మదనవల్లె టౌన్ : మదనపల్లె మండలంలో నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలు సృష్టించి, తక్కువ ధరకే రూ. 5 కోట్ల భూమి విక్రయం పేరుతో రూ.14 లక్షలకు టోకరా వేసిన ఐదుగురిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. ఈ కేసులో అరెస్టయిన నిందితుల వివరాలను ఎస్పీ శనివారం పోలీస్ ప్రధాన కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. మదనవల్లె మండలం బసినికొండ పంచాయతీ, డ్రైవర్ కాలనీకి చెందిన పొన్నంరెడ్డి శోభారాణి, ఆమె భర్త వుల్లారెడ్డికి గంగన్నగారిపల్లె వరిధిలో 2.52 ఎకరాల వ్యవసాయ భూమి తమదేనని, తక్కువ ధరకే విక్రయిస్తామని మొలకదిన్నెకు చెందిన ఉప్పుతోళ్ల శేఖర్ బాబు, గంగన్నగారివల్లెకు చెందిన గడియారం మురళి, ఎర్రప్ప, మణి, రెడ్డెప్ప నమ్మబలికారన్నారు. ఈ కేసులో బాధితులు 2025 సెప్టెంబర్ 1న రూ.13 లక్షలు శేఖర్‌కు చెల్లించి మదనవల్లె సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో విక్రయ ఒప్పందం చేసుకున్నారు. అనంతరం పట్టాదారు పాసు పుస్తకాలు ఇప్పిస్తామని మరో రూ.లక్ష తీసుకున్న నిందితులు తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలను బాధితులకు అందజేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత అవి నకిలీవని తేలడంతో బాధితులు శేఖర్‌ను నిలదీయగా, ఆ భూమిని అప్పటికే ఇతరులకు విక్రయించినట్లు నిందితులు అంగీకరించి, రూ.13 లక్షలను తిరిగి చెల్లిస్తామని 2026 ఏప్రిల్ 10న ఒప్పంద వత్రం రాసిచ్చినా ఇప్పటి వరకు డబ్బు తిరిగి ఇవ్వలేదన్నారు. బాధితురాలు శోభారాణి తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు నకిలీ వత్రాలు సృష్టించి మొత్తం రూ.14 లక్షలు మోసం చేసిన కేసులో ఐదుగురిపై తాలూకా సిఐ కళా వెంకటరమణ కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించి ప్రజలను మోసం చేస్తుంటే నేరుగా తమను సంప్రదించాలని ఎస్పీ సూచించారు. నకిలీ సీళ్లను సంబంధిత అధికారుల అనుమతి లేకుండా ఎవరైనా తయారు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో రిజినల్ ఎస్పీ వెంకటాద్రి, డి.ఎస్.పి బుచ్చిరాజు, సీఐ, సిబ్బంది పాల్గొన్నారు.
తక్కువ ధరకే రూ.5 కోట్ల భూమంటూ రూ.14 లక్షలకు టోకరా


