర్తీ చేయలేకపోయారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు.

ఇంగ్లీషు విద్య దూరం చేశారు

జగనన్న పాలనలో ప్రతి పేద విద్యార్థి ఇంగ్లీషు మీడియం చదివి ఉన్నత స్థానాలకు చేరాలని ఉన్నత ఆశయంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రారంభిస్తే కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులపై కక్షతో వేధిస్తోందని అన్నారు. తమ బిడ్డలు తప్ప పేదలు ఇంగ్లీషు విద్య చదవకూడదని పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ఎత్తివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంగ్ల విద్య మీ బిడ్డలు చదివితే చాలని అనుకున్నారా అని కూటమి పాలకులను ఆయన ప్రశ్నించారు.

వైద్యం ప్రైవేట్‌ పరం చేస్తారా

దేశంలో, ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగనన్న ఏకకాలంలో 17 మెడికల్‌ కళాశాలను మంజూరు చేశారు. వీటి ద్వారా నిరుపేదలకు ఉచితంగా కార్పొరేట్‌ వైద్యం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలలపై కాలకూట విషం కక్కుతోంది. వాటిని ప్రైవేట్‌ పరం చేయాలని నిరంతరం ప్రయత్నిస్తోంది. పేదల కోసం వైఎస్సార్‌సీపీ అడ్డుకుంటున్నప్పటికీ చంద్రబాబు ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఆపడం లేదని అన్నారు. వీటి అసంపూర్తి పనులను తక్షణమే పూర్తి చేసి కళాశాలలను ప్రారంభించాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.

50 వేల ఉద్యోగాలు ఊడాయి

జగనన్న పాలనలో ఎంఎస్‌ఎంఈలకు మహర్దశ కల్పించారు. వాటికి ప్రోత్సాహకాలు అందించారు. కూటమి ప్రభుత్వం రాకతో రాష్ట్రంలో 2,400 ఎంఎస్‌ఎంఈలు మూతపడ్డాయి. దీని ఫలితంగా 50 వేల మంది ఉద్యోగాలు కోల్పోయి వీధిన పడ్డారు. వారి జీవన భృతి కోల్పోయేలా చంద్రబాబు సర్కార్‌ పని చేసిందని విమర్శించారు. నిరుద్యోగులు, యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల్లో చెప్పిన చంద్రబాబు ఇప్పుడు 16 వేల అక్రమ నియామకాల డీఎస్సీ పోస్టులు ఇచ్చారని విమర్శించారు. కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రశ్నిస్తే పోలీసు పాలన

ప్రభుత్వ పనితీరు, అవినీతి అక్రమాలను ఎవరు ప్రశ్నించిన పోలీసు పాలన రుచి చూపిస్తున్నారని ఆయన అన్నారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. ఇది ప్రభుత్వ పాలనగా లేదని పోలీసుల ద్వారా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఫలితంగా రాష్ట్రంలో కష్టతరమైన పరిస్థితులు నెలకొంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు అనీషారెడ్డి, జింకా వెంకటా చలపతి, బాబ్జాన్‌, ఉదయకుమార్‌, సీనియర్‌ నాయకులు శ్రీనాథ్‌రెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ మనూజ, మాజీ వైస్‌ చైర్మన్‌ బిఏ.నూర్‌ ఆజం, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు శివప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిద్దింటి కిశోర్‌, సంయుక్త కార్యదర్శి కిశోర్‌కుమార్‌రెడ్డి, మస్తాన్‌ఖాన్‌, హేమంత్‌, నాగరాజరెడ్డి, ఎస్‌ఏ.కరీముల్లా, మంజుల, శారదరెడ్డి, సుగుణ, కాలువపల్లె మధుసూదనరెడ్డి, ఇర్ఫాన్‌, శ్రీనివాసులు, ప్రసాద్‌, ఖాజా, ధనలక్ష్మి, నాగమణీ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement