రాయచోటి టౌన్ : భారతదేశంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)తో ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచి ఉందని ప్రజాసంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం రాయచోటి ఎన్‌జీవో హోంలో సహారా వెల్ఫేర్, పౌరహక్కుల సంఘం నాయకులు రవిశంకర్ ఆధ్వర్యంలో ప్రజా సంఘాల నేతృత్వంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది ఎస్. ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎస్‌ఐఆర్ చేపట్టిన ఓటరు సవరణ ద్వారా అన్ని రాష్ట్రాలలో అనేక మంది తమ ఓటు హక్కును కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రాష్ట్రాలలో తమ ఓటు హక్కును కోల్పోయి కోర్టుకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయన్నారు. అనంతరం పౌరహక్కుల సంఘం నాయకులు రవిశంకర్ మాట్లాడుతూ అధికారాన్ని శాశ్వతం చేసుకోవడానికి ఇలా ఎస్‌ఐఆర్ అమలు చేస్తున్నారని ఆరోపించారు. మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ ఎస్‌ఐఆర్ జరుగుతుందని, దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లో లక్షల ఓట్లు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఓటు హక్కుపై మాట్లాడితే అర్బన్ నక్సలైట్ అని ముద్రవేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు మన్సూర్ ఆరోపించారు. అంబేడ్కర్ సేన నాయకులు పల్లం తాతయ్య మాట్లాడుతూ వెనుకబడిన, దళిత, గిరిజన, ముస్లిం ఓట్లను లక్ష్యంగా చేసుకొని ఈ ఎస్‌ఐఆర్ నడుపుతున్నారని ఆరోపించారు. అనంతరం ఎస్‌ఐఆర్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రీషియన్ అసోషియేషన్ రాష్ట్ర నాయకులు అస్లామ్, అప్తాబ్, రవి, న్యాయవాది హిదాయతుల్లా, రవిశంకర్, ఆవాజ్ నాయకులు గౌస్, ఎరువుల సంఘం నాయకులు మోహన్, బండపల్లి రవి, తదితరులు పాల్గొన్నారు.


