కేవీపల్లె : కలుషిత నీరు తాగి నలుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంఘటన మండలంలోని చిన్నకమ్మపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. శనివారం చిన్నకమ్మపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఓ బాటిల్‌లోని నీరు తాగిన పదో తరగతికి చెందిన నలుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న హెచ్‌ఎం రహంతుల్లా సమాచారాన్ని విద్యార్థినుల తల్లిదండ్రులకు తెలియజేశారు. నలుగురు విద్యార్థినులను చికిత్స నిమిత్తం మహల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. చికిత్స అనంతరం కోలుకోవడంతో తిరిగి చిన్నకమ్మపల్లెకు చేరుకున్నారు. విద్యార్థినులు పెనుప్రమాదం నుంచి బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న ఎంఈవో రెడ్డిబాషా హుటాహుటిన మహల్ పీహెచ్‌సీకి చేరుకుని విద్యార్థినుల పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం పాఠశాలలో విచారణ జరిపారు. కొందరు విద్యార్థులు ఓ వాటర్ బాటిల్‌లో ఉద్దేశపూర్వకంగా ఏదో కలిపినట్లు ప్రాథమికంగా తెలిసిందని ఎంఈవో తెలిపారు. జరిగిన సంఘటనపై డీఈవోకు నివేదిక సమర్పించినట్లు చెప్పారు.


