ఆటవిక రాజ్యం...
ప్రక్షాళనపై ప్రత్యేక శ్రద్ధ ఏదీ...
సాక్షి ప్రతినిధి, కడప: సీఎం చంద్రబాబు ప్రభుత్వంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. క్రమం తప్పకుండా హత్యలు, అత్యాచారాలు తెరపైకి వస్తున్నాయి. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో బాలికను అత్యాచారం ఆపై హత్య ఉదంతం మరుకముందే.. పుంగనూరులో ముస్లిం కుటుంబానికి చెందిన మరో బాలికను హత్య చేసి చెరువులో పడేశారు. ఆపై మదనపల్లెలో స్వర్ణకుమారి అనే మహిళ హత్యోదంతం తెరపైకి వచ్చింది. అంతలోనే బద్వేల్‌లో ప్రేమ పేరుతో మైనర్ బాలిక (విద్యార్థిని) భయానక హత్య వెలుగు చూసింది. పర్యాటక ప్రాంతమైన గండికోటలో గత ఏడాది జూలై 14న మరో మైనర్ బాలిక హత్య చోటుచేసుకుంది. తర్వాత మదనపల్లె సమీపంలోని నీరుగట్టువారిపల్లెకు చెందిన ఏడేళ్ల చిన్నారి హత్యోదంతం ఫిబ్రవరి16న చోటుచేసుకుంది. తాజాగా ఖాజీపేట అగ్రహారంలో మైనర్ బాలికను ఉన్మాది గొంతు కోసి హత్య చేశారు. సీఎం చంద్రబాబు బడాయి పాలనలో యువతులు, మహిళలు సమిధలవుతున్నారు.
● ఖాజీపేటలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఓ మైనర్ బాలిక హత్య శుక్రవారం వెలుగు చూసింది. గ్రామస్తులు నిందితున్ని అప్పగించాలంటూ బాధిత కుటుంబం పక్షాన ఖాజీపేట వద్ద జాతీయ రహాదారిపై బైఠాయించారు. నిరాటకంగా ఆందోళన కొనసాగించారు. పోలీసు అధికారుల విన్నపంతో శాంతించారు. రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు మహిళలకు రక్షణ మృగ్యమవుతోంది. వేధింపులు తట్టుకోలేక నలుగురు ఆత్మహత్యలు చేసుకున్నట్లు క్రైమ్ రికార్డు వెల్లడిస్తోంది. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో మైనర్ బాలిక అత్యాచారం, హత్య, పుంగనూరులో ముస్లిం బాలిక హత్య, పీఠాపురంలో యువతిపై అత్యాచారం, హిందూపురంలో అత్తా, కోడళ్లుపై సామూహిక అత్యాచారం ఇలా వరస ఘటనలు తెరపైకి వస్తున్న ప్రభుత్వంలో సత్వర చర్యలు లోపించడంతోనే క్రమం తప్పకుండా ఘటనలు ఉత్పన్నమవుతున్నాయని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.
ఐదు రోజుల్లో నాలుగు సంచలన హత్యలు...
వైఎస్సార్ కడప జిల్లాలో ఐదురోజుల వ్యవధిలో నాలుగు సంచలన హత్యలు వెలుగు చూశాయి. ఘర్షణ నేపథ్యంలో కుటుంబ సభ్యుల్ని చికిత్సలకు రిమ్స్‌కు తీసుకెళ్లిన ఆలంఖాన్‌పల్లెకు చెందిన పెద్ద దస్తగిరిని(53) వేటాడి, వెంటాడి రిమ్స్‌లో సోమవారం వేకువజామున హత్య చేశారు. ఈ హత్య మరువక ముందే బుధవారం రాత్రి వల్లూరు బస్టాప్ వద్ద వెంకటసుబ్యయ్య(45) అనే వ్యక్తిని కిరాతకంగా హత్య చేశారు. శుక్రవారం మధ్యాహ్నం మైనర్‌బాలికను గొంతు కోసి హత్య చేసిన ఉదంతం ఖాజీపేటలో వెలుగు చూసింది. రాజుపాలెం మండలం పర్లపాడు గ్రామంలో మహేష్ అనే యువకుడ్ని చరణ్ కత్తితో గొంతులో పొడిచి హత్యచేశాడు. ఈ హత్యోదంతాలు పరిశీలిస్తే పోలీసుల ప్రతిష్ట మంటగలుస్తోంది. శాంతి భద్రతలు కాపాడాల్సిన వ్యవస్థలో అవినీతి తాండవం చేస్తుండడమే కారణమని పరిశీలకులు ఆరోపిస్తున్నారు.
కొల్కిరాని మైనర్ బాలిక హత్య కేసు...
గండికోట మైనర్ బాలిక హత్య కేసు దర్యాప్తులో పోలీసు అధికారుల క్షేత్రస్థాయి కృషి నీరుగారిపోయింది. ఇప్పటీకీ కేసు కొల్కిరాలేదు. అప్పటి ఎస్పీ అశోక్‌కుమార్‌తో పాటు ప్రస్తుత ఎస్పీ షల్కే నచికేత్ విశ్వనాథ్ పర్యవేక్షించినా ఎలాంటి ప్రయోజనం లేదు. పలు రకాలుగా విశ్లేషణ చేశారు. సీసీ పుటేజీల ఆధారంగా అనుమానితులను విచారించారు. టవర్ లోకేషన్ ద్వారా ఫోన్‌కాల్స్ విశ్లేషణ చేశారు. అనేక సాంకేతిక వ్యవహారాలు పొందుపర్చి దర్యాప్తు చేసినా ఫలితం లేదు. దీనిని బట్టి పోలీసు వ్యవస్థ ఎలాంటి దుస్థితిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చునని విశ్లేషకులు వాపోతున్నారు.
హత్యకు గురైన
పెద్ద దస్తగిరి (ఫైల్)
హత్యకు గురైన
వెంకట సుబ్బయ్య
పోలీసుశాఖలో కొంతమంది అధికారులపై నిత్యం అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. మరికొంతమంది అధికారులు చట్టాన్ని విస్మ రించి, ఏకపక్ష చర్యలే ఏకై క అజెండాగా పనిచేస్తున్నారు. ఇంకొంతమంది వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించి తదనుగుణంగా చర్యలకు దిగుతున్నారు. పోలీసుశాఖలో అంతర్గతంగా అనేక ఆనైతిక చర్యలు తెరపైకి వస్తున్నాయి. గతంలో కడప టూటౌన్, జమ్మలమడుగు సీఐలుగా పనిచేసిన అధికారులపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. మరోవైపు పులివెందుల రూరల్ సీఐ వెంకటరమణ, సింహాద్రిపురం ఎస్‌ఐ అనిల్‌కుమార్‌లు రూ.1.5లక్షలు లంచం తీసుకుంటుండడగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఇలాంటి ఇరోపణలు తెరపైకి రాగానే ప్రక్షాళన దిశగా ప్రత్యేక చర్యలు చేపట్టిన దాఖలాలు లేవని పలువురు వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పోలీసుశాఖ పట్ల సామాన్యులకు గౌరవం లోపించి అసాంఘిక శక్తులు అవతరిస్తున్నట్లు పలువురు వెల్లడిస్తున్నారు. ఇప్పటికై నా ‘కన్పించని నాలుగో సింహం’ప్రజల మాన, ప్రాణ, ఆస్తి రక్షణకు చర్యలు చేపట్టాలని ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నారు.
మొన్న దస్తగిరి, నిన్న వెంకటసుబ్బయ్య, నేడు మైనర్ బాలిక హత్య
వరుస హత్యలతోమసకబారుతున్న పోలీస్ ప్రతిష్ట
ప్రక్షాళన దిశగాఅడుగులు వేయని యంత్రాంగం
ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టినామార్పు శూన్యం
లంచావతారాలుగా డబుల్,ట్రిపుల్ స్టార్ అధికారులు
రెడ్ బుక్ పాలనతో రాష్ట్రంలో అటవిక రాజ్యం కొనసాగుతోందని మహిళాలోకం ఆరోపిస్తోంది. మహిళలపై సామూహిక అత్యాచారాలు, చిన్నారుల హత్యోదంతాలు అందుకు నిదర్శనంగా చెప్పుకొస్తున్నారు. దిశ యాప్ కొనసాగి ఉంటే బద్వేల్ విద్యార్థిని దస్తగిరమ్మకు రక్షణ లభించేదని పలువురు అప్పట్లో ఆరోపించారు. మద్యం వ్యాపారం పట్ల ఉన్న ఆసక్తి యువతులు, మహిళలలు మాన ప్రాణాలు రక్షించడంలో కన్పించడం లేదని పలువురు వాపోతున్నారు. పైగా ఏకపక్ష చర్యలతో పోలీసుశాఖ అభాసుపాలవుతోంది. ప్రత్యేకించి పోలీసు అధికారులు చట్టానికి లోబడి విధులు నిర్వర్తించడం కంటే కొంతమంది అధికారులు అధికారంలో ఉన్న నేతల మొప్పు కోసం పనిచేసేందుకే ఇష్టపడుతున్నారు. ఈక్రమంలో అక్రమ కేసులు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు లాంటి అత్యున్నత న్యాయ స్థానం తప్పుబట్టినా అలాంటి పోలీసు అధికారుల తీరులో మార్పు లభించలేదని పలువురు వెల్లడిస్తున్నారు.


