● భక్తుల మనోభావాలు
చంద్రబాబుకు పట్టడం లేదు
● ఖనిజదోపిడీ కోసం విధ్వంసం సృష్టిస్తారా
● ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి
సాక్షి, మదనపల్లె/ తంబళ్లపల్లె: ఖనిజ సంపద దోపిడీ కోసం చంద్రబాబు సర్కార్ మల్లయ్యకొండల్లో చేపట్టిన మైనింగ్ నుంచి కొండలను రక్షించుకుందామని తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి భక్తులు, ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం ఆయన పెద్దమండ్యం సింగిల్ విండో మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ నేత కడప సుధాహరరెడ్డి, తంబళ్లపల్లె నియోజకవర్గానికి చెందిన భక్తులు, ప్రజలతో కలిసి సాధుకొండ అధిరోహణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తంబళ్లపల్లె మండలం బోరెడ్డివారికోట వద్ద ప్రారంభించి భక్తులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. అనంతరం భక్తులు అధిరోహణ కార్యక్రమం నిర్వహించారు. మల్లయ్యకొండల్లో ఖనిజ దోపిడీ కోసం పవిత్ర కొండల్లో విధ్వంసం సృష్టించేందుకు చంద్రబాబు మైనింగ్ అనుమతులు ఇచ్చారని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి అన్నారు. ప్రకృతి అందాలకు, పురాతన ఆలయాలతో ఆధ్యాత్మిక నిలయమైన కొండలను అందరం ఏకమై కాపాడుకుందామని అన్నారు. భక్తుల అభిప్రాయాలు, వారి మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా చంద్రబాబు ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేశారని విమర్శించారు. జగనన్న పాలనలో మల్లయ్య కొండ ఎంత అభివృద్ధి జరిగిందో భక్తులు కల్లారా చూస్తున్నారని అన్నారు. జగనన్న పాలనలో మైనింగ్ అన్నమాట లేకుండా భక్తుల మనోభావాలకు పెద్దపీట వేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం దోపిడీ కోసం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కార్ జారీ చేసిన మూడు మైనింగ్ ఉత్తర్వులను రద్దుచేసి, భవిష్యత్తులో మైనింగ్ ప్రస్తావన లేకుండా మల్లయ్య కొండలను నో మైనింగ్ జోన్ ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ చర్య ద్వారా చంద్రబాబు తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు.
పర్యావరణ విధ్వంసమే
మైనింగ్ తో చంద్రబాబు పర్యావరణ విధ్వంసానికి సిద్ధమయ్యారని సింగిల్ విండో మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ నేత కడప సుధాహరరెడ్డి విమర్శించారు. మైనింగ్ వల్ల గ్రామాలు ఖాళీ అవుతాయని, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, వ్యవసాయం నాశనమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి విధ్వంసం సృష్టించే మైనింగ్ చర్యలను అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రభుత్వం జారీ చేసిన మూడు జీవోలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
అఖండ జ్యోతి వెలిగించి.. డమరుకం మోగిస్తూ
సాధుకొండపైకి చేరుకున్న భక్తులు శనివారం రాత్రి అక్కడే బస చేశారు. ఈ సందర్భంగా సాధు మల్లేశ్వరస్వామి ఆలయం ఎదుట ఉన్న ధ్వజస్తంభంపై అఖండ జ్యోతిని వెలిగించారు. ఆలయం ఎదుట ధూపం వేసి హర హర మహాదేవ శంభో శంకర అని భక్తి పరవశంతో ఉచ్చరిస్తూ, డమరుకం మోగించారు. దేవుడా మైనింగ్ విధ్వంసం నుంచి నీ కొండలను నీవే కాపాడుకో అంటూ వేడుకున్నారు. వర్షాభావంతో ప్రజలు, రైతులు అల్లాడిపోతున్నారు నీ కృపతో పుష్కలంగా వర్షాలు కురిపించు అంటూ ప్రార్థించారు.
బండరాళ్లపైనే నిద్ర
తంబళ్లపల్లె, పెద్దమండ్యం మండలాల నుంచి సాధుకొండపైకి చేరిన భక్తులు శనివారం రాత్రి చిమ్మ చీకట్లో, బండరాళ్లపైనే సేద తీరుతూ నిద్రించారు. నీళ్లు, భోజనం భక్తులకు వడ్డించారు. పురాతన మహిమాన్విత సాధుమల్లేశ్వర స్వామి సన్నిధిలో భక్తులు మైనింగ్ వద్దంటూ పూజలు చేశారు. వీరితోపాటు 84 ఏళ్ల వయసులో చలాకీగా కొండెక్కిన సింగిల్ విండో మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ నేత కడప సుధాహర రెడ్డి కోసం కొండపై భక్తులు ప్రత్యేకంగా టెంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో దేవరింటి రామకృష్ణారెడ్డి (పెదబాబు), దేవరింటి రవిశంకర్‌రెడ్డి (చినబాబు), కోటిరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, కిశోర్‌కుమార్‌రెడ్డి, చౌడేశ్వర, చంద్రశేఖర్, కరీముల్లా, పద్మనాభరెడ్డి, చంద్రశే ఖర్, మల్లికార్జున, వేమారెడ్డి, రామశంకర్‌రెడ్డి, సురేంద్రనాధ్, రవిచంద్రారెడ్డి, కాలువపల్లె మధుసూదనరెడ్డి, రామ్మూర్తి, ప్రభాకర్‌రెడ్డి, గొర్ల మల్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, భద్ర, రఘ, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.
భక్తులతో కలిసి పాదయాత్ర చేస్తున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డి, సాధుకొండపైకి వెళ్తున్న భక్తులు


