మదనపల్లె టౌన్: మదనపల్లె నూతన డీఎస్పీగా పావనిని నియమిస్తూ డీజీపీ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో మదనపల్లె డీఎస్పీగా మహేంద్ర విధులు నిర్వర్తించేవారు. ఆయన సెలవులో వెళ్లడంతో ఆయనస్థానంలో కృష్టా జల్లా గన్నవరం ఎస్డీపీఓగా పనిచేస్తున్న పావనిని మదనపల్లెకు బదిలీ చేశారు.
పుంగనూరు: పుంగనూరు సమీపంలోని చీమనపల్లె వద్ద ఉన్న హజ్రత్‌జాన్ పాక్‌షావలిబాబా, ఫకీర్‌షావలిబాబా వారి ఉరుసు శుక్రవారం రాత్రి గంధంతో ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే ఉరుసు కోసం దర్గాను విద్యుత్ దీపాలతో అలంకరించారు.ఫకీర్ల వాయిద్యాలతో దర్గాలో దువ్వా చేశారు. శని, ఆదివారాలలో ముంబైకి చెందిన అఫ్రిన్‌సుల్తానా, మైసూర్‌కు చెందిన సలీంరిష్టి, గుజరాత్‌కు చెందిన ఆసిఫ్‌అజ్మీర్, ఇంతేజుర్‌రిష్టిలతో ఉరుసు , ఖవ్వాలి పాటల పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఉరుసుకు వచ్చే వేలాది మంది భక్తులకు ప్రతి రోజు దర్గా వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఉరుసులో కులమతాలకతీతంగా హిందూముస్లింలు పాల్గొనడం గమనార్హం.
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: ఈ నెల 26 నుంచి ఆంధ్ర ప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ 2026–27 విద్యా సంవత్సరానికి విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి జిల్లాల్లో రాష్ట్ర క్రీడా అకాడమీల పున:స్థాపన ప్రక్రియ ప్రారంభించిస్తున్నట్లు డీఎస్‌డీఓ గౌస్ బాషా తెలిపారు. శుక్రవారం కడపలోని డీఎస్‌ఏ క్రీడామైదానంలో విలేకరుతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడాకారుల అభివద్ధికి పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయడం,నాణ్యమైన శిక్షణ వసతులు కల్పించడం దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు. 15 సంవత్సరాలు పైబడిన, 19 సంవత్సరాల లోపు వయసుగల క్రీడాకారులు (2008 జనవరి1 నుంచి 2011 జనవరి 1 జన్మించినవారు ) క్రీడాకారుల ప్రవేశానికి అర్హులని తెలిపారు.
సిద్దవటం: రెండు దశల్లో 2027 జనాభా లెక్కల సేకరణ కార్యక్రమం ఉంటుందని జిల్లా సెన్సెస్ ఇన్‌చార్జి మోహన్ రమణ తెలిపారు. సిద్దవటం జెడ్పీ హైస్కూల్‌లో 2027 సెన్సెస్ కార్యక్రమంపై ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు శుక్రవారం శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మోహన్ రమణ, చీఫ్ ప్లానింగ్ అధికారి హజరతయ్యలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏఎస్‌ఓ శివప్రసాద్ మాట్లా డుతూ సెన్సెస్ మొదటి దశ ఆంధ్రప్రదేశ్‌లో మే 1 నుంచి 30 వరకు ఉంటుందన్నారు. జన గణన రెండో దశ 2027 జనవరి, ఫిబ్రవరి నెలల్లో జరుగుతుందన్నారు. ఎవరికి వారే స్వీయ గణన ఏప్రిల్ 16 నుంచి 30వ తేదీ వరకు చేసుకోవచ్చన్నారు.
ప్రొద్దుటూరు: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మావిగన్‌ను రాజధానిగా ప్రతిపాదన చేసినప్పటి నుంచి ప్రకంపనలు మొదలయ్యాయని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. శుక్రవారం ప్రొద్దుటూరులోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అటు టీడీపీలోనూ, ఇటు జనసేన పార్టీలోనూ, పచ్చ మీడియాకు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు ఇలా .. వారందరి హృదయాల్లో ప్రకంపనలే వీస్తున్నాయని తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణం సాధ్యం కాదని చెప్పడంతోపాటు రాజధాని నిర్మాణానికి రూ.2 లక్షల కోట్లు అవసరమవుతుందని, కేవలం రూ.20 వేల కోట్లతో విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం పరిధిలో మావిగన్‌ను నిర్మించవచ్చని జగన్ సూచించారన్నారు. రాష్ట్రానికి ఇది గ్రోత్ ఇంజిన్‌గా పని చేస్తుందని జగన్ తెలిపారన్నారు. ఈ ప్రతిపాదనను పచ్చ మీడియా, కూటమి ప్రభుత్వం ఏమాత్రం అంగీకరించే పరిస్థితుల్లో లేవన్నారు. కొత్తగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మావిగన్ ప్రతిపాదన చేసి జగన్ జోకర్ అయ్యారని విమర్శించారన్నారు. జగన్ జోకర్ కాదని, మంచిని సూచించే మెంటర్ అని స్పష్టం చేశారు. ఏనాడో శివరామకృష్ణన్ కమిటీ అమరావతి నిర్మాణం ఏమాత్రం ఆచరణ సాధ్యం కాదని తెలిపిందన్నారు. ఇక్కడ రాజధానిని నిర్మిస్తే భూకంపాల ప్రమాదం ఉంటుందని, వరదలతో ఇబ్బందులు ఎదురవుతాయని, పునాదులు నిర్మించడానికి వీలు కాదని చెప్పడం జరిగిందన్నారు. మూడు కారులు పండే పొలాలను నాశనం చేస్తున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల కారణంగా అమరావతిలో రాజధానిని నిర్మించడం సాధ్యం కాదని చెప్పడం జరిగిందన్నారు. ఇక్కడ రాజధాని నిర్మాణం చేపడితే అందరికీ నష్టం వస్తుందన్నారు.


