● నీరు పుష్కలంగా ఉన్నా ఉపయోగం సున్నా
● శుభ్రం చేయని కాలువలు
● లబోదిబోమంటున్న స్థానికులు
ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేస్తున్న స్థానికులు
వాల్మీకిపురం : తాగునీరు సక్రమంగా సరఫరా కాకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నట్లు పట్టణంలోని కోనేటివీధి, కొత్త ఇందిరమ్మ కాలనీకి చెందిన మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు బాగా కురిసి చెరువులు, వాగులు, వంకల్లో నీరు పుష్కలంగా ఉన్నా.. బోర్లలో నీరు ఉన్నా గ్రామస్తులకు అందించడంలో అధికార యంత్రాంగం విఫలమైందని స్థానికులు మండిపడుతున్నారు. అధికారులకు మొరపెట్టుకున్నా ఉపయోగం లేదని, తాగునీరు అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలువలు శుభ్రం చేయడం లేదని, దోమలు పెరిగి ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. దీంతో శుక్రవారం స్థానికులు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. కోనేటివీధిలో నెల రోజులుగా నీరు సరఫరా కావడం లేదని, కొత్త ఇందిరమ్మ కాలనీలో వారానికి ఒక రోజు నీరు వస్తున్నట్లు వారు తెలిపారు. పన్నులు వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ తాగునీరు సరఫరా చేయడంలో చూపకపోవడం దారుణమన్నారు. కొన్ని చోట్ల పైప్‌లైన్ దెబ్బతినడం, బోర్లకు మోటార్లు లేకపోవడం తదితర కారణాలతో నీరు సరఫరా చేయడం లేదని ఆరోపించారు. ఇప్పటికై నా అధికారులు చర్యలు తీసుకొని, తాగునీటి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు కదీరున్నిసా, మాబుజాన్, క్రిష్ణవేణమ్మ, మస్తాన్‌బి, నూర్‌జహాన్, హస్మత్, శబమ్, అనసూయమ్మ, ఫర్తాజ్, ఈశ్వరమ్మ, సిరాజున్నిసా, తదితరులు పాల్గొన్నారు.
కొత్త ఇందిరమ్మ కాలనీలో శుభ్రం చేయని కాలువ
పట్టణంలో కాలువలు శుభ్రం చేయడం లేదు. దీంతో రోడ్లపై మురుగునీరు ప్రవహిస్తున్నాయి. దీంతో దోమలు పెరుగుతున్నాయి. రాత్రి సమయాల్లో నిద్రపట్టడం లేదు. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. చెత్త సేకరణ కూడా చేయడం లేదు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి. – రవిశంకర్, కోనేటివీధి, వాల్మీకిపురం
గత నెల రోజులుగా తాగు నీరు వదలడం లేదు. దీంతో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. మహిళలకు ఇబ్బంది లేకుండా తాగునీరు ఇప్పించండి. ఎండలు ఎక్కువ అవుతున్నాయి. తాగు నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలి.
– మస్తాన్ బీ, కోనేటివీధి, వాల్మీకిపురం


