కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు | - | Sakshi
Sakshi News home page

కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు

Apr 11 2026 8:34 AM | Updated on Apr 11 2026 8:34 AM

కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు

బాలిక దారుణ హత్య

నిందితుడికి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం : ఎస్పీ

ఖాజీపేట: మైనర్‌ బాలిక హత్యతో జిల్లా ఉలిక్కి పడింది. ఖాజీపేట చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి సంఘటన జరగలేదు. శుక్రవారం అగ్రహారం గ్రామంలోని మైనర్‌ బాలిక ఇంటిలోకి ఆంజనేయకొట్టాలుకు చెందిన వ్యక్తి వెళ్లి పట్టపగలు హత్య చేయడం సంచలనంగా మారింది. వివరాలు.. ఖాజీపేట మేజర్‌ పంచాయతీలోని అగ్రహారం గ్రామంలో ఇళ్లూరు శ్రీనివాసులు, నాగమణిలకు ముగ్గురు సంతానం. అందులో రెండో సంతానం రామకీర్తన(16) ఖాజీపేటలోని మోడల్‌ స్కూల్‌లో చదువుతూ ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసింది. బాలికను ఆంజనేయకొట్టాలు గ్రామానికి చెందిన ఆవుల వెంకటేష్‌ (19) రెండు సంవత్సరాల నుంచి ప్రేమ పేరుతో వేధించే వాడు. మీ కూతురు ఇతరులతో ఫోన్‌లో మాట్లాడుతోందంటూ తండ్రికి పలుమార్లు ఫిర్యాదు చేశాడు. ‘మా కూతురు సంగతి మేం చూసుకుంటాం.. నీవు జోక్యం చేసుకోవద్ద’ని పలుమార్లు బాలిక తండ్రి శ్రీనివాసులు నిందితునికి వార్నింగ్‌ కూడా ఇచ్చాడు. ఈనెల 10వ తేదీ ఉదయం వెంకటేష్‌ బాలికతో ఫోన్‌లో మాట్లాడే ప్రయత్నం చేశాడు. అయితే అందుకు స్పందించక పోవడంతో ఆవేశంతో ఇంటికి వెళ్లి కొడవలితో గొంతు కోసి హత్య చేసి పరారయ్యాడు.

రక్తపు మడుగులో కూతురును

చూసి చలించిన తండ్రి

మైదుకూరుకు వెళ్లిన బాలిక తండ్రి, సోదరుడు 11 గంటలకు ఇంటికి చేరుకున్నారు. రెండవ గదిలో రక్తపు మడుగులో ఉన్న కూతురుని చూసి తండ్రి చలించిపోయాడు. అప్పటికీ కుమార్తె మాట్లాడుతుండటంతో కాపాడుకునేందుకు ప్రయత్నం చేశాడు. గొంతు నుంచి రక్తస్రావం జరగకుండా టవల్‌ను చుట్టి కూతురిని చేతుల్లో ఎత్తుకుని చికిత్స నిమిత్తం ఆటోలో కడపకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇంతలో హైవేపైకి రాగానే 108 వాహనం రావడంతో అందులో కడప రిమ్స్‌కు తీసుకెళ్లారు. అప్పటికే బాలిక మృతి చెందడంతో తండ్రి, అన్న బోరున విలపించారు. హత్యోదంతంలో ఒక్కడే ఉన్నట్లు అధికారులతోపాటు అందరూ భావించారు. అయితే బాలిక తండ్రి శ్రీనివాసులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆవుల వెంకటేష్‌ తోపాటు తన కూతురు మరొకరి పేరు తనకు చెప్పిందని పేర్కొన్నాడు. అతను ఎవరూ అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. అయితే ఆ వ్యక్తి ఎవరో తమకు తెలియదని బాలిక తల్లిదండ్రులు అంటున్నారు. తమ కూతురు చెప్పిందని, అందుకే ఫిర్యాదులో చేర్చినట్లు పోలీసులకు చెప్పారు. బాలికకు న్యాయం జరగాలని కోరుతూ గ్రామస్తులు ధర్నా చేశారు. హంతకుడికి ఉరిశిక్ష పడేలా చేయాలని డిమాండ్‌ చేశారు. మూడు గంటల పాటు వాహనాలు నిలిచిపోయాయి.

ఫిర్యాదు స్వీకరించడంలో ఆలస్యం

ఫిర్యాదు స్వీకరించడంలో పోలీసులు తీవ్ర జాప్యం చేశారు. పోస్టుమార్టం జరిగే ప్రదేశానికి బాలిక తండ్రితోపాటు పలువురు బంధువులు వెళ్లారు. వారితో ఫిర్యాదు తీసుకుని ఉంటే సరిపోయేది. కానీ అలా చేయక పోవడంతో ఫిర్యాదు సాయంత్రం తీసుకోవాల్సి వచ్చింది. దీంతో బాలిక మృతదేహానికి పోస్టుమార్టం శనివారం జరగనుంది.

మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి

ఖాజీపేట: కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది.. కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్‌ హత్యాంధ్రప్రదేశ్‌గా మారిందని మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పేర్కొన్నారు. అగ్రహారంలో మైనర్‌ బాలిక హత్యను తీవ్రంగా ఖండించారు. మదనపల్లె హత్య మరువక ముందే ఖాజీపేటలో బాలిక హత్యకు గురి కావడం తీవ్రంగా కలచి వేందన్నారు. హత్యకు కారకుడై ఆవుల వెంకటేషకు కఠిన శిక్ష పడేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. అప్పుడే బాధిత కుంటుంబాలకు న్యాయం జరుగుతుందన్నారు. కూటమి ప్రభత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కడ చూసినా గంజాయి, మధ్యం ఏరులై పారుతోందని అన్నారు. మహిళ హోంమంత్రిగా ఉన్నా మహిళలపైనే హత్యలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని సూటిగా ప్రశ్నంచారు.

ప్రేమోన్మాదం వెర్రితలలు వేసి యమపాశమవుతోంది. తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశల గొంతు కోస్తోంది. ఇష్టం లేకున్నా వెంటపడి ఉసురు తీస్తోంది. ఆడబిడ్డ కాలు బయటపెడితే తిరిగి వచ్చే వరకు ఆ అమ్మానాన్నలు గుండెలు గుప్పిట్లో పెట్టుకుని ఎదురుచూడాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం ఖాజీపేటలో ఓ యువకుడు అత్యంత పాశవికంగా ఓ యువతిని కొడవలితో గొంతు కోసిన ఘటనతో జిల్లా ఉలిక్కిపడింది.

ఘాతుకానికి పాల్పడిన యువకుడు

ఉలిక్కిపడిన జిల్లా

వెల్లువెత్తిన నిరసన

కడప అర్బన్‌: ఖాజీపేట మండలంలోని అగ్రహారం గ్రామంలో బాలికను హత్య చేసిన నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని కీర్తన తల్లిదండ్రులకు జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ భరోసా ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం కడపలో బాలిక తల్లిదండ్రులు ఎస్పీ కలిశారు. తమకు న్యాయం చేయాలని విన్నవించారు. ఈ సందర్భంగా ఎస్పీ, బాలిక తల్లిదండ్రులను ఓదార్చారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement